కొల్లాపూర్ నియోజకవర్గంలోని జటప్రోలులో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు పూర్తయిన, ప్రస్తుతం కొనసాగుతున్న, ఇంకా చేపట్టాల్సిన పనులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పాఠశాల భవన నిర్మాణంతో పాటు అక్కడ ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాలపై కూడా మంత్రి ఆరా తీశారు. విద్యార్థులకు అవసరమైన వసతులు అందుబాటులో ఉండేలా ప్రణాళికను అమలు చేయాలని అధికారులకు సూచించారు. పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని అధికారులకు స్పష్టం చేశారు. నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణ సామగ్రిని వినియోగిస్తూ, ప్రతి దశలోనూ పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు.
మరోవైపు ఈ పనులు నిర్ణయించిన గడువులోగా పూర్తి చేయాలని మంత్రి సూచించారు. కాంట్రాక్టర్లు, ఇంజినీరింగ్ అధికారులు సమన్వయంతో పనిచేసి పెండింగ్ పనులను త్వరగా చేయాలని పేర్కొన్నారు. పాఠశాల అందుబాటులోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణంతో పాటు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు.
అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు అక్కడ ఉన్న క్రీడాకారులతో కొద్దిసేపు ముచ్చటించారు.. ఈ సందర్భంగా సరదాగా క్రికెట్ ఆడుతూ సందడి చేశారు. విద్యార్థులు భవిష్యత్తులో చదువుతో పాటు క్రీడల పై కూడా ఆసక్తి కనబరచాలని పేర్కొన్నారు. శారీరక దృఢత్వం, క్రమశిక్షణ పెంపొందించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని ఈ సందర్భంగా తెలిపారు.
ఇక విద్యా సంస్థల్లో పుస్తక పరిజ్ఞానంతో పాటు క్రీడా ప్రతిభను ప్రోత్సహించే వాతావరణం కూడా ఎంతో అవసరమని మంత్రి గుర్తు చేశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సమగ్ర అభివృద్ధికి అనుకూలమైన వసతులు అందేలా నిర్మాణ దశ నుంచే ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.


