TG: దసరా పండుగ వేళ ఊరెళ్లే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు తెలంగాణ ఆర్టీసీ పక్కా ప్లాన్ రెడీ చేసింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏకంగా 7,000 ప్రత్యేక బస్సులను రోడ్డెక్కించేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. రద్దీ తీవ్రతకు అనుగుణంగా ఎక్కడికక్కడ సర్వీసులు అందుబాటులో ఉండేలా అధికారులు పకడ్బందీ ప్రణాళిక రూపొందించారు.
జోన్ల వారీగా ప్రత్యేక సర్వీసుల వివరాలు ఇవే:
కరీంనగర్ జోన్ పరిధిలో 3,533 బస్సులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. కరీంనగర్‌కి 1,175, నిజామాబాద్‌కి 719, ఖమ్మంకి 678, వరంగల్‌కి 530, ఆదిలాబాద్‌కి 431 బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక హైదరాబాద్ జోన్ పరిధిలో 2,155 బస్సులు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. నల్గొండ 815, మహబూబ్ నగర్ 645, రంగారెడ్డి 440, మెదక్ 255 స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశామన్నారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అదనంగా మరో 1,312 ప్రత్యేక బస్సులను కేటాయించినట్లు వెల్లడించారు.
కీలక తేదీల్లో ఫుల్ రద్దీ..
ఈ నెల 9, 10 తేదీలతో పాటు 16, 17 తేదీల్లో ఊళ్లకు వెళ్లే వారి సంఖ్య భారీగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే పండుగ ముగిసిన తర్వాత రిటన్ జర్నీ కోసం ఈ నెల 25, 26 తేదీల్లో కూడా ప్రయాణికుల రద్దీకి తగ్గట్లుగా బస్సులను నడిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఇక దసరా స్పెషల్ బస్సులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో రూల్స్ ప్రకారమే టికెట్ చార్జీలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆర్టీసీ వర్గాలు స్పష్టం చేశాయి.


