తెలంగాణ

Hyderabad: నగరంలో NRIల ఆస్తులే టార్గెట్ గా నకిలీ డాక్యుమెంట్ల రాకెట్ గుట్టురట్టు!..

రచన: Venu•••6 నిమిషాల పఠనం

నగరంలో నకిలీ డాక్యుమెంట్లతో రియల్ ఎస్టేట్ దందాలు చేస్తూ, విదేశాల్లో ఉన్న వారి ఆస్తులను కాజేస్తున్న ముఠాను తాజాగా స్పెషల్ ఆపరేషన్ టీమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్, ఎల్‌బీ నగర్ పరిధిలో విస్తృతంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు.. ముఠాలోని కీలక సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.

భూమి కోసం యుద్దాలు సుమారుగా 10,000 సంవత్సరాల క్రితం మొదలైనట్టు చరిత్ర చెబుతుంది. అప్పుడు మొదలైన ఈ పోరు.. మనిషి ఎంతగా అభివృద్ధి చెందుతున్నాడో.. అంతే వేగంగా ఆశలను పెంచుకుంటూ తనకున్న భూమి సరిపోదని అత్యాశతో ఇతరుల ఆస్తులను కాజేయడం మొదలుపెట్టాడు. ఈ భూకబ్జాలో రాజకీయ నాయకుల, అధికారుల అండదండలతో ఏర్పడిన మాఫియా ఆరితెరి పోయిందనే విమర్శలున్నాయి..

నాటి నుండి నేటి వరకు ఇదే తంతు కొనసాగుతుంది. చస్తే పూడ్చడానికి ఆరడుగుల జాగా.. బ్రతకడానికి సరిపడా వంద నుండి సుమారు 300 వందల గజాల జాగా చాలన్న విషయం అందరికీ తెలుసు.. కానీ పలుకుబడి, అధికారం ఉన్న వారికి వందలు, వేల ఎకరాల్లో జాగలుండటం.. అవి చాలవన్నట్టు కంటికి నచ్చిన భూములను నొక్కేయడం నిత్యకృత్యంగా మారిందనే ఆరోపణలున్నాయి.. ఇక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్ని వేల ఎకరాల భూములను ప్రభుత్వ పెద్దలు.. రాజకీయ నాయకులు నొక్కేసినట్టు రోజు కథనాలు రావడం తెలిసిందే..

ఇలాంటి వార్తల నేపథ్యంలో సికింద్రాబాద్‌లో నకిలీ డాక్యుమెంట్లతో స్థలాలను రిజిస్ట్రేషన్ చేస్తున్న ముఠా అరెస్ట్ అవడం కలకలం రేపుతుంది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలో నకిలీ డాక్యుమెంట్లతో రియల్ ఎస్టేట్ దందాలు చేస్తూ, విదేశాల్లో ఉన్న వారి ఆస్తులను కాజేస్తున్న ముఠాను తాజాగా స్పెషల్ ఆపరేషన్ టీమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్, ఎల్‌బీ నగర్ పరిధిలో విస్తృతంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు.. ముఠాలోని కీలక సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.

వీరి వద్ద నుంచి భారీగా నకిలీ స్టాంప్ పేపర్లతో పాటు స్టాంపులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఇక ఈ ముఠా మోసాల తీరు పోలీసులను సైతం విస్మయానికి గురిచేసింది. ఏకంగా 1982 నాటి పాత డాక్యుమెంట్లను సృష్టించి.. వాటి ఆధారంగా నకిలీ జీపీఏ పత్రాలు తయారు చేసేవారు. ముఖ్యంగా అమెరికా వంటి విదేశాలలో నివసిస్తున్న ఎన్‌ఆర్‌ఐ ల ఖరీదైన స్థలాలు, ఆస్తులపై కన్నేసిన కేటుగాళ్లు.. వారి పేర్లతో నకిలీ గుర్తింపు కార్డులు, సేల్ డీడ్‌లు సృష్టించి.. అసలు భూయజమానులకు తెలియకుండానే రిజిస్ట్రేషన్లు పూర్తి చేసి కోట్ల రూపాయల దందాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.

ఇంతటితో ఆగని ఈ ముఠా ఆగడాలు.. బ్యాంకుల్లో తాకట్టులో ఉన్న ఆస్తులను విడిపించేందుకు కూడా నకిలీ మార్టిగేజ్ రిలీజ్ డాక్యుమెంట్లను రూపొందించిందించడం ఆందోళనకరంగా మారింది.. ఈ క్రమంలో ఇప్పటివరకు దాదాపు 8 ప్రాంతాల్లో నకిలీ పత్రాలతో మార్టిగేజ్ ప్రాపర్టీలను రిలీజ్ చేసినట్లు SOT పోలీసులు గుర్తించారు. ఈ రాకెట్‌లో భాగస్వాములుగా ఉన్న మరికొందరిని ఎల్‌బీ నగర్‌లో అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్టు సమాచారం..

మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఇటీవలి కాలంలో నకిలీ పత్రాలు, భుధార్, జీపీఏల పేరిట ల్యాండ్ గ్రాబింగ్ ముఠాలు విజృంభిస్తున్నాయి. శంషాబాద్, మహేశ్వరం, కీసర, ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో కూడా పాత లేఔట్లలో ఉన్న ఓపెన్ ప్లాట్లకు నకిలీ టైటిల్ డీడ్లు సృష్టించి, రాత్రికి రాత్రే సరిహద్దు రాళ్లు పాతి కబ్జాలకు పాల్పడుతున్న పలు ముఠాలు నకిలీ వెంచర్లు చూపించి రూ.కోట్లు కొల్లగొడుతున్న ఉదంతాలు వరుసగా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై వారిని అరెస్ట్ చేశారు.

ఇక నగర పోలీసు యంత్రాంగం ఈ అక్రమాలపై తీవ్రంగా స్పందించింది. ఆస్తుల నకిలీ దందా, అక్రమ కబ్జాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. నకిలీ పత్రాలతో భూములు కబ్జా చేసినా, అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడినా సహించేది లేదని.. అలాంటి నేరస్థులపై 'పీడీ యాక్ట్' నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రాపర్టీలు కొనుగోలు చేసేటప్పుడు ప్రజలు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పత్రాల అథెంటిసిటీని తప్పని సరిగా తనిఖీ చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.

#Secunderabad Fake Document Gang#SOT Police Arrest#Land Grabbing Scam#Fake GPA Registration#NRI Property Fraud#Hyderabad Real Estate Crime#Fake Stamp Papers Seized#Telangana Land Mafia Arrest
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి