దేశ రాజధాని ఢిల్లీలోని ఈశాన్య ప్రాంతం సీమాపురిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. న్యూ సీమాపురి ఫిష్ మార్కెట్ సమీపంలోని ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఇక ప్రమాదం తాలూకు సమాచారం అందుకున్న ఢిల్లీ ఫైర్ సర్వీస్ సిబ్బంది 4 ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. రాజీవ్ గాంధీ ఆసుపత్రి సిబ్బందిని అప్రమత్తం చేసి, శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
మరోవైపు ఈ మహానగరంలో భవనాలు కూలిపోవడం ఇది మొదటిసారి కాదు. గత కొన్నేళ్లుగా ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని చాందినీ చౌక్, ముస్తఫాబాద్, కరౌల్ బాగ్, ముఖర్జీ నగర్, ఉత్తమ్ నగర్ వంటి ఇరుకైన ప్రాంతాల్లో పదుల సంఖ్యలో భవనాలు నేలమట్టమైన ఘటనలు కథానాలుగా వచ్చాయి.. స్థానిక నివేదికల ప్రకారం.. గడిచిన మూడేళ్ల వ్యవధిలోనే రాజధాని ప్రాంతంలో చోటుచేసుకున్న వివిధ భవన ప్రమాదాల్లో 60 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు..
వందలాది మంది తీవ్రంగా గాయపడి అంగవైకల్యానికి గురయ్యారు. చిన్న వర్షం కురిసినా, పక్కనే తవ్వకాలు జరిపినా దశాబ్దాల నాటి పాత భవనాలు, నిబంధనలకు విరుద్ధంగా కట్టిన నాసిరకం నిర్మాణాలు నిమిషాల్లో కుప్పకూలుతుండటం ఆందోళనకరంగా మారింది.. ఈ నేపథ్యంలో వరుస ప్రమాదాలకు అసలు బాధ్యులు ఎవరన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.. ఇలాంటి ప్రమాధాలకు ప్రధాన కారణం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ (MCD) అధికారులు, అక్రమ నిర్మాణదారులు, బిల్డర్ల అత్యాశ అనే ఆరోపణలున్నాయి.
రెండు అంతస్తులకు మాత్రమే అనుమతులు తీసుకొని, అక్రమంగా నాలుగు-ఐదు అంతస్తులు నిర్మిస్తున్నా అధికారులు కళ్లు అప్పగించి చూడటం, అవినీతికి లొంగి అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం లేదా చూసీచూడనట్లు వదిలేయడమే ఈ దారుణాలకు ప్రధాన మూలంగా పేర్కొంటున్నారు.. మరోవైపు నిర్మాణంలో వాడే సిమెంట్, స్టీల్ నాణ్యతా ప్రమాణాలను అస్సలు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి.
అలాగే భవనం వయస్సు ఎంత? అది నివాసానికి సురక్షితమేనా? అనే స్ట్రక్చరల్ సేఫ్టీ ఆడిట్ (Structural Safety Audit) నిర్వహించడంలో ఎంసీడీ యంత్రాంగం దారుణంగా విఫలమవుతోందనే ఆరోపణలున్నాయి. ఇక ప్రమాదం జరిగిన ప్రతిసారీ విచారణ కమిటీలు వేయడం, కొన్ని రోజుల పాటు హడావుడి చేయడం, ఆ తర్వాత కేసును మూసివేయడం అధికారులకు పరిపాటిగా మారిందని.. అధికారులు ఇంటి నిర్మాణాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తే ఇలాంటి ప్రమాదాలను కొంతవరకైన నివారించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..
అదేవిధంగా నాసిరకం నిర్మాణాలకు బాధ్యులైన బిల్డర్లపై కఠిన కేసులు పెట్టడంలోనూ, అనుమతులిచ్చిన అధికారులను ఉద్యోగాల నుంచి తొలగించడంలోనూ తీవ్ర నిర్లక్ష్యం వ్యక్తమవుతోందని ఫలితంగా ఏటా వందల మంది అమాయకులు భవనాల శిథిలాల కింద నలిగి ప్రాణాలు విడుస్తున్నా, పాలకుల తీరులో మార్పు రాకపోవడం వారి నిర్లక్ష్యానికి సాక్ష్యంగా నిలుస్తుందని అంటున్నారు.
ఇక నుండి అయిన చట్టాలను కాగితాలకే పరిమితం చేయకుండా అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు చేపట్టడంతో పాటు, ప్రమాదకర స్థితిలో ఉన్న పాత భవనాలకు వెంటనే స్ట్రక్చరల్ ఆడిట్ పూర్తి చేసి ఖాళీ చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అప్పుడే సీమాపురి తరహా ప్రమాదాలకు అడ్డుకట్ట పడుతుంది, పౌరుల ప్రాణాలకు భద్రత లభిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..


