తెలంగాణ

Graduates MLC Elections: కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ టికెట్ చిచ్చు.. బీఆర్ఎస్‌తో టచ్‌లోకి అసమ్మతి నేత.. కారెక్కుతారా?

రచన: Mahesh••5 నిమిషాల పఠనం

Graduates MLC Elections:తెలంగాణలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రధాన పార్టీల్లో అసమ్మతి మంటలను రాజేస్తున్నాయి. మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ పట్టభద్రుల స్థానానికి అధికార కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా సామ రామ్మోహన్ రెడ్డిని ప్రకటించడంతో గాంధీ భవన్‌లో ఒక్కసారిగా అసంతృప్తి భగ్గుమంది.

Graduates MLC Elections:తెలంగాణలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రధాన పార్టీల్లో అసమ్మతి మంటలను రాజేస్తున్నాయి. మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ పట్టభద్రుల స్థానానికి అధికార కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా సామ రామ్మోహన్ రెడ్డిని ప్రకటించడంతో గాంధీ భవన్‌లో ఒక్కసారిగా అసంతృప్తి భగ్గుమంది. ఈ టికెట్‌పై గంపెడాశలు పెట్టుకున్న టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. "త్యాగం ఒకరిది.. భోగం మరొకరిదా?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చేందుకు గులాబీ బాస్‌లతో రాయబారాలు మొదలుపెట్టడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.

గులాబీ గూటికి రాయబారాలు.. హస్తం నేత పక్కచూపులు!

తనకు దక్కని సీటు మరెవరికీ దక్కకూడదన్న వ్యూహంతో హర్షవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ అగ్ర నాయకత్వంతో టచ్‌లోకి వెళ్లినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్‌ అధికారిక అభ్యర్థిని దెబ్బకొట్టేందుకు కారెక్కడానికి సైతం సిద్ధపడినట్లు తెలుస్తుంది. అయితే ఇక్కడే ఆయనకు గులాబీ నేతలు షాక్ ఇచ్చినట్లు సమాచారం. నిజానికి కాంగ్రెస్ పార్టీ రెండు పట్టభద్రుల స్థానాలనూ (వరంగల్-నల్గొండ-ఖమ్మం, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్) ఒకే సామాజిక వర్గానికి కేటాయించింది. దీనికి కౌంటర్‌గా బీఆర్ఎస్ మైండ్ గేమ్ స్టార్ట్ చేసినట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. వరంగల్ బైపోల్ బరిలో దిగిన రాకేశ్ రెడ్డికి టికెట్ ఇస్తూనే, హైదరాబాద్-పాలమూరు సీటును బలమైన బీసీ అభ్యర్థికి కేటాయించాలని ప్లాన్ చేసిందని ఇప్పటి వరకు ఉన్న సమాచారం. దీంతో కాంగ్రెస్ అసమ్మతి నేతకు టికెట్ హామీ ఇచ్చేందుకు బీఆర్ఎస్ పెద్దలు ససేమిరా అన్నట్లు తెలిసింది. "పార్టీలో చేరాలంటే బేషరతుగా రావాల్సిందే.. అంతేకానీ ఎమ్మెల్సీ సీటు ఆశించి వస్తే కుదరదు" అని గులాబీ నాయకత్వం కుండబద్దలు కొట్టినట్లు సమాచారం.

బీసీ ముదిరాజ్ కార్డుతో బీఆర్ఎస్ వ్యూహం.. రేసులో వీరేశ్!

మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానంలో అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన ముదిరాజ్ సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ కుమారుడు వీరేశ్ ముదిరాజ్ పేరును కేటీఆర్ పరిశీలిస్తున్నారట. సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి మూడు జిల్లాల ముఖ్య నేతలతో ఇప్పటికే పలుమార్లు భేటీ అయ్యారని తెలుస్తుంది. ఒకవైపు కాంగ్రెస్‌లో రెబల్ సెగలు పొగబెడుతుంటే, మరోవైపు బలమైన బీసీ అభ్యర్థితో క్షేత్రంలోకి దిగాలని గులాబీ దళం వ్యూహం రచిస్తోంది.

కారెక్కుతారా.. రెబల్‌గా బరిలో నిలుస్తారా?

కాంగ్రెస్‌లో సీటు దక్కక, అటు బీఆర్ఎస్‌లో టికెట్ హామీ లభించక హర్షవర్ధన్ రెడ్డి డైలమాలో పడినట్లు తెలుస్తుంది. అటు కమలం పార్టీ కూడా దేవరకద్ర నేత డోకూర్ పవన్ కుమార్ రెడ్డిని బరిలోకి దింపే యోచనలో ఉంది. ఈ పరిస్థితుల్లో హర్షవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ విధించిన షరతులకు తలొగ్గి గులాబీ తీర్థం పుచ్చుకుంటారా, లేక స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి కాంగ్రెస్ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి విజయవకాశాలకు గండి కొడతారా అనేది తెలియాల్సి ఉంది.

#Telangana Graduates MLC Elections#Graduates MLC Elections#Telangana MLC Elections#swechaaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి