Power Supply: రాష్ట్రంలో విద్యుత్ సరఫరాపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. రాజకీయ లబ్ధి కోసం విపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బుధవారం హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో మీడియాతో మాట్లాడారు భట్టి విక్రమార్క.
క్లిష్ట పరిస్థితుల్లోనూ కోతలు లేకుండా విద్యుత్ సరఫరా
ఎల్ నినో ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే విద్యుత్ డిమాండ్ అత్యధిక స్థాయికి చేరిందని ఆయన తెలిపారు. విద్యుత్ వినియోగం 19,892 మెగావాట్లకు చేరిందన్నారు. అయినప్పటికీ విద్యుత్ కోతలు లేకుండా నిరంతర కరెంటు అందిస్తున్నామని వివరించారు. దాదాపు 20 వేల మెగావాట్ల డిమాండ్‌ను కూడా సమర్థవంతంగా తట్టుకుని కరెంట్ అందిస్తున్నామన్నారు.
క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇంత జాగ్రత్తగా పవర్ సప్లయ్ చేస్తున్న సిబ్బందిని అభినందించాల్సింది పోయి కొంతమంది నాయకులు అదే పనిగా రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేయాలనే ఒక కుట్రపూరితమైన ఆలోచనతో తప్పుడు సమాచారం ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. లేని విషయాలను, అబద్దాలను పోగు చేసి ప్రచారం చేస్తున్నారని.. ఈ తరుణంలో తప్పనిసరిగా ప్రజలకు స్పష్టత ఇవ్వాలనే నేను బయటకు వచ్చానని భట్టి విక్రమార్క వెల్లడించారు.
ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్ర
''రాష్ట్రంలో విద్యుత్ సరఫరాపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఎల్ నినో ప్రభావం వల్ల గతేడాదితో పోలిస్తే ఈసారి విద్యుత్ ఉత్పత్తి తగ్గింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి జల విద్యుత్ 2వేల మెగావాట్ల ఉత్పత్తి తగ్గింది. సెప్టెంబర్ 30వ తేదీన రాష్ట్రంలో అత్యధికంగా 19 వేల 500 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదైంది. సెప్టెంబర్ నెలలో పీక్ డిమాండ్ యావరేజ్‌గా 15వేల మెగావాట్లుగా ఉంది.
గత ఏడాదితో పోలిస్తే ఈసారి 4వేల మెగావాట్ల డిమాండ్ పెరిగింది. ఎల్ నినో ప్రభావంతో ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పటికీ కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నాము. క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా పని చేస్తున్న విద్యుత్ సిబ్బందిని ప్రశంసించాల్సింది పోయి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కరెంటు సరఫరాపై అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్ర జరుగుతోంది'' అని భట్టి విక్రమార నిప్పులు చెరిగారు.
బొగ్గు సరఫరా లేకుండానే థర్మల్ పవర్ ప్లాంట్
యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను భట్టి విక్రమార్క ప్రస్తావించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ పాపం ఎవరిది? అని ఆయన నిలదీశారు. ఒక థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టే ముందు అందుకు అవసరమైన ప్రధానమైన ముడి సరుకు బొగ్గు అని, కోల్ సప్లయ్ ఉందో లేదో చూసుకునే థర్మల్ పవర్ ప్లాంట్ పెడతారని వ్యాఖ్యానించారు. కానీ అప్పటి ప్రభుత్వం అలా చేయలేదన్నారు. బొగ్గు అలాట్ మెంట్ కానీ, సరఫరా కానీ లేకుండానే యాదాద్రి పవర్ ప్లాంట్ ఎలా కట్టారని ప్రశ్నించారు. మినిమం కామన్ సెన్స్ లేకుండా అప్పటి ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటునకు స్థలం, డీపీఆర్, బొగ్గు కేటాయింపులు కీలకం అని స్పష్టం చేశారు భట్టి విక్రమార్క.
యాదాద్రి పవర్ ప్లాంట్‌తో ప్రభుత్వానికి నష్టం
సింగరేణి నుంచి యాదాద్రికి గ్రేడ్ 9 కోల్ సప్లయ్ చేస్తామని హామీ ఇచ్చి ఒప్పందం చేసుకున్నారని, అసలు అప్పట్లో సింగరేణి వద్ద ఆ గ్రేడ్ బొగ్గు నిల్వలు ఉన్నాయా అని నిలదీశారు. మొదటి నుంచి కోల్ అలాట్‌మెంట్ లేకుండానే యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టారని ఆరోపించారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌కు అసలు డీపీఆర్ ఉందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ఉన్న 14 బ్లాక్లులు మాతపడ్డాయని తెలిపారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌తో ప్రభుత్వానికి నష్టమని భట్టి విక్రమార్క తెలియజేశారు.












