తెలంగాణ

ఎట్టి పరిస్థితుల్లో పవర్ సెక్టార్‌ను ప్రైవేట్‌పరం చేయం- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రచన: NK•••7 నిమిషాల పఠనం

విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తోంది అంటూ బీఆర్ఎస్ చేసిన ఆరోపణలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. వారి మాటల్లో నిజం లేదన్నారు. బీఆర్ఎస్ నేతలది తప్పుడు ప్రచారం ఎదురుదాడికి దిగారు.

Power Sector: విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేసేందుకు రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తోంది అంటూ బీఆర్ఎస్ చేసిన ఆరోపణలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. డిస్కంలు, జెన్ కో, ట్రాన్స్ కో ప్రైవేటీకరణ అంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. వారి మాటల్లో నిజం లేదన్నారు. బీఆర్ఎస్ నేతలది తప్పుడు ప్రచారం అంటూ ఎదురుదాడికి దిగారు.

ప్రభుత్వ రంగ సంస్థలను బలహీనపరచాలని చూస్తున్నారని, ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్ర జరుగుతోందని విరుచుకుపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో పవర్ సెక్టార్ ను ప్రైవేటుపరం చేయము అని భట్టి విక్రమార్క తేల్చి చెప్పారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అటువంటి ఆలోచనే లేదని స్పష్టం చేశారు. అటువంటి చర్చ కూడా జరగలేదని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. బుధవారం ప్రజాభవన్‎లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రం మీద ఏ మాత్రం ప్రేమ ఉన్నా తప్పుడు ప్రచారాలు చేయొద్దు

తెలంగాణ రాష్ట్రం మీద ఏ మాత్రం ప్రేమ ఉన్నా ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని బీఆర్ఎస్ నాయకులకు హితవు పలికారు భట్టి విక్రమార్క. మీకు మీరే ఊహించుకుని తప్పుడు ప్రచారం చేయటం కరెక్ట్ కాదని మాజీ మంత్రి హరీశ్ రావుపై ధ్వజమెత్తారు. పదేళ్లు మంత్రిగా ఉన్న హరీశ్‌రావు అలా మాట్లాడటం సరికాదన్నారు. విద్యుత్‌ సిబ్బందిని కించపరిచే విధంగా నేతలు విమర్శలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మీకు మీరే ఊహించుకుని మాట్లాడటం వల్ల రాష్ట్రానికే నష్టం అని హెచ్చరించారు.

నాయకులు బాధ్యతగా వ్యవహరించాలి

డిస్కంలు, జెన్ కో, ట్రాన్స్ కోను ప్రైవేటుపరం చేస్తున్నారనే తప్పుడు ప్రచారం వెనుక ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలనో, రాజకీయ లబ్ది పొందాలనో ప్రయత్నం ఉందని భట్టి విక్రమార్క ఆరోపించారు. మీ రాజకీయ లబ్ది పొందడం కంటే రాష్ట్రాన్ని ఎక్కువగా నష్టపరుస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ రాజకీయ లబ్ది కంటే ప్రజల ప్రయోజనాలు ముఖ్యం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని బాధ్యత గల నాయకులుగా వ్యవహరించాలని హితవు పలికారు. ఏది మాట్లాడినా వాస్తవాలు తెలుసుకుని క్రాస్ చెక్ చేసుకుని మాట్లాడాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు భట్టి విక్రమార్క.

క్లిష్ట పరిస్థితుల్లోనూ విద్యుత్ సరఫరా

''ఎల్‌నినో కారణంగా రాష్ట్రంలో విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పెరిగింది. 20 వేల మెగావాట్ల డిమాండ్‌ ఉన్నా విద్యుత్‌ కోతలు లేకుండా సరఫరా చేస్తున్నాం. క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రజలకు ఇబ్బంది లేకుండా పని చేస్తున్న విద్యుత్ సిబ్బందిని ప్రశంసించాల్సింది పోయి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. విద్యుత్ సరఫరాపై అబద్ధాలు ప్రచారం చేస్తూ కొందరు నాయకులు తప్పుడు ప్రచారంతో ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారు. డిస్కమ్‌లు, ట్రాన్స్‌కో, జెన్‌కోను ప్రైవేటీకరించే ఆలోచనే లేదు. విద్యుత్‌ సంస్థలను లిస్టెడ్‌ కంపెనీలుగా మార్చే ప్రతిపాదన లేదు'' అని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారు

''తీవ్రమైన ఇబ్బందుల్లోనూ ఇంత జాగ్రత్తగా పవర్ సప్లయ్ చేస్తున్న సిబ్బందిని అభినందించాల్సింది పోయి కొంతమంది నాయకులు అదేపనిగా రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేయాలనే ఒక కుట్రపూరితమైన ఆలోచనతో తప్పుడు సమాచారం ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. లేని విషయాలను, అబద్దాలను పోగు చేసి ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో తప్పనిసరిగా ప్రజలకు స్పష్టత ఇవ్వాలనే నేను బయటకు వచ్చా. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో మీ ముందుకు వచ్చా. డిస్కంలు, ట్రాన్స్ కో, జెన్ కోను ప్రైవేటుపరం చేయబోతున్నారు.. విద్యుత్ సంస్థలను లిస్టెడ్ కంపెనీలుగా మార్చబోతున్నారు అని బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

వాస్తవం ఉందో లేదో తెలుసుకోకుండా ప్రచారం చేస్తున్నారు. పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ ను కాంగ్రెస్ ప్రభుత్వం నమ్ముతుంది. ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతానికి కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉంది. నెహ్రూ ఆర్థిక విధానాలను పూర్తిగా నమ్మేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో పాలన చేస్తోంది. మిక్స్డ్ ఎకానమీ, పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ బలంగా ఉండాలి అని కోరుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ పాలన చేస్తోంది అనే విషయాన్ని ప్రతిపక్షాలు గుర్తుంచుకోవాలి'' అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

#Power Sector#Privatisation#Bhatti Vikramarka#Harish Rao#Telangana Congress#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి