సినిమా

TOXIC: టాక్సిక్ గుణపాఠం నేర్చుకోవాల్సిందే

రచన: Mahesh6 నిమిషాల పఠనం

సినిమా ఎంత పెద్దదైనా.. హీరోకు ఎంతటి స్టార్‌డమ్ ఉన్నా.. ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించేది మాత్రం కంటెంటే. తాజాగా విడుదలైన యశ్ ‘టాక్సిక్’, రవితేజ ‘ఇరుముడి’ సినిమాలు ఈ విషయాన్ని మరోసారి బలంగా నిరూపిస్తున్నాయి.

TOXIC: సినిమా ఎంత పెద్దదైనా.. హీరోకు ఎంతటి స్టార్‌డమ్ ఉన్నా.. ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పించేది మాత్రం కంటెంటే. తాజాగా విడుదలైన యశ్ ‘టాక్సిక్’, రవితేజ ‘ఇరుముడి’ సినిమాలు ఈ విషయాన్ని మరోసారి బలంగా నిరూపిస్తున్నాయి. ఒకటి భారీ అంచనాలు, పాన్ ఇండియా స్టార్ ఇమేజ్‌తో థియేటర్లలోకి వస్తే.. మరొకటి పెద్దగా హైప్ లేకుండా ప్రాంతీయ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఈ రెండు సినిమాల విషయంలో కనిపిస్తున్న సీన్ మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది.

‘కేజీఎఫ్’ తర్వాత యశ్ నుంచి వచ్చిన సినిమా కావడంతో ‘టాక్సిక్’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. భారీ బడ్జెట్, పాన్ ఇండియా మార్కెట్, స్టార్ హీరో ఇమేజ్.. వీటన్నింటితో సినిమాకు విపరీతమైన హైప్ వచ్చింది. మొదటి రోజే భారీ ఓపెనింగ్స్ కూడా దక్కాయి. కానీ సినిమా విషయంలో ప్రేక్షకుల నుంచి వచ్చిన మిక్స్‌డ్, నెగెటివ్ టాక్ ఆ తర్వాతి రోజుల్లో సినిమా లాంగ్ రన్‌పై గట్టి ప్రభావం చూపించింది. భారీ ఓపెనింగ్ ఉన్నా.. అదే స్థాయిలో వసూళ్ల జోరు కొనసాగించలేకపోయింది.

మరోవైపు ‘ఇరుముడి’ కథ టాక్సిక్‌కి పూర్తిగా భిన్నంగా నడిచింది.. ఇప్పటికీ నడుస్తోంది కూడా. రవితేజ హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి హైప్ లేకుండానే థియేటర్లలోకి వచ్చింది. అయితే ఈ చిత్రానికి రిలీజ్ అయిన తర్వాత వచ్చిన మౌత్ టాక్ అసలైన బలంగా మారింది. ప్రేక్షకులు సినిమాను చూసి మరో ప్రేక్షకుడికి చెప్పడం మొదలుపెట్టడంతో థియేటర్లలో క్రమంగా ఆక్యుపెన్సీ పెరిగింది. అలా మొదటి వారంలోనే భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్‌ను దాటినట్లు ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి.

ఇక్కడే అసలు సినిమా సక్సెస్ సీక్రెట్ బయటపడుతోంది. భారీ హైప్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాకు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోతే స్టార్ ఇమేజ్ కూడా ఎక్కువ కాలం కాపాడలేదని ‘టాక్సిక్’ పరిస్థితి చెబుతోంది. అదే సమయంలో కథను నమ్ముకుని, అనుకున్న కథను అనుకున్నట్టుగా తెరకెక్కించి, మేకింగ్‌లో క్వాలిటీ చూపిస్తే.. పెద్దగా ప్రచారం లేకపోయినా ప్రేక్షకులే సినిమాకు ప్రచారకర్తలుగా మారతారని ‘ఇరుముడి’ నిరూపిస్తోంది.

మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. ఆగస్టు 26న ‘టాక్సిక్’ విడుదల కావడంతో అప్పటికే విడుదలై సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న ‘ఇరుముడి’కి పలు ప్రాంతాల్లో థియేటర్లు తగ్గాయి. సహజంగానే ఇది రవితేజ సినిమాకు గట్టి దెబ్బ అవుతుందని అందరూ భావించారు. కానీ ‘టాక్సిక్’కు వచ్చిన డివైడ్ టాక్‌తో పరిస్థితులు మళ్లీ మారిపోయాయి. తక్కువ థియేటర్లల స్థానంలో క్రమంగా ‘ఇరుముడి’ మళ్లీ రిలీజ్ కావడంతో పాటు.. బాక్సాఫీస్ దగ్గర తన హవాను కొనసాగించింది. తాజాగా బుకింగ్స్‌లోనూ ఈ ప్రభావం కనిపిస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

అంతేకాదు.. సినిమాను గెలిపించేది మితిమీరిన హింస, గ్లామర్, భారీ యాక్షన్ ఎపిసోడ్లు మాత్రమే కాదనే విషయాన్ని కూడా ఈ రెండు చిత్రాల ఫలితాలు చర్చకు తెచ్చాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతన్నారు. ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే కథ, పాత్రలు, భావోద్వేగాలు, మంచి మేకింగ్ ఉంటే సినిమా ఏ స్థాయి విజయాన్నైనా అందుకోగలదని ‘ఇరుముడి’ చూపించింది. స్టార్‌డమ్ సినిమాను థియేటర్ వరకు తీసుకురావచ్చు.. కానీ కంటెంట్ మాత్రమే ప్రేక్షకుడిని చివరి వరకు థియేటర్‌లో కూర్చోబెట్టి, మరో ప్రేక్షకుడిని థియేటర్‌కు పంపిస్తుందని టాక్సిక్ రిజల్ట్ నిరూపించదని చెబుతున్నారు.

మొత్తంగా చూస్తే.. ‘టాక్సిక్’ స్టార్‌డమ్‌కు కంటెంట్ తోడవ్వాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తే.. ‘ఇరుముడి’ మాత్రం కంటెంట్‌కు స్టార్‌డమ్ అవసరం లేదని నిరూపిస్తున్నట్లుగా కనిపిస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బాక్సాఫీస్ రిజల్ట్ ఏదైనా ఒక విషయం మాత్రం క్లియర్.. సినిమా గెలవాలంటే ముందుగా ఆ సినిమా కథ, కథనం ప్రేక్షకుడి మనసు గెలవాలి.

#Toxic#Yash#Ravi Teja#Irimudi#KGF
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి