Bandi Sanjay: బడినే సర్వస్వంగా భావించి కొవ్వొత్తిలా కరిగిపోయిన రిటైర్డ్ ఉపాధ్యాయులు సైతం పదవీ విరమణ అనంతరం తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావడం అత్యంత బాధాకరమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. టీచర్స్ డే సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్స శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులను కన్నీళ్లు పెట్టించే ఏ రాజ్యం బాగుపడదని, ఈ పచ్చి నిజాన్ని కాంగ్రెస్ పాలకులు ఇప్పటికైనా గ్రహించాలని ఆయన సూచించారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూనే, అర్ధాకలితో అలమటిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న గురువుల సేవలు ఎంతో గొప్పవని ఆయన కొనియాడారు.
స్వయంగా ముఖ్యమంత్రే విద్యాశాఖను కూడా పర్యవేక్షిస్తున్నప్పటికీ ఉపాధ్యాయుల కనీస సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడం శోచనీయమని బండి సంజయ్ విమర్శించారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం కాలయాపన చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. రాష్ట్రంలో పీఆర్సీ అమలు కాకపోయినా, డీఏలు అందకపోయినా ఉపాధ్యాయులు ఎంతో ఓర్పుతో తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇబ్బందులను పక్కనపెట్టి పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయులను ఆయన ప్రశంసించారు. ఉపాధ్యాయులను గౌరవించడం అంటే కేవలం టీచర్స్ డే రోజున శుభాకాంక్షలు చెప్పడం మాత్రమే కాదని, వారి సమస్యలను పరిష్కరించి, వారికి అండగా నిలవడమే నిజమైన గౌరవమని ఆయన స్పష్టం చేశారు. టీచర్స్ డే సందర్భంగా కనీసం ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇతర సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికైనా గురువులకు ఉచిత హామీల పాఠాలు చెప్పడం మానేసి, వారి సమస్యలను పరిష్కరించడం అనే ప్రాథమిక పాఠాన్ని నేర్చుకోవాలని బండి సంజయ్ సూచించారు.








