TG: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఎమ్మెల్సీ పదవుల చుట్టూ హీట్ పెరుగుతోంది. గవర్నర్ కోటాలో నవంబర్ 14, 2026న మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానుండటంతో అధికార కాంగ్రెస్‌లో ఆశావహుల లాబీయింగ్ జోరందుకుంది.
గోరటి వెంకన్న, బొగ్గారపు దయానంద్, బస్వరాజు సారయ్య పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో.. ఈ మూడు స్థానాల్లో ఎవరికి అవకాశం దక్కుతుందన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే కాంగ్రెస్‌లో పలువురు నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుత ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మరోసారి అవకాశం కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ఈసారి సామాజిక సమీకరణాలు కూడా కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. గతంలో గవర్నర్ కోటా స్థానాల భర్తీలో సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇవ్వాలన్న చర్చ జరిగింది. ఎస్సీ, బీసీ, ఓసీ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేలా అభ్యర్థుల ఎంపిక ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి.
ఆశావాహుల్లో ప్రస్తుత ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతో పాటు కరీంనగర్ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ సతీష్, సమాచార శాఖ కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి పేర్లు కూడా జోరుగా ప్రచారం అవుతున్నాయి. అయితే చివరి నిర్ణయం మాత్రం కాంగ్రెస్ అధిష్ఠానం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల్లో ఉందని తెలుస్తోంది.
మొత్తంగా ఈ దఫా తెలంగాణ గవర్నర్ కోటాలో నాలుగు ఎమ్మెల్సీ స్థానలు ఖాళీలు కాగా వాటిలో అన్ని కూడా కాంగ్రెస్ హస్తగతం కానున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉండటంతో ఈ నాలుగు సీట్ల కోసం ఇప్పటికే ముమ్మరంగా పోటీ నెలకొందని చెబుతున్నారు.
పదవులు తక్కువ.. పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ఆశావాహులు హైదరాబాద్ నగరం చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకరి పేరు ఖరారైతే మరొకరికి నిరాశ తప్పదన్న పరిస్థితి నెలకొనడంతో, సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, దానిని టీపీసీసీ ఎలా తీసుకుంటుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది.









