BJP: 22ఏ నిషేధిత భూముల జాబితాకు నిరసనగా బీజేపీ మహా ధర్నా నిర్వహించింది. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద జరిగిన ఈ మహా ధర్నాలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. రేవంత్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. పేదల భూములను నిషేధిత జాబితాలో పెట్టిన కాంగ్రెస్ పార్టీని మనమంతా నిషేధిత జాబితాలో పెట్టాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక, 22ఏలో భూములు ఎందుకు పెట్టారో, రాత్రికి రాత్రే ఎందుకు తొలగించారో చెప్పాలని రేవంత్ సర్కార్ ను డిమాండ్ చేశారు బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి.
పేదల జీవితాలతో చెలగాటం
ప్రజల ఆస్తులను 22ఏ నిషేధిత జాబితాలో పెట్టి, పేదల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో బీజేపీ ఈ మహా ధర్నా చేపట్టిందన్నారు. పేదల ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టిన కాంగ్రెస్ పార్టీని నిషేధిత జాబితాలో పెట్టడానికి బీజేపీ సంకల్పించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అనాలోచితంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామన్నారు. 22ఏ ఎత్తివేసే వరకు పోరాటం కొనసాగిద్దామని పిలుపునిచ్చారు.
తప్పు చేసినోళ్లకు శిక్ష పడాలి
''మా అధికారులు తప్పు చేశారు, పొరపాటు జరిగింది అని ప్రజల ముందుకు వచ్చి బహిరంగంగా క్షమించండి అని మంత్రి పొంగులేటి అడిగారు. మరి తప్పు చేస్తే శిక్ష పడాలి కదా? 22ఏ జాబితా నుంచి నా ఇల్లు తీసేయమని రేవంత్ రెడ్డి దరఖాస్తు పెట్టారా? దరఖాస్తు పెట్టకుండానే తీసేశారు కదా. మరి పేదల ఆస్తులను ఎందుకు తీయడం లేదు? ఏ విధంగా అయితే మీ ఆస్తులను 22ఏ జాబితా నుంచి తీసేశారో అదే విధంగా పేదల ఆస్తులను కూడా తొలగించాల్సిందే. పేదల భూములను, హెచ్ఎండీఏ అనుమతించిన కాలనీలను 22ఏలో పెట్టిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నిషేధించాలి'' అని రఘునందన్ రావు పిలునిచ్చారు.
రాష్ట్రం అవినీతిమయమైందని సంబరాలా?
''ధరణి.. భూ భారతిగా పేరు మారింది తప్ప.. దోపిడీ మారలేదు. ప్రైవేట్ భూములను కూడా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి మూటలు పంపి తమ పదవులు కాపాడుకుంటున్నారు. ఈ వెయ్యి రోజుల పాలనలో ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వనందుకు సంబరాలు చేసుకుంటున్నారా? నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వనందుకు సంబరాలు జరుపుకుంటున్నారా? 420 హామీలు నెరవేర్చనందుకు సంబరాలు జరుపుకుంటున్నారా? రాష్ట్రం అవినీతిమయమైందని, ఎక్కడికక్కడ దోపిడీ జరుగుతోందని, రాష్ట్రం కుంభకోణాల మయమైందని, అవినీతి పాలనపై సంబరాలు చేసుకుంటున్నారా? దీనికి రేవంత్ సర్కార్ సమాధానం చెప్పాలి'' అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.
జీతాలు ఇచ్చేందుకు కూడా పైసలు లేవు
''వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటుపడింది. రాష్ట్రం అప్పులమయమైంది. లక్షల కోట్ల రూపాయల బాకీలు తెచ్చారు. రాజ్యం కుప్పకూలే పరిస్థితి ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. ఎన్నడూ లేని విధంగా జీతాలు ఇచ్చేందుకు కూడా పైసలు లేని పరిస్థితి ఉంటే మీరేమో సంబరాలు చేసుకుంటున్నారు.
మారింది పేరే.. అదే ధోరణి, అదే దోపిడీ
ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని రేవంత్ అన్నారు. ధరణి స్థానంలో భూ భారతి తెచ్చారు. పేరు మారింది మీ దోపిడీ మారలేదు, మీ ధోరణి మారలేదు. అదే పేరు, అదే పోర్టల్ తో ముఖ్యమంత్రి, మంత్రులు అంతా కలిసి భూ దోపిడీకి పాల్పడుతున్నారు. మీరు తెచ్చిన భూ భారతి వల్ల రాష్ట్రంలో కోటి ఎకరాల భూమిని 22ఏ జాబితాలో చేర్చారు. ప్రైవేట్ భూములు సైతం 22ఏలో పెట్టారు. రాత్రికి రాత్రి లక్షలాది ఎకరాల భూములను 22ఏ జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఏ ప్రాతిపదికన 22ఏ లో భూములు పెట్టారు, ఏ ప్రాతిపదికన 22ఏ నుంచి మళ్లీ వాటిని రాత్రికి రాత్రే తొలగిస్తున్నారో సమాధానం చెప్పడం లేదు. మంత్రి పొంగులేటి కంపెనీలకు వేల కోట్ల విలువైన భూముల బదలాయింపు జరుగుతోంది'' అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.








