తెలంగాణ రాజకీయాల్లో మరోసారి భూవివాదం అంశం తెరపైకి వచ్చింది... భూభారతి చట్టం.. సెక్షన్ 22ఏ నిషేధిత జాబితా.. పేదల ఇళ్ల కూల్చివేతలు.. ఇవే ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ మధ్య కొత్త రాజకీయ యుద్ధానికి కారణంగా మారాయి.పేదలు, మధ్యతరగతి ప్రజలు, రైతుల భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం వారి జీవితాలతో ఆడుకుంటోందని బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపించారు..
ఈ అంశంపై తెలంగాణ బీజేపీ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వేదికగా మహాదీక్ష చేపట్టింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. 22ఏ నిషేధిత జాబితాలో రైతుల భూములను చేర్చడం వల్ల పేదలు, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సమస్యల కంటే రియల్ ఎస్టేట్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టారని విమర్శించారు. భూవివాదాలతో ప్రజలు మానసిక క్షోభకు గురవుతున్నారని మండిపడ్డారు.
మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు.. ధరణి లోపాలను సరిచేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు భూభారతి పేరుతో మరిన్ని సమస్యలు సృష్టిస్తోందని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి కారణంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారని.. అప్పట్లో నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించేందుకు 15 శాతం కమిషన్ తీసుకునేవారనే ఆరోపణలు ఉన్నాయని.. ఇప్పుడు అది 30 శాతానికి పెరిగిందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
ఇక బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఈ అంశం పై సంచలన వ్యాఖ్యలు చేశారు.. 22ఏలో పేదల ఇళ్లు, భూములను పెట్టే అధికారం సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఎవరిచ్చారంటూ ఈటల నేరుగా ప్రశ్నించారు. ఒకవైపు 22ఏపై బీజేపీ పోరాటం చేస్తుంటే.. మరోవైపు కుత్బుల్లాపూర్ పరిధిలో దశాబ్దాల క్రితం నిర్మించుకున్న పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారని ఈటల ఆరోపించారు.
అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టే వరకు విశ్రమించేది లేదంటూ శపథం చేశారు. అదేవిధంగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల ఆస్తులను 22ఏ జాబితాలో పెడుతున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు నిషేధిత జాబితాలో పెట్టాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుతం రాష్ట్రా రాజకీయాల్లో నెల కొన్న విమర్శల యుద్ధం రాబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుండే ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా జరుగుతున్నట్టు ప్రజలు అనుకుంటున్నారు.. అందుకే పేదల భూములు, ఇళ్ల అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి పెంచేందుకు బీజేపీ వ్యూహం రచిస్తున్నట్టు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని భావిస్తున్నారు..











