Tollywood: ఒకప్పుడు సినిమా అంటే స్పష్టమైన ప్రణాళిక, క్రమశిక్షణ, బౌండ్ స్క్రిప్ట్‌తో కూడిన పరుగులు. ఇప్పుడు సినిమా అంటే నెలల తరబడి లొకేషన్ల ఎంపికలు, సెట్స్ మీద కబుర్లు, ఎడిటింగ్ టేబుల్ వద్ద తర్జనభర్జనలు అనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. నిజానికి అత్యాధునిక డిజిటల్ కెమెరాలు, హై-ఎండ్ ఎడిటింగ్ సూట్లు, విలాసవంతమైన కారవాన్లు అందుబాటులోకి వచ్చాక సినిమా పనులు రెట్టింపు వేగంతో పూర్తి కావాలి. కానీ టాలీవుడ్‌ను ప్రస్తుతం పట్టిపీడిస్తున్న అసలు సమస్య ‘లేట్ మేకింగ్ సిండ్రోమ్’. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దర్శకుల్లో, నిర్మాణ బృందాల్లో ఆలోచనల క్లారిటీ తగ్గి.. బద్ధకం, అలసత్వం పెరిగిపోతుండటం ఇప్పుడు చిత్ర పరిశ్రమను ఆర్థిక సంక్షోభం వైపు నెడుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
32 రోజుల్లో 'దాన వీర శూర కర్ణ'.. 18 రోజుల్లో 'సింహాసనం'.. మరి ఇప్పుడెందుకు మూడేళ్లు
గత చరిత్రను ఒకసారి పరిశీలిస్తే ఇప్పటి మేకర్స్ తలదించుకోవాల్సిన వాస్తవాలు ఎన్నో బయట పడుతున్నాయి. నాటి లెజెండ్స్ పరిమిత వనరులతోనే అద్భుతాలు చేశారు. నందమూరి తారక రామారావు నాలుగు గంటలకు పైగా సాగే మహాభారత ఘట్టం ‘దాన వీర శూర కర్ణ’ను కేవలం 32 రోజుల్లో పూర్తి చేశారు. మూడు విభిన్న గెటప్పులు, పద్యాలు, భారీ డైటాగ్స్‌తో కూడిన చిత్రాన్ని ఆ వేగంతో తెరకెక్కించడం ఒక విప్లవం. అలాగే సూపర్ స్టార్ కృష్ణ తెలుగు తెరపై తొలి 70ఎంఎం భారీ బడ్జెట్ జానపద చిత్రం ‘సింహాసనం’ను కేవలం 18 రోజుల్లోనే షూట్ చేసి రికార్డు సృష్టించారు. మరి నేటి దర్శకులు అంతకుమించిన భారీ కథలేమైనా మనకు వండి వారుస్తున్నారా? అనే కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా జోరుగా వినిపిస్తున్నాయి. ఒక సాధారణ రివేంజ్ స్టోరీనో లేదా నాలుగు ఫైట్లు, ఆరు పాటలతో కూడిన రొటీన్ మాస్ ఫార్ములానో తెరకెక్కించడానికి 300 నుంచి 500 రోజుల షూటింగ్ షెడ్యూల్స్, ఏళ్ల తరబడి పోస్ట్ ప్రొడక్షన్ సమయం తీసుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.
‘లేట్ మేకింగ్’ వెనుక అసలు లోపాలు
సాంకేతికత పెరిగినప్పటికీ సినిమాల నిర్మాణం ఇంత దారుణంగా ఆలస్యం కావడానికి ప్రధాన కారణాలు కొందరు సినీ విశ్లేషకులు వివరిస్తున్నారు. గతంలో దర్శకులకు మొదటి సీన్ నుంచి క్లైమాక్స్ వరకు పేపర్ మీదే ప్రతి ఫ్రేమ్ స్పష్టంగా ఉండేది. నేటి డిజిటల్ యుగంలో ఆ హోంవర్క్ పూర్తిగా పోయిందంటున్నారు. "ఎలాగో డిజిటల్ కెమెరాలే కదా.. ఎలాగైనా తీయొచ్చు, ఎడిటింగ్‌లో సరిచేసుకోవచ్చు లేదా రీషూట్ చేయొచ్చు" అనే నిర్లక్ష్య వైఖరి ప్రస్తుతం ఇండస్ట్రీలో రాజ్యమేలుతోంది. సెట్‌కు వచ్చాక డైలాగులు మార్చడం, సీన్లు మార్చడం పరిపాటిగా మారిందని చెబుతున్నారు. ఎమోషన్లు, యాక్టింగ్ ద్వారా చూపించాల్సిన సన్నివేశాలను కూడా కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో నింపేస్తున్నారు. దీంతో ప్యాచ్ వర్కులు, గ్రాఫిక్స్ కరెక్షన్ల పేరుతో నెలల తరబడి సమయం వృధా అవుతోంది. హీరోలు, దర్శకులకు కోట్లలో పారితోషికాలు అందడంతో సంవత్సరానికి ఒక సినిమా చేస్తే చాలనే ధోరణి పెరిగింది. ఒకప్పుడు హీరోలు ఒకే రోజు మూడు షిఫ్టుల్లో పని చేసేవారు. నేడు నెలకు 10-15 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటూ, మిగతా సమయాన్ని విదేశీ పర్యటనలు, రెస్ట్‌లకు కేటాయిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఫైనాన్స్ వడ్డీలు.. చితికిపోతున్న నిర్మాతలు
ఈ బద్ధకం, నెమ్మదితనం వల్ల అసలైన నష్టాన్ని భరిస్తున్నది కేవలం నిర్మాతలే అని అంటున్నారు. సినిమా ప్రారంభంలో రూ.50 కోట్లు అనుకున్న బడ్జెట్.. నిర్మాణం రెండేళ్లు, మూడేళ్లు సాగడం వల్ల ఫైనాన్స్ వడ్డీల రూపంలోనే రూ.80 కోట్లకు, రూ.100 కోట్లకు చేరుతోంది. నిత్యం సెట్ బాడుగలు, సిబ్బంది జీతాలు, లగ్జరీ కారవాన్ ఖర్చులు నిర్మాతలను నిలువునా ముంచుతున్నాయని అంటున్నారు. ఏళ్ల తరబడి ప్రాజెక్ట్ నడవడం వల్ల ప్రేక్షకుల అభిరుచులు మారిపోతున్నాయి. ఒకప్పుడు ఫ్రెష్‌గా అనిపించిన పాయింట్.. సినిమా రిలీజ్ అయ్యేసరికి పాతబడిపోయి, బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవుతోంది.
సాంకేతికత అనేది సినిమాను నాణ్యంగా, వేగంగా కంప్లీట్ చేయడానికి వాడాల్సిన సాధనం మాత్రమే. కానీ అదే టెక్నాలజీని సాకుగా చూపుతూ దర్శకులు తమ క్రియేటివ్ అలసత్వాన్ని, బద్ధకాన్ని సమర్థించుకోవడం సరికాదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో సీనియర్స్ చూపించిన పక్కా ప్లానింగ్, వర్కింగ్ స్టైల్‌ను నేటి తరం ఒంటబట్టించుకోకపోతే.. ఈ 'లేట్ మేకింగ్ సిండ్రోమ్' టాలీవుడ్ నిర్మాణ రంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టడం ఖాయం అంటున్నారు.


