Keerthy Suresh: మహానటి తర్వాత కీర్తి సురేష్ కథల ఎంపికలో ఎందుకు తడబడుతోంది? అవును..ఇదే ప్రశ్న ఇండస్ట్రీ ప్రముఖుల్లో ప్రథమంగా వినిపిస్తోంది. దీనికి, కారణం తాజాగా వచ్చిన కల్ట్ మూవీ డోరతీ. తమిళంలో వచ్చిన ఈ సినిమా అక్కడ ప్రేక్షకులను నిరాశపరచడమే కాదు..విశ్లేషకుల నుంచి విమర్శలను కూడా ఎదుర్కుంది. అయినా, ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేశాడు రానా దగ్గుబాటి. ఇక్కడ, కూడా ఫలితం తేడా కొట్టింది.
అసలు కీర్తి నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారు?
ఒక హీరో లేదా ఒక హీరోయిన్..వీళ్ళ సక్సెస్ అనేది ఎంచుకునే కథలు..పాత్రల మీదే ఉంటుంది. తమన్నా, నయనతార లాంటి వారు ఎక్కువగా ప్రయోగాలు చేసిన సందర్భాలు లేవు. కమర్షియల్ హీరోయిన్‌గా సక్సెస్ అందుకున్న తర్వాత గ్లామర్ పాత్రలను..మాస్ హీరోలతో జతకట్టి మంచి కథా బలమున్న సినిమాలనే చేస్తూ తమ గ్రాఫ్ పడిపోకుండా జాగ్రత్తపడుతున్నారు. ఇతర, భాషలకి వెళ్ళినా కూడా అంతే.
అయితే, అప్పట్లో అనుష్క శెట్టి చేసిన అరుంధతి ఏ స్థాయిలో క్రేజ్ తెచ్చిపెట్టిందో అందరికీ తెలిసిందే. అప్పటి వరకూ గ్లామర్ పాత్రలు చేసిన అనుష్క..అరుంధతి మూవీతో ఊహించని క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత నుంచే సమస్యలు మొదలయ్యాయి. వరుసగా ప్రయోగాత్మక చిత్రాలు చేసి..ఫ్లాపులతో పాటు మార్కెట్‌ను పోగొట్టుకుంది. కీర్తి సురేష్ పరిస్థితి ఇలాగే ఉంది.
మహానటి సినిమాకి ముందు వరకూ మంచి కమర్షియల్ సినిమాలతో హిట్స్ అందుకుంది కీర్తి. కానీ, జీవితంలో అతి పెద్ద ఛాలెంజింగ్ రోల్ మహానటి సావిత్రి పాత్ర. ఈ సినిమాతో కీర్తి సురేష్ రేంజ్ అమాంతం మారిపోయింది. కానీ, ఆ తర్వాత చేసిన ఏ ఒక్క సినిమా కూడా ఆశించిన విజయాన్ని కీర్తికి ఇవ్వలేదు. ఇప్పటికీ ఓ మంచి కమర్షియల్ బ్రేక్ కోసం ఆశగా ఎదురుచూస్తోంది.
ఖచ్చితంగా, ప్రేక్షకుల్లో మహనటి సినిమాను మించి ఉండాలని ఆశ ఉంటుంది. కానీ, కీర్తి ఆ రేంజ్ కథలను సెలెక్ట్ చేసుకోలేకపోతోంది. గ్లామర్, డీగ్లామర్, రొమాంటిక్ మూవీస్ చేస్తున్నా కూడా హిట్ మాత్రం దక్కడం లేదు. ఇకనుంచైనా కథల ఎంపికలో కీర్తి కొత్తగా ఆలోచించాల్సి ఉంది.












