* బొల్లారం ఆర్మ్స్ చోరీ కేసులో 8 మంది అరెస్ట్
* బ్యాంకులు, జువెలరీ షాపులు, సంపన్నులను టార్గెట్ చేసేందుకు కుట్ర
* దోపిడీలు చేసేందుకే వెపన్స్ చోరీ
* ఆయుధాల చోరీ కేసులో ఉగ్ర లింకులు లేవు
Bollaram: బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని 20వ బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్ కోటే, మ్యాగజైన్ నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి చోరీకి గురైన కేసులో మిస్టరీని మల్కాజ్‌గిరి పోలీసులు ఛేదించారు. ఆయుధాల చోరీ వెనుక కుట్రను పోలీసులు వెల్లడించారు. చోరీ చేసిన ఆర్మీ ఆయుధాలతో దోపిడీలు చేయాలనుకున్నారని తెలిపారు. ఆర్మీ ఆయుధాల కేసులో ఉగ్ర లింకులు లేవని స్పష్టం చేశారు.
చోరీ చేసిన ఆయుధాలతో బ్యాంకులు, నగల దుకాణాలు, సంపన్నులను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడాలని నిందితులు ప్రణాళిక రూపొందించినట్లు తమ విచారణలో తేలిందన్నారు. ఆర్మీ ఆయుధాలను ఉపయోగించి భారీ మొత్తంలో డబ్బు సంపాదించాలన్నదే వారి ఉద్దేశం అని వెల్లడించారు. ఈ కేసులో నిందితుల ఉద్దేశం భారీ ఆస్తి నేరాలకు పాల్పడటమేనన్న పోలీసులు.. ఇందులో ఎటువంటి ఉగ్రవాద లేదా తీవ్రవాద సంబంధాలు గుర్తించలేదని దర్యాఫ్తు అధికారులు ప్రకటించారు.
8మంది అరెస్ట్
ఈ కేసులో మాజీ హవల్దార్‌తో పాటు మొత్తం 8మందిని అరెస్ట్ చేసినట్లు మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ సుమతి తెలిపారు. ప్రధాన నిందితుడు మల్లేశ్ ఇచ్చిన వివరాలతో ఏడుగురిని (శేషు, వినోద్, ప్రవీణ్, నిరంజన్, మల్లికార్జున్, బీర్బల్ షా, అవి దెయ్‌ను) అరెస్ట్ చేశామన్నారు. ఆగస్టు 31న బొల్లారంలోని 20 బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్‌లో కోటే, మ్యాగజైన్ తాళాలు పగులగొట్టి ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు. తనిఖీ చేయగా 4 ఏకే-203 రైఫిళ్లు, ఒక ఇన్సాస్ రైఫిల్, ఆరు 9ఎంఎం పిస్టళ్లు, ఒక సివిల్ పిస్టల్, మ్యాగజైన్లు, బైనాక్యులర్లు, భారీగా తుపాకీ రౌండ్లు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఈ ఘటనపై బొల్లారం పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 207/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
చోరీ చేసిన ఆయుధాలు ఇంట్లో దాచిపెట్టాడు
సెప్టెంబర్ 11న అందిన పక్కా సమాచారంతో మల్కాజ్‌గిరి పోలీసులు.. తెలంగాణ పోలీసులు ఇతర విభాగాల సహకారంతో ప్రధాన నిందితుడు ఉప్పుతొల్ల మల్లేశ్ @ రాజు (A1)ను అదుపులోకి తీసుకున్నారు. అతని తండ్రి నివాసంలో దాచిన చోరీకి గురైన ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు. అనంతరం పోలీస్ కస్టడీకి అనుమతి లభించడంతో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 1 వరకు విచారణ కొనసాగించారు.
బ్యాంకులు, నగల దుకాణాలు, సంపన్నులే లక్ష్యం
పోలీసుల దర్యాప్తు ప్రకారం, ప్రధాన నిందితుడు మల్లేశ్ తన బంధువు మల్లికార్జున్ (A7), స్నేహితుడు నిరంజన్ (A8)తో కలిసి బ్యాంకులు, నగల దుకాణాలు, సంపన్నులను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడాలని ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడైంది. ఆయుధాలను ఉపయోగించి భారీ మొత్తంలో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పశ్చిమ బెంగాల్‌కు చెందిన అవి దెయ్ @ ఒబి (A5), బీర్బల్ షా (A6)లను సంప్రదించినట్లు పోలీసులు తెలిపారు. గతంలో మద్రాస్ రెజిమెంట్‌లో పనిచేసిన శేషు (A2), వినోద్ కుమార్ (A3), ప్రవీణ్ (A4) సహకారంతో కోటే, మ్యాగజైన్ తాళాలు పగులగొట్టి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని చోరీ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.
ఒక్కో ఆయుధానికి ఒక్కో ధర
పోలీసుల ప్రకారం, చోరీ చేసిన ఆయుధాలను కొనుగోలు చేసేందుకు A5 ఒప్పుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. పిస్టల్‌కు సుమారు రూ.3 లక్షలు, లాంగ్ వెపన్‌కు రూ.5 లక్షలు, మందుగుండు సామగ్రికి అదనంగా డబ్బు చెల్లిస్తానని చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
2022లోనే అక్రమ ఆయుధం కొనుగోలు
దర్యాప్తులో మరో విషయం వెలుగులోకి వచ్చింది. 2022లో బారక్‌పూర్, కోల్‌కతాలో బెటాలియన్ పోస్టింగ్‌లో ఉన్న సమయంలో A1కు వెస్ట్ బెంగాల్ కు చెందిన బీర్బల్ షా ద్వారా అవి దెయ్ తో పరిచయం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. వారి ద్వారా రూ.10వేలు చెల్లించి ఒక దేశీయ తుపాకీ (తపంచా), ఒక లైవ్ రౌండ్ కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. ఆ ఆయుధాన్ని తన తండ్రి ఇంట్లోని మొదటి అంతస్తులో దాచినట్లు పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ 23న నిర్వహించిన సీజ్ పంచనామా ద్వారా ఆ తపంచాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న ఆయుధాలు
ఏకే-203 రైఫిళ్లు-4
ఏకే-203 మ్యాగజైన్లు-5
ఇన్సాస్ రైఫిల్-1
ఇన్సాస్ మ్యాగజైన్లు-3
9ఎంఎం పిస్టళ్లు-6
9ఎంఎం పిస్టల్ మ్యాగజైన్లు-12
6.35 బోర్ సివిల్ పిస్టల్-1
బైనాక్యులర్లు-3
9ఎంఎం పిస్టల్ రౌండ్లు-1,156
ఏకే-203 రౌండ్లు-720
ఇన్సాస్ రౌండ్లు-36
మొబైల్ ఫోన్లు-5
నిందితుల వివరాలు
A1 - ఉప్పుతొల్ల మల్లేశ్ @ రాజు, 37, మాజీ హవల్దార్, 20 బెటాలియన్ మద్రాస్ రెజిమెంట్.
A2 - కొండూరి శేషులు, 36, సెపాయ్.
A3 - వినోద్ కుమార్, 34, నాయక్.
A4 - కుచరకంటి ప్రవీణ్, 37, హవల్దార్.
A5 - అవి దెయ్ @ ఒబి, 32, బారక్‌పూర్, పశ్చిమ బెంగాల్.
A6 - బీర్బల్ షా, 27, చెరకు రసం కేంద్రం నిర్వాహకుడు, బారక్‌పూర్.
A7 - ఉప్పుతొల్ల మల్లికార్జున్, 39, మేస్త్రీ.
A8 - చెమ్మకర్ నిరంజన్, 39, కిరాణా వ్యాపారి.
A1పై గతంలో అచంపేట, అమ్రాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇళ్లలో చోరీలకు సంబంధించిన కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. A5 అవి దెయ్ పైనా గతంలో ఆయుధాల చట్టం కింద కేసు నమోదైనట్లు వెల్లడించారు. A1ను సెప్టెంబర్ 11న అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపగా.. A2 నుంచి A8 వరకు నిందితులను అరెస్ట్ చేశారు.












