22A Lands: స్వేచ్ఛ న్యూస్ ఎఫెక్ట్.. 22ఏ భూ బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలపై గత నెల రోజుల పాటు స్వేచ్ఛ న్యూస్ చేసిన పోరాటం ఫలించింది. రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి భూ యజమానులు పడుతున్న బాధలపై అనేక కథనాలు రాసింది. దీంతో ప్రభుత్వం దిగి వస్తోంది. 22ఏ నిషేధిత భూముల సమస్యల పరిష్కారంలో మరో కీలక అడుగు పడింది.
నాలా చట్టం అనుమతి లేకుండా నివాస వినియోగంలోకి వచ్చిన పట్టా భూముల రిజిస్ట్రేషన్లకు తీపి కబురు చెప్పింది. నాలా రుసుము చెల్లింపుతో అర్హత ఉన్న భూముల రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమైంది. నాలా చట్టం అనుమతి లేకుండా నివాస వినియోగంలోకి వచ్చిన పట్టా భూముల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నాలా రుసుము చెల్లించిన వ్యక్తుల దరఖాస్తులను పరిశీలించి ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు మంత్రి పొంగులేటి. మెమో నెం 48062/ULC/A1/2026 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. అర్హత ఉన్న దరఖాస్తులను కాలపరిమితిలో పరిష్కరించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు.
22ఏ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల అమలులో వేగం పెరిగింది. ఇప్పటికే ఐదు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు, GO 118, GO 76లకు అనుగుణంగా మార్గదర్శకాలు విడుదలయ్యాయి. GHMC, HMDA, DTCP, మున్సిపల్ అనుమతులు ఉన్న 22ఏ ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. ఇటీవలే యూఎల్‌సీ భూములకు క్లియరెన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. కొన్ని దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ఉత్తర్వులు ఇచ్చారు. తాజాగా నాలా ప్రక్రియ పూర్తి కాని పట్టా భూముల సమస్యకు కూడా పరిష్కారం లభించింది.
ప్రభుత్వ నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడం అధికారుల కనీస బాధ్యత అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తేల్చి చెప్పారు. ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను చిత్తశుద్ధితో అమలు చేయాలన్నారు. 22ఏ సమస్యల పరిష్కారంపై నిరంతరం మానిటరింగ్ చేయాలని రెవెన్యూ అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు.












