నేటి ఆధునిక యుగంలో సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) మానవ జీవితాలను ఎంతో సులభతరం చేస్తున్నప్పటికీ, అదే ఇంటర్నెట్ వలయంలో అమాయకులైన పిల్లలు చిక్కుకుని సైబర్ నేరగాళ్ల బారినపడే ముప్పు రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వేదికగా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA) దక్షిణ మండల ప్రాంతీయ సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
నిరుపేదలు, బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సహాయాన్ని అందించి, న్యాయాన్ని ఒక ఆయుధంగా మలిచిన మహాత్మా గాంధీ స్ఫూర్తితో న్యాయ సేవా సంస్థలు పనిచేస్తున్నాయని ఆయన కొనియాడారు. సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జీవితాలను సులభతరం చేసినప్పటికీ, అమాయకులైన పిల్లలు సైబర్ నేరగాళ్ల బారినపడే ప్రమాదం పెరుగుతోందని, అందుకే 'పిల్లల సైబర్ భద్రత' అనే అత్యంత ఆవశ్యక అంశంపై ఈ సదస్సు నిర్వహించడం అభినందనీయమని అన్నారు.
రాష్ట్రంలో మహిళలు, పిల్లల రక్షణ తమ ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బాధితులకు ఒకే చోట పోలీసు సహాయం, వైద్య సేవలు, ఉచిత న్యాయ సహాయం, కౌన్సెలింగ్ అందించేందుకు 'భరోసా కేంద్రాలు' సమర్థవంతంగా పనిచేస్తున్నాయని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో 'చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు'ను ఏర్పాటు చేయడమే కాకుండా, విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో 'SHE-భరోసా సైబర్ ల్యాబ్‌లు', 'CybHER' యాప్ ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులకు సైబర్ భద్రతపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని వివరించారు.
పిల్లల హక్కులు, చట్టాలపై అవగాహన పెంచేందుకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖతో టీజీఎస్-ఎల్‌ఎస్‌ఏ (TGS-LSA) ఒప్పందం కుదుర్చుకుందని, ఇప్పటికే 3,000 మందికి పైగా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చామని సీఎం వెల్లడించారు. కేవలం నేరస్థుడికి శిక్ష పడటమే కాకుండా, బాధితుడికి పూర్వ గౌరవాన్ని కల్పించి, బిడ్డ కోల్పోయిన బాల్యాన్ని తిరిగి అందించడమే అసలైన న్యాయమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ హైకోర్టు, NALSAతో చర్చించి రాష్ట్రం కోసం సమగ్ర 'చైల్డ్ ఆన్‌లైన్ సేఫ్టీ ఫ్రేమ్‌వర్క్'ను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
పిల్లలు ఇంటర్నెట్‌లో ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించడంతో పాటు ప్రేమతో అవగాహన కల్పించాలని సూచనలు చేశారు. వారిపై నిందలు వేయొద్దని సీఎం విజ్ఞప్తి చేశారు. సైబర్ నేరాలపై ఫిర్యాదుల కోసం 1930, చైల్డ్ హెల్ప్‌లైన్ కోసం 1098 అత్యవసర నంబర్లను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. న్యాయ సేవా సంస్థలు చేపట్టే ప్రతి శుభ కార్యాచరణ గ్రామీణ స్థాయి వరకు చేరుకునేలా ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని, ఈ సదస్సు సిఫారసులు దేశానికే మార్గదర్శకంగా నిలుస్తాయని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.


