తెలంగాణ ఆర్థిక స్థితిగతులు ప్రమాదకర స్థితికి చేరుకుంటున్నాయి. రాష్ట్రంలో ఆదాయం కంటే అప్పుల సమీకరణాలు పెరిగిపోతుండటంతో రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంటున్నది. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన బహిరంగ మార్కెట్ రుణాల షెడ్యూల్ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) మూడో త్రైమాసికంలో (అక్టోబర్ నుంచి డిసెంబర్) మరో రూ.13,000 కోట్ల భారీ రుణం సేకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనతో డిసెంబర్ నాటికే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న వార్షిక రుణ లక్ష్యాన్ని దాటిపోనుంది.
గడిచిన ఆరు నెలల (క్యూ-1, క్యూ-2) కాలంలోనే ప్రభుత్వం రూ.46,400 కోట్ల మేర అప్పులు సమీకరించింది. ఇందులో మొదటి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో రూ.18,900 కోట్లు, రెండో త్రైమాసికం (జులై-సెప్టెంబర్)లో రూ.27,500 కోట్ల అప్పులు ఉన్నాయి. ఇప్పుడు మూడో త్రైమాసికంలో తీసుకోబోయే రూ.13,000 కోట్లతో కలిపి కేవలం తొమ్మిది నెలల్లోనే ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు రూ.59,400 కోట్లకు చేరుకుంటుంది.
రాష్ట్ర బడ్జెట్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక రుణ పరిమితి (లక్ష్యం) రూ.58,458.71కోట్లుగా నిర్ణయించగా, మూడో త్రైమాసికం ముగిసేనాటికే ఇది లక్ష్యం కంటే దాదాపు రూ.941కోట్లు అదనంగా నమోదు కానుంది. చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో సైతం ప్రభుత్వం మరో రూ.10,000 కోట్ల నుంచి రూ.15,000 కోట్ల వరకు అప్పులు చేసే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
రాష్ట్రానికి వచ్చే సొంత పన్ను ఆదాయాలు, ఇతర రాబడుల వృద్ధి కంటే కూడా అప్పుల సమీకరణ వేగం అత్యంత వేగంగా ఉండటం ఆర్థిక స్థిరత్వానికి ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇష్టారాజ్యంగా అప్పులు పెరిగిపోతుండటం వల్ల భవిష్యత్తులో వడ్డీ చెల్లింపుల భారం పెరిగి, మూలధన వ్యయం, సంక్షేమ పథకాల అమలుపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.


