తెలంగాణ

ContemptOfCourt: సీపీ సజ్జనార్‌కు హైకోర్టు షాక్.. కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

తలాబ్ కట్ట ప్రాంతానికి చెందిన షానవాజ్ ఆలం అనే వ్యక్తి పోలీస్ ఉన్నతాధికారులపై సంచలన ఆరోపణలు చేశాడు. తనపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు కాకపోయినప్పటికీ హైదరాబాద్ భవానీనగర్ ఎస్‌ఐ, సీఐలు తన కాళ్లు, చేతులు కట్టేసి, కళ్లల్లో కారం చల్లి దారుణంగా చిత్రహింసలకు గురిచేశారంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారుల తీరుపై తెలంగాణ ఉన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

 తలాబ్ కట్ట ప్రాంతానికి చెందిన షానవాజ్ ఆలం అనే వ్యక్తి పోలీస్ ఉన్నతాధికారులపై సంచలన ఆరోపణలు చేశాడు. తనపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు కాకపోయినప్పటికీ హైదరాబాద్ భవానీనగర్ ఎస్‌ఐ, సీఐలు తన కాళ్లు, చేతులు కట్టేసి, కళ్లల్లో కారం చల్లి దారుణంగా చిత్రహింసలకు గురిచేశారంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారుల తీరుపై తెలంగాణ ఉన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

 ఈ ఘటనపై వెంటనే పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ, బాధ్యులైన అధికారులపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోవడంతో న్యాయం కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించినట్లు బాధితుడు తెలిపాడు. ఈ పిటిషన్‌‌పై గతంలో విచారణ జరిపిన హైకోర్టు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించింది. భవానీనగర్ స్టేషన్ పరిధిలోని సీసీటీవీ ఫుటేజీలను సమగ్రంగా పరిశీలించారు. చిత్రహింసలకు గురిచేసిన పోలీసు అధికారులపై తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను న్యాయమూర్తి స్పష్టంగా ఆదేశించారు.

 అయితే, ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలను సైతం లెక్కచేయకుండా సీపీ సజ్జనార్ ఎలాంటి విచారణ చేపట్టలేదని, బాధ్యులపై చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ బాధితుడు హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ ధిక్కరణ పిటిషన్‌పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు, కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. న్యాయస్థాన ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు గానూ సీపీ సజ్జనార్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.

 బాధితుడి ఫిర్యాదుపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించడమే కాకుండా, ఈ వ్యవహారంలో తదుపరి విచారణ నిమిత్తం సమాధానం ఇవ్వాలని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. హైదరాబాద్ పోలీసు స్టేషన్‌లో జరిగిన ఈ ఘటన, సీపీ స్థాయి అధికారికే కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ కావడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఖాకీల అక్రమ నిర్బంధం, బాధితుల పట్ల పోలీసుల మానవహక్కుల ఉల్లంఘనలపై హైకోర్టు తీసుకున్న ఈ కఠిన నిర్ణయం పట్ల సర్వత్రా చర్చ జరుగుతోంది.

 

#ContemptOfCourt#TelanganaHighCourt#CPSajjanar#BhavaniNagarPolice#PoliceCustodialViolence#HyderabadPolice#TelanganaNews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి