Health

Health: వెల్లుల్లి ఆరోగ్యానికి వరమా?.. నిపుణులు ఏం చెబుతున్నారు?..

రచన: Venu••5 నిమిషాల పఠనం

వెల్లుల్లిలో అల్లిసిన్ అనే ముఖ్యమైన బయోయాక్టివ్ సమ్మేళనం ఉంటుంది. వెల్లుల్లి రెబ్బను కోసినప్పుడు లేదా నలిపినప్పుడు దీనికి సంబంధించిన రసాయన చర్యలు ప్రారంభమవుతాయి.

వంటింట్లో నిత్యం ఉపయోగించే వెల్లుల్లికి ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం ఉంది. ఆధునిక పరిశోధనలు కూడా వెల్లుల్లిలోని కొన్ని సహజ సమ్మేళనాలు శరీరంలోని కొలెస్ట్రాల్, రక్తపోటు, రక్తంలో చక్కెర వంటి అంశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. అయితే ఈ ప్రయోజనం పొందాలంటే వెల్లుల్లిని ఎలా తీసుకుంటున్నామన్నది కూడా ముఖ్యమే అని అంటున్నారు ఆరోగ్యనిపుణులు..

వెల్లుల్లిలో అల్లిసిన్ అనే ముఖ్యమైన బయోయాక్టివ్ సమ్మేళనం ఉంటుంది. వెల్లుల్లి రెబ్బను కోసినప్పుడు లేదా నలిపినప్పుడు దీనికి సంబంధించిన రసాయన చర్యలు ప్రారంభమవుతాయి. అందుకే నలిపిన లేదా మెత్తగా చేసిన వెల్లుల్లిని కొద్దిసేపు ఉంచి వంటలో ఉపయోగించడం వల్ల కొన్ని క్రియాశీల సమ్మేళనాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే పచ్చి వెల్లుల్లినే తింటేనే ఎక్కువ ప్రయోజనం వస్తుందనే దానికి ఆధారం లేదు.

ఇక ఆధునిక వైద్య పరిశోధనల విషయానికి వస్తే.. వెల్లుల్లి సప్లిమెంట్లపై జరిగిన అధ్యయనాల్లో అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారిలో మొత్తం కొలెస్ట్రాల్, ఎల్‌డీఎల్ కొంత మేర తగ్గే అవకాశం కనిపించింది. అలాగే అధిక రక్తపోటు ఉన్నవారిలో రక్తపోటు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. 2026లో ప్రచురితమైన తాజా మెటా-అనాలిసిస్‌లో 108 క్లినికల్ ట్రయల్స్‌ను పరిశీలించగా.. రక్తపోటు, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు, ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ వంటి వాటిలో స్వల్ప మెరుగుదల కనిపించింది.

అలాగే ఆయుర్వేదం విషయానికి వస్తే.. వెల్లుల్లిని లశునం లేదా రసోనంగా పేర్కొంటారు. ఇది ఉష్ణ గుణం కలిగినదిగా, జీర్ణశక్తిని పెంచే ద్రవ్యంగా, ముఖ్యంగా వాత సంబంధిత సమస్యల్లో ఉపయోగించే ఔషధంగా ఆయుర్వేద గ్రంథాల్లో వివరించబడింది. కొన్ని ఆయుర్వేద వైద్య గ్రంథాల్లో వెల్లుల్లిని పాలు, నెయ్యి లేదా ఇతర అనుపానాలతో కలిపి వివిధ రూపాల్లో ఉపయోగించే విధానాలు కూడా ఉన్నాయి.

అందుకే సాధారణ ఆరోగ్యానికి వెల్లుల్లిని వంటల్లో భాగంగా తీసుకోవడం సులభమైన మార్గం. పచ్చిగా ఎక్కువ మోతాదులో తినడం వల్ల కడుపులో మంట, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు..

మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. రక్తం పలుచబడేందుకు ఉపయోగించే మందులు, ముఖ్యంగా యాంటీకోగ్యులెంట్లు లేదా కొన్ని సందర్భాల్లో ఆస్పిరిన్ తీసుకునేవారు వెల్లుల్లి సప్లిమెంట్లను వైద్యుల సలహా లేకుండా వాడకూడదు. శస్త్రచికిత్సకు ముందు కూడా అధిక మోతాదులో వెల్లుల్లి లేదా దాని సప్లిమెంట్ల గురించి వైద్యుడికి తప్పనిసరిగా చెప్పాలని నిపుణులు పేర్కొంటున్నారు..

ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!..

#Health#Ayurvedam#Allicin#bioactive#Gastric#Cholesterol
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి