Spirituality

Spirituality: ధర్మం క్షీణించిన ప్రతి యుగంలో పరమాత్మ అవతరిస్తాడని అంటారు నిజమేనా?..

రచన: Venu••5 నిమిషాల పఠనం

బృహదారణ్యక, కఠ, ఛాందోగ్య వంటి ఉపనిషత్తులలో ఆత్మ, బ్రహ్మం, పరమ సత్యం గురించి వివరణ కనిపిస్తుంది. హృదయంలో ఉన్న ఆత్మతత్త్వమే విశ్వవ్యాప్తమైన పరబ్రహ్మతో సంబంధం కలిగి ఉందని ఉపనిషత్తులు బోధిస్తాయి.

యుగయుగాల్లో పరమాత్మ భగవంతునిగా అవతరిస్తాడని మన ధార్మిక సంప్రదాయం చెబుతోంది. ఇక వేదాల్లో పరమాత్మను ఒకే రూపానికి పరిమితమైన వ్యక్తిగా కాకుండా.. సమస్త సృష్టిలో వ్యాపించి ఉన్న పరమ సత్యంగా దర్శించారు. ఋగ్వేదంలోని పురుషసూక్తం విశ్వమంతటినీ ఆవరించి ఉన్న మహాపురుషుడి స్వరూపాన్ని వర్ణిస్తుంది.

అలాగే విష్ణు సూక్తం ప్రకారం... శ్రీమహావిష్ణువు వేసిన ఆ మూడు మహత్తర అడుగులు, ఈ సమస్త విశ్వాన్నీ ఆవరించిన అనంత తత్త్వానికి ప్రతీక. భగవంతుడనేవాడు ఏ ఒక్క స్థానానికో, నిర్దిష్ట ప్రాంతానికో పరిమితమైన శక్త్యంతరం కాదు... సమస్త విశ్వంలోనూ, అణువణువునా వ్యాపించి ఉన్న దివ్య చైతన్యమని వేదం స్పష్టం చేస్తోంది.

ఉపనిషత్తుల దగ్గరకు వచ్చేసరికి ఈ భావన మరింత అంతర్ముఖంగా మారుతుంది. బృహదారణ్యక, కఠ, ఛాందోగ్య వంటి ఉపనిషత్తులలో ఆత్మ, బ్రహ్మం, పరమ సత్యం గురించి వివరణ కనిపిస్తుంది. హృదయంలో ఉన్న ఆత్మతత్త్వమే విశ్వవ్యాప్తమైన పరబ్రహ్మతో సంబంధం కలిగి ఉందని ఉపనిషత్తులు బోధిస్తాయి. అంటే పరమాత్మను బయట ఎక్కడో వెతకడం కాదు.. మనలో చైతన్యం రూపంలో ఉన్నాడనేది ఉపనిషత్తుల అంతరార్థం..

మరోవైపు భగవద్గీతలో ఈ నిరాకార పరమతత్త్వానికి మరో అద్భుతమైన వివరణ కనిపిస్తుంది. ధర్మం క్షీణించి, అధర్మం పెరిగినప్పుడు తాను అవతరిస్తానని శ్రీకృష్ణుడు ప్రకటిస్తాడు. సాధువులను రక్షించడం, దుష్టశక్తులను అణచడం, ధర్మాన్ని తిరిగి స్థాపించడం కోసం యుగయుగాల్లో అవతరిస్తానని గీతా సందేశం స్పష్టం చేస్తుంది. అందుకే సంభవామి యుగే యుగే అనే వాక్యం భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో అత్యంత ప్రసిద్ధమైన అవతార భావనగా నిలిచింది.

ఇక పురాణ సంప్రదాయంలో.. మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ వంటి అవతారాలను ధర్మ పరిరక్షణతో అనుసంధానిస్తూ వివరించారు. భాగవత పురాణం కూడా వివిధ అవతారాలు లోకరక్షణ కోసం యుగయుగాల్లో ప్రత్యక్షమవుతాయని వివరిస్తుంది. అయితే పరమాత్మకు ఒకే రూపం ఉండాల్సిన అవసరం లేదు. వేదాల్లో ఆయన విశ్వవ్యాప్త తత్త్వం.. ఉపనిషత్తుల్లో అంతరాత్మగా వెలుగొందే బ్రహ్మం.. గీతలో ధర్మాన్ని స్థాపించే అవతార పురుషుడు.. పురాణాల్లో భక్తులకు సన్నిహితంగా కనిపించే దైవ స్వరూపం అని మన ధర్మం బోధిస్తుంది..

అందుకే యుగయుగాల్లో భగవంతుడు అవతరిస్తాడనే భావనను కేవలం ఒక భ్రమగా కొట్టిపారేయలేం.. ఎందుకంటే ధర్మం బలహీనపడిన ప్రతిసారి.. దైవ చైతన్యం ఏదో ఒక రూపంలో ధర్మాన్ని నిలబెడుతుందనే విశ్వాసం భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో కనిపిస్తుంది. ఇక రూపం మారవచ్చు.. యుగం మారవచ్చు.. కాలం మారవచ్చు.. కానీ ధర్మాన్ని నిలబెట్టే పరమాత్మ తత్త్వం శాశ్వతం. ఇదే వేదాల నుంచి ఉపనిషత్తుల వరకు.. గీత నుంచి పురాణాల వరకు తెలియచేసే అవతార భావనలోని అంతర్లీన ఆధ్యాత్మిక సందేశం..

గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.

#Spirituality#Bhagavad Gita#Vishnu Suktam#Lord Maha Vishnu#God#Rigveda#Purusha Sukta
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి