తెలంగాణ

Mahabubnagar: అర్హత లేకున్నా వైద్యం.. టీజీఎంసీ దాడుల్లో బయటపడిన సంచలన విషయాలు!..

రచన: Venu•••5 నిమిషాల పఠనం

కొన్ని చోట్ల మందులు, ఇంజెక్షన్లు కూడా క్లినిక్‌లలోనే ఉంచుకుని వినియోగిస్తున్నట్లు, వైద్యుల అనుమతి లేకుండా ల్యాబొరేటరీ పరీక్షలు నిర్వహించి రిపోర్టులు సైతం ఇస్తున్న విషయాన్ని అధికారులు గుర్తించినట్లు తెలిపారు.

ఉమ్మడి జిల్లాలో అర్హత లేకుండా వైద్యం చేస్తున్న క్లినిక్‌లపై తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ టాస్క్‌ఫోర్స్‌ కొరడా ఝళిపించింది. ఆయుర్వేద, హోమియోపతి వంటి ఆయూష్‌ వైద్య అర్హతలు ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ఆధునిక వైద్యం చేస్తున్నవారు, సరైన రిజిస్ట్రేషన్‌ లేకుండా క్లినిక్‌లు నిర్వహిస్తున్నవారు, మందులు, ఇంజెక్షన్లు ఇస్తున్నవారిపై అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు.

కల్వకుర్తి, ఆమన్‌గల్లు మండలాల్లోని పలు క్లినిక్‌లు, నర్సింగ్‌ హోంలు, ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్‌ సెంటర్లపై టీజీఎంసీ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు డాక్టర్‌ శ్రీనివాస్‌, ఇమ్రాన్‌ అలీ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆధునిక వైద్యం చేయడానికి అవసరమైన అర్హత, రిజిస్ట్రేషన్‌ లేకుండానే రోగులకు చికిత్స అందిస్తున్నట్లు, అల్లోపతి మందులు రాస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

కొన్ని చోట్ల మందులు, ఇంజెక్షన్లు కూడా క్లినిక్‌లలోనే ఉంచుకుని వినియోగిస్తున్నట్లు, వైద్యుల అనుమతి లేకుండా ల్యాబొరేటరీ పరీక్షలు నిర్వహించి రిపోర్టులు సైతం ఇస్తున్న విషయాన్ని అధికారులు గుర్తించినట్లు తెలిపారు. అలాగే బయోమెడికల్‌ వ్యర్థాల నిర్వహణలోనూ నిబంధనల ఉల్లంఘనలు బయటపడ్డాయి.

స్వామి హోమియో కేర్‌ క్లినిక్‌, శ్రీలక్ష్మి క్లినిక్‌, లైఫ్‌ కేర్‌ పాలీ క్లినిక్‌, ప్రణతి క్లినిక్‌, శ్రీవిజయ క్లినిక్‌, జేజే హెల్త్‌ క్లినిక్‌, స్వప్న క్లినిక్‌, సాయి తిరుమల డయాగ్నోస్టిక్‌ సెంటర్‌, సౌజన్య నర్సింగ్‌ హోం, మదర్‌ థెరిసా ఫస్ట్‌ ఎయిడ్‌ సెంటర్‌, మహాలక్ష్మి ఆసుపత్రి, శ్రీరామ్‌ క్లినిక్‌ తదితర కేంద్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా వైద్య సేవలు అందిస్తున్న అంశాన్ని గుర్తించినట్లు టీజీఎంసీ అధికారులు వెల్లడించారు.

ఈ క్రమంలో వీరిపై టీఎంపీఆర్‌ చట్టంలోని సెక్షన్‌ 22, ఎన్‌ఎంసీ చట్టంలోని సెక్షన్‌ 34, 54 కింద కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. బీఏఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌ వంటి ఆయూష్‌ అర్హతలు, రిజిస్ట్రేషన్లు ఉన్నవారు కూడా నిబంధనలకు విరుద్ధంగా ఆధునిక వైద్యం చేస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ఇక అనధికార వైద్యం వ్యవహారంలో ఎక్కువగా నష్టపోయేది అవగాహన తక్కువగా ఉన్న సామాన్య రోగులే. సరైన అర్హతలు, రిజిస్ట్రేషన్‌ ఉన్నాయా లేదా అన్నది తెలియక చికిత్స తీసుకుంటూ ఆర్థికంగా నష్టపోవడంతో పాటు, తప్పుడు వైద్యం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం కూడా ఉంటుంది.

అందుకే ఇలాంటి క్లినిక్‌లపై తనిఖీలు నిరంతరం కొనసాగిస్తూ, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటే మరిన్ని అక్రమ వైద్య వ్యవహారాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక అర్హత లేని వైద్యులు, నిబంధనలు పాటించని క్లినిక్‌ల సమాచారం ఉంటే టీజీఎంసీ అధికారిక వాట్సప్‌ నంబర్‌ 91543 82828కు తెలియజేయాలని అధికారులు సూచిస్తున్నారు..

#mahbubnagar#Kalwakurthy#Amangal clinics#nursing homes#hospitals#diagnostic centers#TGMC Task Force raids Medical treatment#without qualifications
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి