ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్సకు ప్రత్యేక స్థానం ఉంది. శరీరంలో పేరుకుపోయిన దోషాలను తగ్గించి, జీర్ణక్రియతో పాటు శరీర పనితీరును సమతుల్యం చేయడం దీని ప్రధాన ఉద్దేశంగా ఆయుర్వేదం చెబుతుంది. అయితే పంచకర్మ అంటే అందరికీ ఒకే విధంగా చేసే చికిత్స కాదు. వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని బట్టి నిర్ణయిస్తారు.
పంచకర్మలో ప్రధానంగా ఐదు శుద్ధి విధానాలను ప్రస్తావిస్తారు. వమనంలో వైద్య పర్యవేక్షణలో వాంతి చేయించడం, విరేచనంలో మందుల ద్వారా విరేచనం కలిగించడం, బస్తిలో ఔషధ ద్రవాలను ప్రత్యేక విధానంలో ఉపయోగించడం, నస్యలో ముక్కు ద్వారా ఔషధాలను అందించడం, రక్తమోక్షణంలో నియంత్రిత పద్ధతిలో రక్తాన్ని తొలగించడం వంటి విధానాలు ఇందులో ఉంటాయి. అయితే ప్రతి వ్యక్తికి ఈ ఐదు విధానాలూ అవసరం ఉండవు. ఏది చేయాలి, ఏది చేయకూడదన్నది ఆయుర్వేద వైద్యుడి పరిశీలనపై ఆధారపడి ఉంటుంది.
ఇక ఆరోగ్యానికి ఈ చికిత్స విధానం ఎంతవరకు ఉపయోగపడుతుందనేది పరిశీలిస్తే.. కొన్ని ఆయుర్వేద చికిత్సలు, పంచకర్మ విధానాలు కొన్ని ఆరోగ్య సమస్యల్లో లక్షణాల తగ్గింపుకు లేదా జీవన నాణ్యత మెరుగుపడటానికి తోడ్పడే అవకాశం ఉన్నట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే పంచకర్మను ప్రతి వ్యాధికి నిర్ధారిత చికిత్సగా చెప్పడానికి ప్రస్తుతం బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు.
అంతేకాదు, ఇది పూర్తిగా ప్రమాదరహితమైన ప్రక్రియ కూడా కాదు. తప్పుగా లేదా శిక్షణ లేని వ్యక్తుల వద్ద చేయించుకుంటే వాంతులు, విరేచనాలు, నీరు-లవణాల అసమతుల్యత వంటి సమస్యలు రావచ్చు. కొన్ని ఆయుర్వేద చికిత్సల్లో ఉపయోగించే ఔషధాల విషయంలో, కలుషితాలు, లోహాల కలయిక వంటి భద్రతా అంశాలపై కూడా జాగ్రత్త అవసరమని పరిశోధనలు సూచిస్తున్నాయి.
అందుకే పంచకర్మను ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఒక సహాయక చికిత్సా విధానంగా చూడటం మాత్రమే సమంజసం. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, గర్భిణులు, వృద్ధులు లేదా ఇప్పటికే ఇతర మందులు వాడుతున్నవారు తప్పనిసరిగా వైద్యుల సలహాతోనే ముందుకు వెళ్లాలని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు..
ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!..


