కాక్‌పిట్‌లో కత్తులతో దాడి.. రక్తపు మడుగులో కెప్టెన్.. అదుపుతప్పిన విమానం.. ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు! సరిగ్గా అదే సమయంలో టాయిలెట్ నుంచి బయటకు వచ్చిన ఆరేళ్ల నినా.. తండ్రితో చెప్పిన ఒక్క మాట విమానంలో పెను పరిణామాలకు కారణమైంది.
విమానంలో అంతాసైలెన్స్...
దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానం. వందలాది మంది ప్రయాణికులు.. ఎవరి సీట్లలో వారు కూర్చున్నారు. కొందరు నిద్రలో.. మరికొందరు తమ ఫోన్లలో.. ఇంకొందరు ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. కానీ కాక్‌పిట్‌లో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. విమానాన్ని నడుపుతున్న భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌పై కో-పైలట్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఒక్కసారిగా కాక్‌పిట్ రక్తపాతంగా మారిపోయింది.
బయట ఉన్న ప్రయాణికులకు మాత్రం అసలు విషయం తెలియదు. విమానం వేల అడుగుల ఎత్తులో ఉంది.. కానీ కాక్‌పిట్‌లో ప్రాణాంతక పోరాటం జరుగుతోంది! సరిగ్గా అప్పుడే.. టాయిలెట్ నుంచి నినా అనే చిన్నారి బయటకొచ్చింది. కాక్‌పిట్‌లో జరుగుతున్న ఘర్షణ శబ్దాలు ఆమె చెవిలో పడ్డాయి. పైలట్ కేకలు కూడా వినిపించాయి. ఏదో సరిగ్గా లేదని అర్థం చేసుకున్న నినా భయంతో టాయిలెట్ నుంచి బయటకు వచ్చింది.
నాన్నా.. అంతా ఓకేనా?
టాయిలెట్ నుంచి బయటకు వచ్చినన చిన్నారి నేరుగా తన తండ్రి త్వివికా మానేస్ దగ్గరకు పరుగెత్తింది. నాన్నా.. కాక్‌పిట్ నుంచి శబ్దాలు వినిపిస్తున్నాయి.. మనం చనిపోము కదా? అని అడిగింది. ఈ ఒక్క ప్రశ్నతో తండ్రి షాక్‌కు గురయ్యాడు. అప్పటివరకు విమానంలో జరుగుతున్న ప్రమాదం గురించి తనకు తెలియదు. కానీ తన కుమార్తె మాటలు విన్న వెంటనే పరిస్థితి తీవ్రంగా ఉందని గ్రహించాడు. ఆ తర్వాత అతను సీట్లో కూర్చోలేదు.. నేరుగా కాక్‌పిట్ వైపు పరుగెత్తాడు.
తలుపు దగ్గర సీన్ తో షాక్!
కాక్‌పిట్ వద్దకు చేరుకున్న త్వివికా మానేస్‌కు కనిపించిన దృశ్యం భయానకంగా ఉంది. తలుపు కొద్దిగా తెరిచి ఉంది. లోపల కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ తీవ్రంగా గాయపడి ఉన్నారు. రక్తస్రావం అవుతోంది. మరోవైపు కత్తితో దాడి చేసిన కో-పైలట్ ఉన్నాడు. ఇంతలో విమానం కూడా తీవ్రంగా ఒడిదొడుకులకు లోనవుతోంది. అంటే ఒక్క సమస్య కాదు. కాక్‌పిట్‌లో దాడి.. పైలట్ తీవ్రంగా గాయపడ్డాడు.. విమానం అదుపు తప్పుతోంది! ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.
రక్తమోడుతున్న కెప్టెన్.. అయినా ఆగలేదు!
ఇక్కడే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ చేసిన పని అత్యంత కీలకంగా మారింది. తీవ్రంగా గాయపడినా.. బయట ఉన్నవారు లోపలికి వచ్చేందుకు కాక్‌పిట్ తలుపును పూర్తిగా తెరిచారు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్న త్వివికా మానేస్‌తో పాటు మరో ఇద్దరు ప్రయాణికులు ముందుకు దూసుకెళ్లారు. అసాఫ్ రజువాన్, యానివ్ హయున్ కూడా అతడితో కలిసి దాడి చేసిన వ్యక్తిని అడ్డుకున్నారు. కాక్‌పిట్‌లో అప్పటికే ప్రాణాల కోసం పోరాటం. బయట ప్రయాణికులు భయంతో చూస్తున్నారు. కానీ ఆ ముగ్గురు మాత్రం వెనక్కి తగ్గలేదు.
హెడ్‌ఫోన్ వైర్లతో కో-పైలట్‌ను కట్టేశారు!
ఆయుధంతో ఉన్న కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్న ప్రయాణికులు విమానంలోని హెడ్‌ఫోన్ సెట్ల వైర్లు, కేబుళ్లను ఉపయోగించి అతడిని కట్టేశారు. ఇదంతా జరుగుతున్న సమయంలో విమానం మాత్రం సాధారణ స్థితిలో లేదు. విమానం సుమారు 14 వేల అడుగుల మేర వేగంగా కిందికి దిగిపోయింది. క్యాబిన్‌లో ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. ఒకవైపు కాక్‌పిట్‌లో పోరాటం.. మరోవైపు ఆకాశంలో అదుపుతప్పుతున్న విమానం!
మరో ఇద్దరు పైలట్లు రంగంలోకి!
విమానంలో డ్యూటీలో లేని మరో ఇద్దరు పైలట్లు ఉన్నారు. పరిస్థితి విషమించడంతో వారు కాక్‌పిట్ ని కంట్రోల్ లోకి తీసుకున్నారు. విమానాన్ని తిరిగి అదుపులోకి తీసుకొచ్చారు. చివరకు సౌదీ అరేబియాలోని తబూక్‌లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానం నేలను తాకే వరకు ప్రయాణికుల గుండెల్లో దడే. కానీ చివరకు.. పెను ప్రమాదం తప్పింది. మరి ఈ కథలో నినా ఎక్కడ నిలుస్తుంది?
కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ ధైర్యం లేకపోతే పరిస్థితి ఎలా ఉండేదో చెప్పడం కష్టం. ప్రయాణికులు సాహసం చేయకపోయినా పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారేది. డ్యూటీలో లేని పైలట్లు నియంత్రణ తీసుకోకపోయినా విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడం కష్టమయ్యేది.
కానీ ఈ మొత్తం సంఘటనలో మొదటి కీలక అలర్ట్ ఇచ్చింది మాత్రం ఆరేళ్ల నినా.
ఆమె టాయిలెట్‌లో విన్న శబ్దాలను పట్టించుకోకుండా ఉండిపోయి ఉంటే.. తండ్రికి చెప్పకుండా అక్కడే ఉండిపోయి ఉంటే.. కాక్‌పిట్‌లో జరుగుతున్న ప్రమాదాన్ని గుర్తించడంలో మరింత ఆలస్యం జరిగి ఉండేది. అప్పటికే విమానం వేగంగా కిందికి దూసుకెళ్తోంది. అందుకే నినా చెప్పిన ఆ ఒక్క మాట.. “నాన్నా.. మనం చనిపోము కదా?” అనే మాట ఈ ఘటనలో మరిచిపోలేని క్షణంగా మారింది.
ఒక చిన్నారి భయం.. ఒక విమానం ప్రాణం!
ఆరేళ్ల నినా అప్పట్లో ఏం జరుగుతుందో పూర్తిగా అర్థం చేసుకుని ఉండకపోవచ్చు. ఆమెకు తెలిసింది ఒక్కటే.. కాక్‌పిట్‌లో ఏదో ప్రమాదం జరుగుతోంది. ఆ భయాన్ని తన తండ్రితో పంచుకుంది. తండ్రి వెంటనే స్పందించాడు. ఆ స్పందనతో ప్రయాణికులు కాక్‌పిట్‌లోకి చేరారు. కెప్టెన్‌కు సహాయం అందింది. దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మరో పైలట్లు నియంత్రణ చేపట్టారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. మొత్తానికి ఆ విమానంలోని అందరి కథలో మొదటి పేజీ మాత్రం ఆరేళ్ల నినా నుంచే మొదలైంది


