తెలంగాణ

హైదరాబాద్‌లో రూ.52వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

రచన: NK••10 నిమిషాల పఠనం

ప్రజా ప్రభుత్వం పాలనలో హైదరాబాద్‌ నగరం అభివృద్ధికి రూ.52వేల కోట్ల విలువైన మౌలిక వసతుల కల్పన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

* ‎ప్రజా పాలనలో భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల విస్తరణ

‎* ‎గత పదేళ్లలో నగరానికి ఒక్క చుక్క అదనపు తాగునీరు తీసుకురాలేదు‎

* ‎కాంగ్రెస్‌ హయాంలోనే ORR, విమానాశ్రయం, మెట్రో వంటి కీలక ప్రాజెక్టులు‎

* ‎గత ప్రభుత్వం ప్రచారానికి పరిమితం.. ప్రజా పాలనలో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు ‎

* ‎ప్రజాభవన్ లో ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క‎

* ‎హాజరైన మంత్రులు మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వివేక్‌ వెంకటస్వామి, అజారుద్దీన్‌

* ‎రాష్ట్ర మంత్రులందరికీ వన్ డే పాస్ ను కొనుగోలు చేసిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

‎* శనివారం ఉదయం 11 గంటలకు బేగంపేట మెట్రో రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణం చేయనున్న మంత్రులు ‎‎

Hyderabad: ‎ప్రజా ప్రభుత్వం పాలనలో హైదరాబాద్‌ నగరం అభివృద్ధికి రూ.52వేల కోట్ల విలువైన మౌలిక వసతుల కల్పన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. నగరంలో పెరుగుతున్న అవసరాలను తీర్చేందుకు రోడ్లు, ఫ్లైఓవర్లు, బ్రిడ్జ్ లు, అండర్‌పాస్‌లు, తాగునీటి వసతులు, ప్రజా రవాణా వ్యవస్థలు తదితర రంగాల్లో భారీగా పెట్టుబడులతో పనులు చేపట్టామని చెప్పారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందన్నారు.

‎‎హైదరాబాద్‌ ప్రజాభవన్‌లో శుక్రవారం తెలంగాణ ఆర్టీసీ-మెట్రో రైల్‌ కామన్‌ పాస్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రజలకు అవసరమైన పౌర సదుపాయాలను ఇప్పటి నుంచే విస్తరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.‎

‎ప్రస్తుత ప్రభుత్వం కేవలం ప్రచారానికి పరిమితం కాకుండా పనులు చేసి వాటి ఫలితాలను ప్రజలకు చూపించాలనే విధానంతో ముందుకు సాగుతోందని భట్టి అన్నారు. HMDA పరిధిలో రూ.35 వేల కోట్లతో రోడ్లు, ఫ్లైఓవర్లు, బ్రిడ్జిల వంటి భారీ మౌలిక వసతుల కల్పన పనులు చేపట్టామని తెలిపారు. GHMC, వాటర్‌ వర్క్స్‌, అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్లు, ఇతర అభివృద్ధి పనులతో కలిపి నగరంలో మొత్తం రూ.52 వేల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల కల్పన పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.‎

బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క చుక్క తాగునీరు కూడా తేలేదు

‎హైదరాబాద్‌ అభివృద్ధిలో గత కాంగ్రెస్‌ ప్రభుత్వాల పాత్రను ప్రస్తావిస్తూ.. నగరానికి తాగునీటి అవసరాలను తీర్చేందుకు కృష్ణా, గోదావరి, మంజీరా జలాలను గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలే తీసుకొచ్చాయని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లపాటు అధికారంలో ఉన్న ప్రభుత్వం నగరానికి ఒక్క చుక్క అదనపు తాగునీటిని కూడా తీసుకురాలేదని విమర్శించారు. ‎గండిపేట నీటిని నిజాం పాలనలోనే తీసుకొచ్చారని, ఆ తర్వాత హైదరాబాద్‌ తాగునీటి అవసరాల కోసం కృష్ణా, మంజీరా, గోదావరి జలాలను కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అందుబాటులోకి తెచ్చాయని చెప్పారు.‎

‎కాంగ్రెస్‌ హయాంలోనే కీలక ప్రాజెక్టులు‎

‎హైదరాబాద్‌కు మణిహారంగా నిలిచిన ఔటర్‌ రింగ్‌ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాంలోనే వచ్చాయని భట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, ట్రిపుల్‌ ఐటీ వంటి విద్యాసంస్థలతో పాటు BHEL, ECIL, DRDO, BDL, మిధాని, IDPL వంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలు కూడా అప్పటి కాంగ్రెస్‌ పాలనలోనే ఏర్పాటయ్యాయని గుర్తు చేశారు. వీటి ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించాయని పేర్కొన్నారు.‎

మెట్రో రైల్‌ 122 కిమీ మేర విస్తరణ

‎హైదరాబాద్‌ నగరంలో ప్రజా రవాణాను మరింత మెరుగుపరిచేందుకు మెట్రో రైల్‌ను 122 కిలోమీటర్ల మేర విస్తరించనున్నట్లు తెలిపారు. ఓల్డ్‌ సిటీ, ఎయిర్‌పోర్టు, పటాన్‌చెరు, హయత్‌నగర్‌ ప్రాంతాలకు మెట్రో కనెక్టివిటీ కల్పించేందుకు సుమారు రూ.38 వేల కోట్లతో ఫేజ్‌-2 ప్రాజెక్టును చేపట్టనున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌ అభివృద్ధిని నగర పరిధి దాటి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలనే ఉద్దేశంతో రీజినల్‌ రింగ్‌ రోడ్డు (RRR) ప్రాజెక్టును చేపట్టామన్నారు. 362 కిలోమీటర్ల మేర అన్ని జిల్లాలను అనుసంధానించే ఈ ప్రాజెక్టుకు రూ.30,627 కోట్ల వ్యయం అవుతుందని చెప్పారు.

మూసీ నది పునరుజ్జీవనానికి చర్యలు

ORR, RRRలను అనుసంధానిస్తూ 21 రేడియల్‌ రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని, ఇప్పటికే 10 రోడ్ల అలైన్‌మెంట్‌కు అనుమతులు ఇచ్చామని, రెండు రోడ్ల పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. హైదరాబాద్‌ నగరానికి కీలకమైన మూసీ నది పునరుజ్జీవనానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని భట్టి చెప్పారు. సుమారు 55-56 కిలోమీటర్ల మేర ప్రవహించే మూసీని ప్రక్షాళన చేసి, నగరానికి మెరుగైన పర్యావరణ వాతావరణాన్ని అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఫేజ్‌-1 పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిపారు.

‎‎ఎలక్ట్రిక్‌ బస్సులతో కాలుష్య నియంత్రణ‎

‎హైదరాబాద్‌లో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు డీజిల్‌ ఆర్టీసీ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెడుతున్నామని భట్టి తెలిపారు. ఇప్పటికే 550 ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి వచ్చాయని.. మరో 2,200 బస్సులను భవిష్యత్తులో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఆటో డ్రైవర్లు డీజిల్‌ ఆటోలను ఎలక్ట్రిక్‌ ఆటోలుగా మార్చుకునేందుకు రెట్రో ఫిట్టింగ్‌ కోసం రూ.200 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ‎హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో 30 వేల ఎకరాల్లో భారత్‌ ఫ్యూచర్‌ సిటీని అభివృద్ధి చేస్తున్నామని భట్టి తెలిపారు. ఈ ప్రాజెక్టులతో హైదరాబాద్‌ మరింత నివాసయోగ్యమైన నగరంగా మారుతుందని.. పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వివరించారు.

‎‎ఆర్టీసీ-మెట్రో కామన్‌ పాస్‌ ప్రారంభం‎

‎నగర ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించేందుకు ఆర్టీసీ, మెట్రో రైల్‌ కామన్‌ పాస్‌ విధానాన్ని ప్రారంభించడం అభినందనీయమని భట్టి అన్నారు. వన్‌ డే పాస్‌ నుంచి వన్‌ మంత్‌ పాస్‌ వరకు రెండు రవాణ వ్యవస్థల్లోనూ ఉపయోగించుకునేలా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు అభినందనలు తెలిపారు.

తాను, రాష్ట్ర మంత్రులంతా రూ.500 చెల్లించి వన్‌డే పాస్‌లు కొనుగోలు చేశామన్నారు. శనివారం ఉదయం బేగంపేట మెట్రో స్టేషన్‌ నుంచి మెట్రోలో ప్రయాణించి, అనంతరం ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ కామన్‌ పాస్‌ సౌకర్యాన్ని స్వయంగా పరిశీలించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వివేక్‌ వెంకటస్వామి, ‎అజారుద్దీన్‌, ప్రభుత్వ విప్ శాసనమండలి సభ్యులు అద్దంకి దయాకర్, మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు, రవాణశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజు తదితరులు పాల్గొన్నారు.

#Hyderabad#Hyderabad Development#Bhatti Vikramarka#Common Pass#Metro Rail RTC#Hyderabad Development Works#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి