AP: రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. లగ్జరీ సదుపాయాలతో కూడిన సరికొత్త వందేభారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమైంది. బెంగళూరు - ముంబయి మధ్య నడవనున్న ఈ రైలుకు రైల్వే బోర్డు నుంచి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. దసరా పండుగ కానుకగా ఈ సూపర్ ఫాస్ట్ రైలు సేవలు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఏపీలో రెండు ప్రధాన హాల్ట్‌లు
ఈ రూట్‌లో నడిచే వందేభారత్ స్లీపర్ ఏపీ ప్రయాణికులకు సైతం అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలోని అనంతపురం, గుంతకల్లు స్టేషన్లలో ఈ రైలు ఆగనుంది. వీటితో పాటు మార్గమధ్యంలో రాయచూర్, కలబురగి, సోలాపూర్, పుణె, కల్యాణ్ జంక్షన్లలో హాల్ట్‌లు ఇచ్చారు. దీంతో అనంతపురం, గుంతకల్లు పరిసర ప్రాంతాల వారికి ముంబయి, పుణె, బెంగళూరు నగరాలకు నేరుగా కనెక్టివిటీ దొరకనుంది.
జర్నీ టైమ్ భారీగా కట్
ప్రస్తుతం ముంబయి - బెంగళూరు మధ్య నడుస్తున్న ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ గమ్యం చేరడానికి దాదాపు 22 గంటలు తీసుకుంటోంది. కానీ ఈ కొత్త వందేభారత్ స్లీపర్ కేవలం 16 గంటల్లోనే గమ్యస్థానానికి తీసుకెళ్తుంది. అంటే ప్రయాణికులకు ఏకంగా 6 గంటల సమయం ఆదా కానుంది.
వారానికి ఆరు రోజులు సర్వీస్
బెంగళూరు - ముంబయి మధ్య సోమవారం కాకుండా వారంలో ఆరు రోజులు రాత్రి 10 గంటలకు బెంగళూరులో స్టార్ట్ అయ్యి.. మరుసటి రోజు మధ్యాహ్నం 1:50 గంటలకు ముంబయి చేరుతుంది. ముంబయి - బెంగళూరు మధ్య మంగళవారం మినహా మిగతా రోజుల్లో రాత్రి 10:30 గంటలకు ముంబయిలో బయల్దేరి.. మరుసటి రోజు మధ్యాహ్నం 2:50 గంటలకు బెంగళూరు వెళ్తుంది. హావ్‌డా - గువాహటి మధ్య నడుస్తున్న మొదటి రైలు తర్వాత.. దేశంలో రెండోదిగా, దక్షిణాదిలో ఫస్ట్ వందేభారత్ స్లీపర్‌గా ఈ రైలు రికార్డు సృష్టించనుంది. దీని సర్వీసులు స్టార్ట్ అయ్యే అఫీషియల్ డేట్‌ని రైల్వే అధికారులు త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.


