Harish Rao: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మాజీమంత్రి హరీశ్ రావు లేఖాస్త్రం సంధించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో తక్షణమే జోక్యం చేసుకోవాలని లేఖలో కోరారు. తెలంగాణలో విద్యుత్ సంస్థలు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలంటూ రాహుల్ గాంధీకి లేఖ రాశారు హరీశ్ రావు.
ట్రాన్స్ కో లో ప్రతిపాదిత 26శాతం ఈక్విటీ డైల్యూషన్ నిలిపివేయాలని రాహుల్ కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ విద్యుత్ ప్రసార వ్యవస్థకు ట్రాన్స్ కో కీలకమైన సంస్థ అని ఆయన స్పష్టం చేశారు. టీజీ జెన్ కో, ఎస్ సీసీఎల్, డిస్కంల విషయంలోనూ ఐపీవోలు, ఈక్విటీ డైల్యూషన్ ప్రైవేటీకరణను నిరోధించాలని హరీశ్ కోరారు. కాంగ్రెస్ 2019 మ్యానిఫెస్టోకు, 2023 రాయ్ పూర్ ఆర్థిక తీర్మానాలకు తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలు పూర్తిగా విరుద్ధం అని రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలపై వెంటనే జోక్యం చేసుకోవాలని రాహుల్ ను కోరారు.
ఢిల్లీలో విద్యుత్ రంగం, ఎల్‌ఐసీ ప్రైవేటీకరణను మీరు వ్యతిరేకిస్తున్నారు. మరి తెలంగాణలోని మీ సొంత కాంగ్రెస్ ప్రభుత్వం TG-TRANSCO, TG-GENCO, SCCL, DISCOMల వంటి కీలకమైన ఆస్తులను ప్రైవేటీకరించడానికి ఏ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది? అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు హరీశ్ రావు.
తెలంగాణలో TG-TRANSCO, TG-GENCO, SCCL, DISCOMల ప్రైవేటీకరణ ప్రతిపాదనను అడ్డుకోవడానికి, కీలకమైన ప్రభుత్వ రంగ సంస్థల ప్రాముఖ్యతను దెబ్బతీయకుండా నివారించడానికి మీ తక్షణ జోక్యం అవసరం. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం TG-TRANSCO, TG-GENCO, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL), DISCOMలు, ఇతర కీలక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలని భావిస్తున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో, నేను మీ తక్షణ జోక్యాన్ని కోరుతున్నా. ఇది కేవలం తెలంగాణకు సంబంధించిన విధానపరమైన అంశం మాత్రమే కాదుజ ఇది భారత జాతీయ కాంగ్రెస్ ఆర్థిక విధాన వైఖరిలోని స్థిరత్వం, విశ్వసనీయతకు సంబంధించి ఒక ప్రాథమిక ప్రశ్నను లేవనెత్తుతోంది.
2019 కాంగ్రెస్ మేనిఫెస్టో.. పెట్టుబడుల ఉపసంహరణను ప్రధానం కాని వ్యూహాత్మకం కాని ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే పరిమితం చేసింది. 2023లో రాయ్‌పూర్‌లో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీలో ఆమోదించిన ఆర్థిక తీర్మానం కూడా పెట్టుబడుల ఉపసంహరణ ప్రైవేట్ గుత్తాధిపత్యాలకు లేదా ద్వంద్వాధిపత్యాలకు దారితీయకూడదని నొక్కి చెప్పింది. ఇవే కాంగ్రెస్ ప్రకటించిన ఆర్థిక సూత్రాలుగా కొనసాగితే, అవి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా సమానంగా వర్తించాలి. సీడబ్ల్యూసీ తీర్మానం ఢిల్లీలో కట్టుబడి ఉండేదిగా, హైదరాబాద్‌లో ఐచ్ఛికంగా ఉండేదిగా ఉండకూడదు.
TG-TRANSCO ఒక కీలకమైన ప్రభుత్వ సేవా సంస్థ.. ఎలా ప్రైవేటీకరిస్తారు?
TG-TRANSCO అనేది సాధారణ వాణిజ్య సంస్థ కాదు. ఇది తెలంగాణ విద్యుత్ ప్రసార వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే అత్యంత కీలకమైన ప్రభుత్వ సేవా సంస్థ. ఇందులో 29 (400-kV), 107 (220-kV), 337 (132-kV) సబ్‌స్టేషన్లు.. 31,420 సర్క్యూట్ కిలోమీటర్లకు పైగా EHT లైన్లు.. 43,848 MVA సామర్థ్యం కలిగిన 1,184 పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నాయి. దశాబ్దాలుగా వరుస ప్రభుత్వాలు సమకూర్చిన ఈ విలువైన ఆస్తులను, ఇప్పుడు ఒక్క రాత్రిలో ప్రైవేటీకరించే ప్రతిపాదన తెరపైకి వచ్చింది.
ప్రారంభ దశలో 26% వాటాను (ఈక్విటీని) తగ్గించాలనే ప్రతిపాదన, కేవలం IPO (ప్రారంభ పబ్లిక్ ఆఫర్) గురించిన చర్చ కంటే పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది. అదేమిటంటే, కీలకమైన ప్రభుత్వ మౌలిక సదుపాయాలను ప్రైవేట్ యాజమాన్యానికి క్రమంగా అప్పగిస్తున్నారా? TG-GENCO, SCCL , DISCOMల విషయంలో కూడా ఇలాంటి చర్యలకే TG-TRANSCO ఒక తొలి అడుగు అయితే, ఈ సమస్య తెలంగాణకు చెందిన కీలకమైన ప్రభుత్వ ఆస్తుల భవిష్యత్తు యాజమాన్యం, నియంత్రణకు సంబంధించినదిగా మారుతుంది'' అని రాహుల్ గాంధీకి రాసిన లేఖలో హరీశ్ రావు పేర్కొన్నారు.


