Online Hate: అమెరికన్ డ్రీమ్ వెనుక ఇప్పుడు తీవ్ర అభద్రత, ఆందోళన అలముకుంటున్నాయి. దశాబ్దాలుగా సిలికాన్ వ్యాలీ నుంచి వాల్‌స్ట్రీట్ వరకు అమెరికా ప్రగతి రథాన్ని నడిపిస్తున్న భారతీయ నిపుణులు ఇప్పుడు తీవ్రమైన ఆన్‌లైన్ హేట్రెడ్‌ను ఎదుర్కొంటున్నారు. "మా ఉద్యోగాలు లాక్కుంటున్నారు" అనే తప్పుడు ప్రచారంతో కొందరు టార్గెట్ చేస్తుండటం ప్రస్తుతం యూఎస్‌లో పెను దుమారం రేపుతోంది.
ఆన్‌లైన్‌లో విద్వేష పర్వం
వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే ‘సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ ఆర్గనైజ్డ్ హేట్’ తాజా పరిశోధనలో చేదు నిజాలు వెలుగుచూశాయి. ప్రముఖ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో దక్షిణాసియా నిపుణులను టార్గెట్ చేసుకుని వస్తున్న ద్వేషపూరిత పోస్టులు రికార్డు స్థాయిలో 240 శాతం పెరిగాయి.
గతంలో నెలకు సగటున 12,904గా ఉన్న ఇలాంటి పోస్టులు, క్రమంగా పెరుగుతూ నెలకు ఏకంగా 43,843 మార్కును తాకాయి.
సుమారు ఏడాదిన్నర వ్యవధిలోనే 5 లక్షలకు పైగా వ్యతిరేక పోస్టులు ఆన్‌లైన్ వేదికలపై కనిపించాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. ఏఐ ఆధారిత మార్ఫింగ్ ఫోటోలు, వలసదారుల వ్యక్తిగత వివరాల లీకేజీలతో విష ప్రచారం తీవ్ర రూపం దాల్చుతోంది.
వివాదానికి కేంద్రబిందువు H-1B వీసాలేనా
ఈ వ్యవహారంలో ప్రధానంగా వినిపిస్తున్న అంశం ఉద్యోగాలు, H-1B వీసాలు. అమెరికా మంజూరు చేసే మొత్తం H-1B వీసాల్లో 71 శాతానికి పైగా భారతీయులకే దక్కుతుంటాయి. తమ అర్హత, ప్రతిభతో దక్కించుకుంటున్న ఈ అవకాశాలను.. "స్థానిక అమెరికన్ల ఉద్యోగాలను లాక్కోవడమే" అంటూ కొందరు నెటిజన్లు తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు.
దీనికితోడు అక్కడి రాజకీయ నాయకుల వలస వ్యతిరేక వ్యాఖ్యలు, 'మేక్ అమెరికా గ్రేట్ అగైన్' నినాదాలు ఈ విద్వేష భావనలకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. ఎలన్ మస్క్, వివేక్ రామస్వామి వంటి ప్రముఖులు టెక్ వీసాలకు మద్దతుగా మాట్లాడిన ప్రతిసారీ ఆన్‌లైన్ వేదికల్లో దాడి మరింత తీవ్రమవుతోంది.
అసలు వాస్తవాలు ఏం చెబుతున్నాయి?
భారతీయులపై జరుగుతున్న ఈ ప్రచారానికి, క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతన లేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికా మొత్తం జనాభాలో భారత సంతతి వారి వాటా కేవలం 1.4 నుంచి 1.5 శాతం మాత్రమే. కానీ, అమెరికా ప్రభుత్వానికి అందే మొత్తం ఆదాయపు పన్నులో ఏకంగా 5 నుంచి 6 శాతం వాటా భారతీయులదే. అంటే జనాభా నిష్పత్తితో పోలిస్తే నాలుగు రెట్లు అధికంగా పన్నులు చెల్లిస్తూ ఖజానాకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.
అమెరికాలోని ఒక భారతీయ కుటుంబ సగటు వార్షికాదాయం దాదాపు 1.51 లక్షల డాలర్లుగా ఉంది. ఇది అక్కడి జాతీయ సగటు కంటే చాలా ఎక్కువ. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ వంటి కీలక రంగాల్లో భారతీయ మేధస్సు లేకపోతే అమెరికా గ్లోబల్ లీడర్‌గా కొనసాగడం అసాధ్యం.
అంతిమంగా నష్టం ఎవరికి?
స్థానిక ఆర్థిక మందగమనం, పెరుగుతున్న నిరుద్యోగ భయం వల్ల స్థానికుల్లో ఏర్పడుతున్న అసంతృప్తి ఇలా విద్వేష రూపం దాలుస్తోందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఇండియన్ టాలెంట్‌ను దూరం చేసుకోవడం లేదా వారిని నిరుత్సాహపరచడం వల్ల అమెరికా ఆర్థిక ప్రయోజనాలే దెబ్బతినే ప్రమాదం ఉందనే హెచ్చరికలు వస్తున్నాయి. మరోవైపు, ఈ విద్వేష వాతావరణం భారతీయ మేధో వలసలపై పునరాలోచనకు దారితీస్తోంది. స్వదేశంలోనే తగిన అవకాశాలు, మౌలిక వసతులు కల్పిస్తే ప్రపంచాన్ని శాసించే మన టాలెంట్ దేశ నిర్మాణానికే ఉపయోగపడుతుందనే చర్చకు ఈ తాజా నివేదిక గట్టి బలాన్నిస్తోంది.


