TG: మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ ఆయుధాల చోరీ కేసు దర్యాప్తులో ఊహించని సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దోపిడీ కేవలం స్థానిక నేరస్థుల పని మాత్రమే కాదని, దీని వెనుక దేశవ్యాప్త అక్రమ ఆయుధాల మాఫియా హస్తం ఉందన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. 10 రోజుల పోలీసు కస్టడీలో ప్రధాన నిందితుడు, మాజీ ఆర్మీ జవాన్ మల్లేశ్ విచారణలో వెల్లడించిన వివరాలతో ఈ కేసు సరికొత్త మలుపు తిరిగింది.
కోల్‌కతా గన్ డీలర్‌తో సీక్రెట్ డీల్
ఆర్మీ నుంచి కొల్లగొట్టిన అత్యాధునిక తుపాకులను కోల్‌కతాకు చెందిన బడా ఆయుధ వ్యాపారి అవల్ దెయ్‌కు విక్రయించేందుకు మల్లేశ్ ముందే డీల్ కుదుర్చుకున్నట్లు విచారణలో తేలింది. 2022లోనే బీర్బల్ షా అనే మధ్యవర్తి ద్వారా అవల్ దెయ్‌తో మల్లేశ్‌కు పరిచయం ఏర్పడింది. గతంలోనే వారి వద్ద రూ.10 వేలకు ఓ తుపాకీని కొనుగోలు చేసి దోపిడీలకు యత్నించిన నేర చరిత్ర మల్లేశ్‌కు ఉంది. ఈ పాత పరిచయాలతోనే ఆర్మీ ఆయుధాగారం నుంచి దొంగిలించిన ఆయుధాలను భారీ మొత్తానికి వారికి అప్పగించేందుకు మల్లేశ్ ప్లాన్ రెడీ చేశాడు.
అంతర్జాతీయ లింకులు.. రోహింగ్యాలతో సంబంధాలు?
ఈ కేసులో మధ్యవర్తిగా ఉన్న బీర్బల్ షా బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతాకు వచ్చి స్థిరపడినట్లు పోలీసులు గుర్తించారు. బీర్బల్ షా, ఆయుధ వ్యాపారి అవల్ దెయ్‌లకు దేశవ్యాప్తంగా అక్రమ ఆయుధాల సరఫరా నెట్‌వర్క్ ఉన్నట్లు దర్యాప్తులో స్పష్టమైంది. అంతేకాకుండా, బీర్బల్ షాకు రోహింగ్యాలు, ఇతర సరిహద్దు ముఠాలతో ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దేశ రక్షణ దళాలకు చెందిన ఆయుధాలు సంఘవిద్రోహ శక్తులు లేదా ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.
పరారీలో ఉన్న డీలర్ల కోసం 6 ప్రత్యేక బృందాలు
మల్లేశ్ ఇచ్చిన పక్కా సమాచారంతో కోల్‌కతా కేంద్రంగా దందా నడుపుతున్న ఆయుధ వ్యాపారి అవల్ దెయ్, మధ్యవర్తి బీర్బల్ షాలను పట్టుకునేందుకు తెలంగాణ పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. వారిద్దరినీ అదుపులోకి తీసుకుంటే దేశవ్యాప్తంగా నడుస్తున్న ఈ అక్రమ ఆయుధ సిండికేట్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు, వారి నెట్‌వర్క్ గుట్టు పూర్తిగా రట్టయ్యే అవకాశముందని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.


