Khairatabad By Election: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ పతాక స్థాయికి చేరింది. దానం నాగేందర్‌పై అనర్హత వేటు, అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు గెజిట్ నోటిఫికేషన్ విడుదల కావడంతో ఖైరతాబాద్‌లో బైపోల్ నగారా మోగడం లాంఛనమేనని అంతా భావించారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు టికెట్ల లెక్కలు వేసుకుంటూ, గ్రౌండ్‌లో ప్రచారానికి సైతం సిద్ధమయ్యాయి.
అయితే, హైకోర్టు సాక్షిగా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) చేసిన ప్రకటనతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ప్రస్తుతానికి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేది లేదని ఈసీ తేల్చిచెప్పడంతో.. "ఖైరతాబాద్ ఉపఎన్నిక ఇప్పట్లో లేనట్లేనా? అసలేం జరగబోతోంది?" అనే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
పీజేఆర్ కుమార్తె వేసిన లీగల్ చెక్!
ఈ ట్విస్ట్‌కు ప్రధాన కేంద్రం దివంగత సీనియర్ నేత పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన ఆమె, దానం నాగేందర్ సమర్పించిన అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు ఉన్నాయంటూ గతంలోనే హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్ వేశారు. ఇటీవల దానంపై అనర్హత వేటు పడగానే ఆమె మరో కీలక వాదనను తెరపైకి తెచ్చారు
దానం నాగేందర్ దాఖలు చేసిన నామినేషనే నిబంధనలకు విరుద్ధమని కోర్టు తేలిస్తే, అసలు ఆయన ఎన్నిక రద్దవుతుంది. ఆ పరిస్థితుల్లో, ఆ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన తనను ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ప్రకటించాల్సి ఉంటుందని ఆమె వాదిస్తున్నారు.
తన పిటిషన్ కోర్టు విచారణలో ఉండగా, నియోజకవర్గానికి ఉపఎన్నిక నోటిఫికేషన్ ఇవ్వడం చెల్లదంటూ ఆమె న్యాయపోరాటం మొదలుపెట్టారు.
హైకోర్టులో ఈసీ స్టాండ్.. బైపోల్‌కు బ్రేక్!
విజయారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టులో ఎన్నికల సంఘం తరఫు సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ కీలక క్లారిటీ ఇచ్చారు. నియోజకవర్గంపై ఎలక్షన్ పిటిషన్ ఇంకా పెండింగ్‌లో ఉన్నందున, ప్రస్తుతానికి ఎలాంటి ఉపఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయడం లేదని స్పష్టం చేశారు. దీనిపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈసీ తీసుకున్న ఈ నిర్ణయంతో ఉపఎన్నిక ఇప్పట్లో సాధ్యం కాదనే సంకేతాలు గట్టిగా వెళ్లాయి.
ఇప్పుడు ఏం జరగబోతోంది?
ఖైరతాబాద్ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు పూర్తిగా హైకోర్టు తీర్పుపైనే ఆధారపడి ఉంది. ముందుముందు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చంటే.. కోర్టు గనుక దానం అఫిడవిట్‌లోని లోపాలను పరిగణనలోకి తీసుకుని, ఆయన ఎన్నికను ఆదిలోనే చెల్లనిదిగా గుర్తిస్తే.. రన్నరప్‌గా ఉన్న విజయారెడ్డిని నేరుగా ఎమ్మెల్యేగా ప్రకటించే అవకాశాలు పరిశీలనకు వస్తాయి. అలా జరిగితే అసలు ఉపఎన్నిక అవసరమే ఉండదు.
ఒకవేళ కోర్టు విజయారెడ్డి వాదనలను తోసిపుచ్చి ఎలక్షన్ పిటిషన్‌ను కొట్టివేస్తే, అప్పుడు మాత్రమే కేంద్ర ఎన్నికల సంఘం ఖైరతాబాద్‌కు ఉపఎన్నిక నిర్వహించడానికి లైన్ క్లియర్ అవుతుంది. కానీ ఆ విచారణ ప్రక్రియ ముగియడానికి ఎంత సమయం పడుతుందనేది ఎవరూ చెప్పలేరు.
ఉపఎన్నిక ఖాయమనుకుని రంగంలోకి దిగిన ప్రధాన పార్టీల నేతలంతా ఇప్పుడు తాత్కాలికంగా తమ ప్రచారాలకు బ్రేక్ వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. న్యాయస్థానం ఇచ్చే తుది తీర్పు వచ్చేదాకా ఖైరతాబాద్ పోరు అగమ్యగోచరంగానే మిగిలిపోనుంది. ఒకవైపు ఎమ్మెల్యేగా అనర్హత వేటు, మరోవైపు కోర్టు పరిధిలో నలుగుతున్న ఎన్నికల వివాదం.. వెరసి ఖైరతాబాద్ పీఠం ఎవరికి దక్కుతుందన్నది తేలడానికి ఇంకొంత కాలం వేచిచూడక తప్పని పరిస్థితి నెలకొంది.


