TBJP : తెలంగాణలో మరో ఎన్నికల సమరానికి సైరన్ మోగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల పోరును అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. అయితే ఇప్పుడు అందరి కళ్లూ హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ స్థానంపైనే ఉన్నాయి. ఈ కీలక సీటును ఎలాగైనా కైవసం చేసుకుని రాష్ట్రంలో తమ సత్తా చాటాలని కాషాయ దళం ఈ సీటుపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నింపేలా స్వయంగా పార్టీ రాష్ట్ర నాయకుడే ఈ ఎన్నికల సమరంలోకి దిగుతున్నాడనే ప్రచారం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో కాకరేపుతోంది.
ఆ సీటు అంత ప్రత్యేకం ఎందుకు?
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పరిధి అంటే సాధారణ వ్యవహారం కాదు. దాదాపు 10 ఉమ్మడి జిల్లాలు, ఏకంగా 76 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్న ఓటర్ల ప్రభావం ఈ స్థానంపై ఉంటుంది. విద్యావంతులు, ఐటీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగ యువత అత్యధికంగా ఉండే నియోజకవర్గం ఇది. ఇక్కడ వెలువడే తీర్పు కేవలం ఒక ఎమ్మెల్సీ ఎన్నికకే పరిమితం కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా విద్యావంతుల మైండ్‌సెట్‌ను ప్రతిబింబిస్తుందని పార్టీలు భావిస్తాయి. ఇప్పటికే ఉత్తర తెలంగాణ పట్టభద్రుల, ఉపాధ్యాయ స్థానాల్లో సాధించిన విజయాలతో జోరు మీదున్న కమలదళం, ఈసారి సౌత్ తెలంగాణలో కూడా విజయకేతనం ఎగరేయాలని పక్కా వ్యూహాలు రచిస్తోంది.
ఆశావహుల జాబితాలో అనూహ్య ట్విస్ట్
ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు బీజేపీలో తీవ్ర పోటీ నెలకొంది. ఎన్వీ సుభాష్, పవన్ కుమార్ రెడ్డి, అమర్నాథ్ సారంగం, మల్లారెడ్డి, గంగాపురం వెంకట్ రెడ్డి వంటి కీలక నేతలు టికెట్ ఆశిస్తున్నారు. అయితే అధికార పార్టీ వ్యూహాలను తిప్పికొట్టి, సీటును నూటికి నూరు శాతం తమ ఖాతాలో వేసుకోవాలంటే గట్టి అభ్యర్థి ఉండాలని అధిష్టానం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన బీజేపీ నేత ఎన్.రామచందర్ రావు పేరు తెరపైకి వచ్చింది. ఆయన కూడా వెనకడుగు వేయకుండా "పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే బరిలోకి దిగడానికి సిద్ధం" అని ప్రకటించడంతో రాజకీయ లెక్కలు ఒక్కసారిగా మారిపోయాయి.
రామచందర్ రావుకు కలిసివచ్చే అంశాలు
2015లో ఇదే స్థానం నుంచి విజయం సాధించి విద్యావంతులు, ఉద్యోగుల గొంతుకగా శాసనమండలిలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. 2021 ఎన్నికల్లో సురభి వాణిదేవి చేతిలో స్వల్ప తేడాతో ఓటమిపాలైనప్పటికీ, నియోజకవర్గ పరిధిలోని పట్టభద్రులతో ఆయనకున్న విస్తృత పరిచయాలు బలమైన ప్లస్‌పాయింట్‌గా మారనున్నాయని చెబుతున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్వయంగా బరిలోకి దిగితే కింది స్థాయి క్యాడర్‌లో వచ్చే ఊపు మొత్తం 76 అసెంబ్లీ నియోజకవర్గాలపై స్పష్టంగా కనిపిస్తుందని కమలనాథులు లెక్కలేస్తున్నారు.
ప్రభుత్వ వ్యతిరేకతే ప్రధాన అస్త్రం
ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో నెలకొన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ చూస్తోంది. కొత్త పీఆర్సీ అమలులో జాప్యం, పెన్షనర్ల సమస్యలు, యువతకు ఇచ్చిన నిరుద్యోగ భృతి ఉద్యోగ నోటిఫికేషన్ల హామీలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని భావిస్తోంది. ఇప్పటికే ఓటర్ల నమోదు ప్రక్రియపై పార్టీ దృష్టి సారించింది. విద్యావంతులంతా తమ వెంటే ఉన్నారని ధీమా వ్యక్తం చేస్తున్న బీజేపీ, ఈ గ్రాడ్యుయేట్ స్థానాన్ని గెలుచుకుని రాబోయే రాజకీయ పోరుకు బలమైన పునాది వేయాలని చూస్తోంది. అధిష్టానం రామచందర్ రావును పోటీకి దించాలని డిసైడ్ అయితే, ఈ గ్రాడ్యుయేట్ పోరు రసవత్తరంగా మారడం ఖాయం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


