అధికార కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు.రాష్ట్రంలో పెద్దఎత్తున అవినీతి అక్రమాలు, జరుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం తప్పులు ఎత్తి చూపిస్తున్న ప్రతిపక్ష నేతలపై కేసులు పెడుతున్నారని, వారి ఆస్తుల మీద తప్పులు ఆరోపణలు చేస్తున్నారని, మరి అధికార పార్టీ మంత్రులు రూ. వందల కోట్లు దోచేస్తున్నా వారిపై ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించిన ఈపీఎఫ్, ఈఎస్ఐ డబ్బులు కాంట్రాక్టర్లు తిన్నారని ప్రభుత్వం వేసిన నిజనిర్దారణ కమిటీ తేల్చిందని మరి వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లను పిలిచి ఓ మంత్రి మీటింగ్ పెట్టారని, వారి నుంచి పెద్దఎత్తున డబ్బులు వసూలు చేశారని.. ఆ నిధులు అన్ని ఎక్కడికి పోయాయని నిలదీశారు. ప్రభుత్వ ఖజానాలో జమ చేశారా? ఎవరి జేబులోకి వెళ్లాయని ప్రశ్నించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ‘మీ మంత్రులు రూ.1,100 కోట్ల అవినీతికి పాల్పడితే.. కేసులు ఎందుకు పెట్టరు?
ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.4,500 వేల కోట్లు కాంట్రాక్టర్లు తింటే ఆ కాంట్రాక్టర్ల వద్ద నుండి రూ.1,100 కోట్లు కొందరు మినిస్టర్స్ వసూలు చేశారు. రూ.1100 కోట్లు తిన్నారని కమిటీ నివేదికే చెబితే చర్యలు తీసుకోరా? అదే మా కేటీఆర్ గారి ఫార్ములా-ఈ కేసులో రూ. 50 కోట్లు అకౌంట్ నుండి అధికారికంగా పోతే అవినీతి, అవినీతి అని గగ్గోలు పెట్టారు. మీరు రూ.1,100 కోట్ల అవినీతి చేశారని కమిటీ నిర్ణయిస్తే ఎందుకు కేసు పెట్టడం లేదని’ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తన సొంత మంత్రుల అవినీతి ఆరోపణలపై ఒకలా, ఇతరులపై మరోలా వ్యవహరిస్తోందని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. పలువురు మంత్రులపై అవినీతి ఆరోపణలు వచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాపాడుతున్నారన్నారు. అంతేకాకుండా, రాష్ట్రంలోని సివిల్ సప్లయీస్(పౌరసరఫరాలు), ఇతర శాఖల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తున్నాయని.. ఆధారాలను తమ నేతలు చూపిస్తున్నా ప్రభుత్వం ఎందుకు కేసులు పెట్టడం లేదని నిలదీశారు.


