తెలంగాణ

Congress : ‘దానం’ ఎన్నిక చెల్లకపోతే నేనే ఎమ్మెల్యే : విజయారెడ్డి

రచన: Kumar•••5 నిమిషాల పఠనం

ఖైరతాబాద్ ఉపఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఘటనలో దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వాన్ని హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే అసెంబ్లీ సెక్రెటరీ ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఖాళీ ఏర్పడిందని గెజిట్ విడుదల చేశారు.

ఖైరతాబాద్ ఉపఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఘటనలో దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వాన్ని హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే అసెంబ్లీ సెక్రెటరీ ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఖాళీ ఏర్పడిందని గెజిట్ విడుదల చేశారు.సరిగ్గా ఉపఎన్నికకు సంబంధించిన ప్రక్రియను ఈసీ చేపట్టిన తరుణంలో 2023 ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి దానం నాగేందర్ (బీఆర్ఎస్) చేతిలో ఓడిపోయి రెండో స్థానానికి పరిమితమైన విజయారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు.

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎన్నిక చెల్లదంటూ, నియోజకవర్గానికి ఉపఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయకుండా నిలిపివేయాలని ఆమె తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. దానం నాగేందర్ తన ఎన్నికల అఫిడవిట్ (ఫామ్ -26)లో తన భార్య, డిపెండెంట్ల ఆస్తుల వివరాలను పూర్తిగా వెల్లడించకుండా కీలక సమాచారాన్ని దాచిపెట్టారని ఆరోపిస్తూ 2024 జనవరిలో విజయారెడ్డి హైకోర్టులో మొదటిసారి ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేశారు.దానం నాగేందర్ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని ఆమె అందులో కోరారు.

దాని మీద హైకోర్టులో ఇంతవరకు తుది విచారణ జరగలేదు. పెండింగులో ఉన్నది. ఇప్పటికే మూడేండ్లు గడిచిపోయాయి. అయితే, బీఆర్ఎస్ నుంచి గెలిచి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి సికింద్రాబాద్ ఎంపీగా ‘హస్తం’ బీఫాం మీద పోటీ చేసినందుకు దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు వేయడంతో మరల కథ మొదటికి వచ్చింది. ఈ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) సిద్ధమైంది.ఈ నేపథ్యంలో విజయారెడ్డి మళ్లీ హైకోర్టును ఆశ్రయించి, "తాను గతంలో వేసిన ఎలక్షన్ పిటిషన్‌పై హైకోర్టులో ఇంకా తుది తీర్పు రాలేదని, అది తేలకుండా ఉపఎన్నిక నోటిఫికేషన్ ఇవ్వడం చట్టవిరుద్ధం" అని పిటిషన్ దాఖలు చేశారు.

ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారనే కేసు కోర్టులో పెండింగ్‌లో ఉన్నప్పుడు, ఉపఎన్నిక జరపడం వల్ల మరిన్ని న్యాయపరమైన చిక్కులు వస్తాయని ఆమె తరఫు న్యాయవాదులు వాదించారు. ఒకవేళ కోర్టు విచారణలో దానం నాగేందర్ ఎన్నిక తప్పు అని తేలితే, ఆ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన తననే ఎమ్మెల్యేగా ప్రకటించే అవకాశం ఉంటుందని విజయారెడ్డి భావిస్తున్నారు. కాగా, హైకోర్టులో ఈ వివాదం తేలేవరకు ఖైరతాబాద్‌ నియోజకవర్గానికి ఉపఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయబోమని ఎన్నికల సంఘం (ECI) కోర్టుకు స్పష్టంచేసింది.

ఈ క్రమంలోనే విజయారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడారు. దానం నాగేందర్‌పై ఎన్నికల పిటిషన్ వేశానని, కోర్టు తీర్పు మీద తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. ‘దానం’ ఎన్నిక చెల్లకపోతే తననే ఎమ్మెల్యేగా ప్రకటించే అవకాశం ఉందని, తన వాదనను కోర్టు అంగీకరిస్తుందని విశ్వసిస్తున్నట్టు వెల్లడించారు. ఎన్నికల పిటిషన్‌పై తీర్పు రాకుండా ఉపఎన్నిక వద్దని సుప్రీంకోర్టు తీర్పు ఉందని.. ఒకవేళ తన పిటిషన్ పక్కనపెడితే అందుకు గల కారణాలపై మరోసారి కోర్టుకు వెళ్తానని చెప్పారు. ఒకవేళ ఉపఎన్నిక వస్తే అధిష్టానం ఏం చేస్తుందో చూడాలని తెలిపారు.

#danam nagendar#vijayareddy#congress#by poll#highcourt#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి