దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ (Flydubai) విమానాన్ని కూల్చేందుకు ఒమన్ కో-పైలట్ చేసిన కుట్రను అత్యంత ధైర్యసాహసాలతో తిప్పికొట్టి, వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్, కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. ప్రస్తుతం స్మిత్ మచ్ఛార్ అత్యుత్తమ వైద్య చికిత్స కోసం సౌదీ అరేబియా నుంచి అబుదాబికి తరలించగా ఆయన ఆరోగ్య పరిస్థితిని ప్రధాని అడిగి తెలుసుకున్నారు.
సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తీవ్ర గాయాలపాలైనప్పటికీ ఆయన చూపిన సమయస్ఫూర్తి, ధైర్యసాహసాలను ప్రధాని ప్రశంసించారు. అదేవిధంగా ప్రధాని మోదీ స్మిత్ తండ్రి భూపేంద్ర భాయ్, తల్లి గీతా బెన్, భార్య సోనాల్ బెన్‌లతో కూడా మాట్లాడి, భారత ప్రభుత్వం, రాయబార కార్యాలయం తరఫున పూర్తి వైద్య సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.
యావత్ భారతావని గర్వపడేలా స్మిత్ చూపిన వీరత్వాన్ని వివరిస్తూ, ‘భారతీయులు ఇతరుల ప్రాణాలు తీసేవారు కాదు, ఇతరులను కాపాడటానికి తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టే సంస్కృతి మనది’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సైతం స్మిత్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ‘9/11 తరహా పెను విపత్తును తప్పించిన నిజమైన హీరో’ అని వారు కొనియాడారు.
దుబాయ్ నుంచి బయల్దేరిన ఫ్లైదుబాయ్ ఎఫ్జడ్1073 (FZ1073) విమానంలో కో-పైలట్ దాడి చేయడంతో విమానం దాదాపు 14వేల అడుగుల కిందకు దిగింది. గాయపడినప్పటికీ స్మిత్ మచ్ఛార్ కాక్‌పిట్ తలుపులను తెరిచి, ప్రయాణికులు, రిలీఫ్ పైలట్లు లోపలికి వచ్చేలా చేశారు. దీంతో విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్ విమానాశ్రయంలో సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. స్మిత్ ను యావత్ భారత్ కొనియాడుతున్నది.


