తెలంగాణ

BRS : కళ్యాణలక్ష్మికి 12 ఏళ్లు.. తులం బంగారం దేవుడెరుగు..స్కీం నీరుగార్చొద్దు : హరీశ్ రావు

రచన: Kumar•••7 నిమిషాల పఠనం

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక ఏర్పడిన తొలి తెలంగాణ ప్రభుత్వంలో అమలైన కళ్యాణలక్ష్మి పథకానికి నేటితో 12 ఏళ్లు పూర్తి అయ్యాయని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. ‘

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక ఏర్పడిన తొలి తెలంగాణ ప్రభుత్వంలో అమలైన కళ్యాణలక్ష్మి పథకానికి నేటితో 12 ఏళ్లు పూర్తి అయ్యాయని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. ‘కళ్యాణ లక్ష్మీ పథకం.. సామాజిక సంస్కరణ పథం. లక్షలాది ఆడబిడ్డల జీవితాల్లో వెలుగులు నింపి వారిని ‘కళ్యాణలక్ష్ములు’గా తీర్చిదిద్దిన అద్భుత పథకం.బాల్య వివాహాలను అడ్డుకుని పేదింటి ఆడబిడ్డలకు, తల్లిదండ్రులకు అండగా నిలిచిన ఈ గొప్ప కార్యక్రమానికి నేటితో 12 ఏళ్లు పూర్తి..

ఒక తండ్రి కన్నీటి వేదనను చూసి కేసీఆర్ మదిలో పుట్టిన ఆలోచనే కళ్యాణ లక్ష్మీ/షాదీ ముబారక్.2002 మార్చిలో ములుగు మండలం గుత్తూరు తండాలో జరిగిన అగ్నిప్రమాద ఘటన కేసీఆర్‌ను తీవ్రంగా కలచివేసింది. బిడ్డ పెళ్లి కోసం దాచుకున్న రూ.50 వేల నగదు, బంగారం అగ్నికి ఆహుతయ్యాయి. గుండెలవిసేలా రోదిస్తున్న బానోతు కీమానాయక్‌ను చూసిన కేసీఆర్ చలించిపోయారు.

ఇచ్చిన మాట ప్రకారం దగ్గరుండి ఆ బిడ్డ పెళ్లి జరిపించారు. అవసరమైన ఆర్థిక సాయం అందించారు.ఆ ఘటనతో కార్యాచరణ రూపం దాల్చిన పథకమే.. కళ్యాణ లక్ష్మీ–షాదీ ముబారక్. అధికారంలోకి రాగానే 2014 అక్టోబర్ 2న రూ.51,000 ఆర్థిక సాయంతో పథకం ప్రారంభించిన కేసీఆర్. 2017లో రూ.75,116కు..2018 లో రూ.1,00,116కు పెంచారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో 13,15,297 మంది ఆడబిడ్డలకు రూ.11,560 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించారు.పేదింటి ఆడబిడ్డకు మేనమామలా అండగా నిలిచిన కేసీఆర్.. కళ్యాణ లక్ష్మీ ద్వారా ఒక పథకాన్ని మాత్రమే అమలు చేయలేదు.బాల్య వివాహాల నిర్మూలనకు బలమైన పునాది వేశారు. పేద కుటుంబాల్లో ఆడబిడ్డ పెళ్లి భారాన్ని తగ్గించారు. ఒక సామాజిక సంస్కరణకు నాంది పలికారు.

పార్లమెంట్ చట్టాలు సైతం పరిష్కారం చూపని బాల్య వివాహ సమస్యకు ఒక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పథకం పరిష్కార మార్గాన్ని చూపించింది.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతటి మహోన్నత పథకానికి నిర్లక్ష్యం చుట్టుముట్టింది.పెళ్లిళ్లు అయిపోయి పిల్లలు పుట్టినా.. కళ్యాణ లక్ష్మీ డబ్బుల కోసం పేద కుటుంబాలు ఎదురుచూస్తున్న పరిస్థితి. BRS ప్రభుత్వ హయాంలో ఏడాదికి రూ. 2500 కోట్లు ఈ పథకం కోసం ఖర్చు చేస్తే, ఇప్పుడు అందులో సగం కూడా ఖర్చు చేయని పరిస్థితి.

కేసీఆర్ మీద కక్షతో ఇప్పటికే కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ వంటి పథకాలను నిలిపివేశారు.అదే కోవలో కళ్యాణ లక్ష్మిని నీరుగార్చుతున్నారు. ఎన్నికల సమయంలో రూ.లక్ష నగదుతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక గాలికి వదిలేశారు. మూడేళ్లు గడిచినా ఆడబిడ్డలకు ఇచ్చిన హామీని అమలు చేయలేక చేతులెత్తేశారు. తులం బంగారం దేవుడెరుగు, కెసిఆర్ గారు ఇచ్చిన లక్ష ఇస్తే చాలు అన్న పరిస్థితి వచ్చింది.

తమిళనాడు సీఎం విజయ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన బంగారం హామీని నాలుగు నెలల్లోనే అమలు చేస్తూ.. ప్రభుత్వ దవాఖానల్లో పుట్టిన ఆడబిడ్డకు బంగారు ఉంగరం అందించే పథకాన్ని ప్రారంభించారు.తెలంగాణలో మాత్రం మూడేళ్లు గడిచినా తులం బంగారం పరిస్థితి దిక్కుతోచని స్థితిలోనే ఉంది.మాటలు కోటలు దాటితే.. చేతలు గడప దాటవు అనడానికి మరో నిదర్శనం కాంగ్రెస్ ప్రభుత్వం.అన్ని వర్గాలను మోసం చేసినట్టే.. పేదింటి ఆడబిడ్డలను సైతం మోసం చేసిన ఘనుడు రేవంత్ రెడ్డి. కళ్యాణ లక్ష్మీ/షాదీ ముబారక్ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు ఆపాలి.

ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్న సుమారు 2 లక్షల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి.అభయహస్తం మేనిఫెస్టోలో ఆడబిడ్డల పెళ్లికి లక్షతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీ నిలబెట్టుకోవాలి.కళ్యాణ లక్ష్మీ/షాదీ ముబారక్‌ను రాజకీయ కక్షలకు బలిచేయకుండా, పేదింటి ఆడబిడ్డకు అండగా నిలిచే పథకంగా కొనసాగించాలి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సాక్షిగా మీరు ఇచ్చిన తులం బంగారం హామీని గుర్తు చేస్తున్నా.. నీతి, నిజాయితీ ఉంటే అమలు చేసి, మాట నిలుపుకోవాలని BRS పక్షాన డిమాండ్ చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.

#harish rao#kalyanalaxmi#brs#congress#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి