ఏపీలో పేదల సొంతింటి కలను మరింత నాణ్యతతో, వేగవంతంగా నెరవేర్చేందుకు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం వినూత్న సాంకేతికతకు శ్రీకారం చుట్టింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ 2.0 పథకం కింద 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ తొలిదశలో 177 ఇళ్లను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఆధునిక నిర్మాణ సరళిని ప్రోత్సహించడంతో పాటు అత్యల్ప వ్యవధిలోనే దృఢమైన, నాణ్యమైన ఇళ్లను అందించడమే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.
ఈ ప్రాజెక్టులో భాగమైన ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5.10లక్షలు ఖర్చు కానుండగా, మొత్తం 177 ఇళ్లకు గానూ రూ.13.93కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.9.44కోట్లు సమకూర్చనుంది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రూ.4.49కోట్లను భరించనుంది. రూర్కీకి చెందిన ప్రముఖ 'సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్’ (CBRI) సంస్థ ఈ గృహ నిర్మాణాలకు అవసరమైన పూర్తి సాంకేతిక సహకారాన్ని అందించనుంది.
ప్రాజెక్టులో భాగంగా తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెంలో 100 ఇళ్లు, గుంటూరు గ్రామీణ పరిధిలోని ఓబుల్‌నాయుడుపాలెంలో దివ్యాంగుల కోసం 77 ఇళ్లను నిర్మించనున్నారు. కేవలం గోడలు, స్లాబ్‌ల నిర్మాణానికే కాకుండా.. స్థల అభివృద్ధి, ఉచిత మెట్లు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ర్యాంప్‌లు, మరుగుదొడ్లు, షెడ్లు వంటి మౌలిక వసతులను కూడా ప్రభుత్వం అదనపు నిధులతో సమకూరుస్తోంది.
ఈ చారిత్రాత్మక పైలట్ ప్రాజెక్టుకు సంబంధించి అక్టోబర్ 4వ తేదీన సీఎం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో రాష్ట్ర గృహనిర్మాణ శాఖ, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు, సీబీఆర్‌ఐ (CBRI) అధికారుల మధ్య అధికారిక అవగాహన ఒప్పందం (MoU) కుదరనుంది. దేశంలోనే అత్యంత వినూత్నంగా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో 3డీ ప్రింటింగ్ ద్వారా పేదలకు ఇళ్లను నిర్మించడం ఒక మైలురాయిగా నిలవనుంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ గనక ఆశించిన ఫలితాలను ఇస్తే, రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా నిర్మించే లక్షలాది ఇళ్లకు ఇదే నాణ్యమైన ప్రింటింగ్ టెక్నాలజీని విస్తరింపజేసేందుకు ఏపీ ప్రభుత్వం సమాయత్తమవుతోంది.


