ఏపీ

స్థానిక ఎన్నికల జీవోపై హైకోర్టు తీర్పు.. చంద్రబాబుపై బొత్స ఘాటు వ్యాఖ్యలు!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు (బీసీలు) 34శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు రద్దు చేయడంపై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి బీసీలకు వెన్నుపోటు పొడిచారని ఆయన ఆరోపించారు.

 ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు (బీసీలు) 34శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు రద్దు చేయడంపై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు మరోసారి బీసీలకు వెన్నుపోటు పొడిచారని ఆయన ఆరోపించారు. న్యాయపరంగా ఈ జీవో కోర్టులో నిలవదని ముందే తెలిసినప్పటికీ, కేవలం రాబోయే స్థానిక ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలనే కుట్రతోనే ప్రభుత్వం ఈ డ్రామాకు తెరలేపిందని ఆయన విమర్శించారు.

 గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదనే స్పష్టమైన నిబంధన ఉందని బొత్స గుర్తుచేశారు. ఈ చట్టపరమైన పరిమితి తెలిసి కూడా చంద్రబాబు బీసీలను దారుణంగా మోసం చేసేందుకు 34శాతం రిజర్వేషన్ల జీవోను తెచ్చారని మండిపడ్డారు. ప్రస్తుతం హైకోర్టు ఈ నిర్ణయాన్ని కొట్టివేయడంతో, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ప్రభుత్వం ప్రకటించడం బీసీ వర్గాలను మరోసారి మభ్యపెట్టే ప్రయత్నమేనని, ఇది పూర్తిగా బీసీ సమాజాన్ని తప్పుదోవ పట్టించడమేనని ఆయన దుయ్యబట్టారు.

 కూటమి ప్రభుత్వానికి బీసీల సంక్షేమంపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. సుప్రీంకోర్టును ఆశ్రయించకుండా, పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ తెచ్చేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు రావాల్సిన న్యాయపరమైన హక్కులను వైసీపీ అడ్డుకుంటోందంటూ అధికార టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. టీడీపీలో ఉన్న బీసీ నాయకులు కూడా ఇప్పటికైనా కళ్లు తెరిచి చంద్రబాబు మోసపూరిత విధానాలను ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

 స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసేందుకే ప్రభుత్వం రిజర్వేషన్ల అంశాన్ని సాకుగా వాడుకుంటోందని బొత్స ఆరోపించారు. బీసీలకు చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు దక్కేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి శాశ్వత పరిష్కారాన్ని అన్వేషించాలని ఆయన కోరారు. ఎన్నికల ముసుగులో బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకోవడం కాకుండా, వారి ఆర్థిక, రాజకీయ పురోగతికి కట్టుబడి ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన డిమాండ్ చేశారు.

#BotsaSatyanarayana#ChandrababuNaidu#B CReservations#APHighCourt#YSRCP#TDPGovt#APLocalBodyElections#APNews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి