తెలంగాణ

కవులు, రచయితల నిబద్ధత, నిజాయితీకి నిదర్శనం ‘మరసం’: హరీశ్ రావు

రచన: Mamatha puppala••8 నిమిషాల పఠనం

సంఘాలు స్థాపించడం ఎంతో సులువైనప్పటికీ, ప్రభుత్వం నుంచి వచ్చే అనేక రకాల ఒత్తిళ్లను తట్టుకుని 40 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు మంజీరా రచయితల సంఘం(మరసం) నిలబడిందంటే అందులోని కవులు, రచయితల నిబద్ధత, నిజాయితీయే ప్రధాన కారణమని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తానీరు హరీశ్ రావు కొనియాడారు.

 సంఘాలు స్థాపించడం ఎంతో సులువైనప్పటికీ, ప్రభుత్వం నుంచి వచ్చే అనేక రకాల ఒత్తిళ్లను తట్టుకుని 40 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు మంజీరా రచయితల సంఘం(మరసం) నిలబడిందంటే అందులోని కవులు, రచయితల నిబద్ధత, నిజాయితీయే ప్రధాన కారణమని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తానీరు హరీశ్ రావు కొనియాడారు. బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మరసం 40 ఏళ్ల వసంతాల మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాల హెచ్చరికలు, ఆకాశరామన్న ఉత్తరాలు, ఉద్యోగాల తొలగింపు బెదిరింపులతో పాటు టాడా చట్టం కింద జైలు శిక్షలు అనుభవించినా భయపడకుండా పోరాడిన గొప్ప చరిత్ర ఈ సంస్థకు ఉందని స్పష్టం చేశారు. కేవలం కవిత్వానికి, పుస్తకాలకే పరిమితం కాకుండా 1992 నాటి మద్యపాన నిషేధ ఉద్యమం, ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు, గుట్కా నిషేధం వంటి అనేక సామాజిక సమస్యలపై ‘మరసం’ ముందుండి పోరాడిందని గుర్తుచేశారు.

 తెలంగాణ ఉద్యమ తొలిరోజుల్లో ఇక్కడి కవులు, మేధావులపై ఆంధ్ర పాలకులు చూపిన వివక్షకు తెలంగాణ రచయితల వేదిక ద్వారా నందిని సిద్ధారెడ్డి గట్టి సమాధానం చెప్పారని హరీశ్ రావు కొనియాడారు. వారు రాసిన 'నాగేటి సాలల్లో నా తెలంగాణ' పాటతో పాటు అమరులకు జోహార్లు అర్పించే గీతాలు ఉద్యమానికి కొత్త ఊపునిచ్చి ప్రజలను ఉర్రూతలూగించాయని తెలిపారు. సిద్ధారెడ్డి గారు కామారెడ్డి ప్రిన్సిపాల్‌గా వచ్చిన ప్రమోషన్‌ను సైతం వదులుకుని సిద్దిపేట మట్టి కోసం, ఉద్యమం కోసమే నిలబడ్డారని చెప్పారు.

 పదవులు, డబ్బు కంటే సిద్ధాంతమే ముఖ్యమని నమ్మిన ఆయన.. సీఎం రేవంత్ రెడ్డి ఆఫర్ చేసిన కోటి రూపాయలను కూడా సున్నితంగా తిరస్కరించి తన నిజాయితీని చాటుకున్నారని ప్రశంసించారు. అదేవిధంగా ఉపాధ్యాయుడిగా సస్పెన్షన్ నోటీసులొచ్చినా లెక్కచేయక ఉద్యమంలో పనిచేసిన దేశపతి శ్రీనివాస్, సకల జనుల సమ్మె వెనుక వ్యూహకర్తగా వ్యవహరించిన దేవి ప్రసాద్‌ పాత్ర ఎంతో విలక్షణమైనదని, వీరి స్ఫూర్తి తన రాజకీయ పరిణితికి ఎంతగానో తోడ్పడిందని అన్నారు.

 అప్పట్లో చెక్ డ్యామ్ నిర్మించాలన్నా ఆంక్షలు

ఉమ్మడి రాష్ట్ర పాలనలో మంజీరా నదిపై కనీసం చెక్ డ్యామ్ నిర్మించాలన్నా తీవ్ర ఆంక్షలు ఉండేవని, కానీ తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ మంజీరాపై పదుల సంఖ్యలో చెక్ డ్యామ్‌లు నిర్మించి మెదక్ జిల్లాను సస్యశ్యామలం చేశారని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ కాలంలో రద్దు చేయబడిన సాహిత్య అకాడమీని స్వరాష్ట్రంలో కేసీఆర్ గారే తిరిగి పునరుద్ధరించారని తెలిపారు. నందిని సిద్ధారెడ్డిని మొదటి చైర్మన్‌గా నియమించి ప్రపంచ తెలుగు మహాసభలను అత్యంత ఘనంగా నిర్వహించామని గుర్తుచేశారు.

 అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులవుతున్నా కనీసం సాహిత్య అకాడమీకి చైర్మన్‌ను కూడా నియమించలేకపోయిందని, దాంతో అకాడమీకి తాళాలు పడి కార్యకలాపాలు నిలిచిపోయాయని విమర్శించారు. కేసీఆర్ పాలనలోనే బతుకమ్మ, బోనాలు రాష్ట్ర పండుగలుగా గుర్తించబడ్డాయని, జయశంకర్ సార్, సర్వాయి పాపన్న, దొడ్డి కొమరయ్య వంటి మహనీయులకు తగిన గౌరవం దక్కిందని, అలాగే 550 మందికి పైగా కళాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని వివరించారు.

కవిత్వంలోని సహజత్వాన్ని ‘ఏఐ’ రాయలేదు

నేటి డిజిటల్ యుగంలో చిన్నపిల్లలకు చందమామను చూపిస్తూ అన్నం తినిపించే రోజులు పోయి, సెల్ ఫోన్లు చూపిస్తూ తినిపించే పరిస్థితులు వచ్చాయని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ల వాడకం పెరగడం వల్ల నేటితరంలో పుస్తకాలు చదివే అలవాటు బాగా తగ్గిపోతోందని హరీశ్ రావు అన్నారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికీ ప్రయాణాల్లో సైతం పిల్లల నుంచి పెద్దల వరకు పుస్తకాలు చదువుతారని, మన వద్ద కూడా పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ప్రభుత్వాలపై ఉందన్నారు.

 సమాజంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ రేపటి తరానికి మన చరిత్రను అందించడానికి పుస్తకమే ప్రధాన ఆధారమని, అలాంటి గ్రంథాలను చదివే సంస్కృతిని పెంపొందించాలని సూచించారు. సమాజంలో జరుగుతున్న అణచివేత, వివక్షపై పోరాడటానికి కవితలు, పాటలు శక్తివంతమైన ఆయుధాలుగా ఉపయోగపడతాయని హరీశ్ రావు తెలిపారు. ప్రస్తుతం కృత్రిమ మేధస్సు(AI) సాంకేతికత అందుబాటులోకి వచ్చి నిమిషాల్లో కవితలు, పుస్తకాలు రాసిచ్చే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.

 అయితే, సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందినప్పటికీ, ఒక కవి తన సొంత అనుభవాలతో, గుండె లోతుల్లోంచి రాసే కవిత్వంలో ఉండే ఆత్మీయత, సజీవత్వం, నిజాయితీ ఏఐకి ఎంతమాత్రం రాదని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను, మన వీర పోరాటాలను రాబోయే తరాలకు సజీవంగా అందించడానికి పుస్తక రూపంలో ఉన్న సాహిత్యమే ఏకైక మార్గమని ఆయన చెప్పారు. అన్యాయాలపై గళమెత్తే ప్రతి కవిని, పాటను, సాహిత్యాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిపైనా ఉందంటూ హరీశ్ రావు తన ప్రసంగాన్ని ముగించారు.

#HarishRao#ManjeeraRachayitalaSangham#NandiniSidhaReddy#BRS#KCR#TelanganaLiteraryAcademy#TelanganaNews#ArtificialIntelligence
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి