National

National : కేంద్రహోంశాఖ కీలక నిర్ణయం.. లడక్‌లోని ఆ ప్రాంతాలకు అధికారిక పేర్లు

రచన: Kumar••4 నిమిషాల పఠనం

పొరుగుదేశాలతో సరిహద్దు వివాదాలు మరోసారి తెరమీదకు వస్తున్న సమయంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా చైనాతో సరిహద్దు పంచుకుంటున్న జమ్మూకశ్మీర్‌లో విభజించబడిన కేంద్రపాలిత ప్రాంతం లడక్‌లో కేంద్రం పలు ముఖ్యనిర్ణయాలు తీసుకుంది.

పొరుగుదేశాలతో సరిహద్దు వివాదాలు మరోసారి తెరమీదకు వస్తున్న సమయంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా చైనాతో సరిహద్దు పంచుకుంటున్న జమ్మూకశ్మీర్‌లో విభజించబడిన కేంద్రపాలిత ప్రాంతం లడక్‌లో కేంద్రం పలు ముఖ్యనిర్ణయాలు తీసుకుంది.

లడక్‌లోని 28 కీలక ప్రదేశాలు, భౌగోళిక విశేషాలను ప్రామాణిక పేర్లతో భారత అధికారిక చిత్రపటంలో నమోదు చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కేంద్ర హోంశాఖ సమన్వయంతో లడక్‌లోని అధికార యంత్రాంగంతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన అనంతరం సర్వే ఆఫ్ ఇండియా (SoI) అధికారిక మ్యాప్‌లో ఈ 28 ప్రాంతాలను అధికారిక పేర్లతో పొందుపరిచినట్లు కేంద్ర హోంశాఖ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. సరిహద్దు వ్యూహాత్మక ప్రాంతాలు, పర్వత కనుమలు, నివాస ప్రాంతాలు, భౌగోళిక విశేషాలను కచ్చితమైన వివరాలతో జాతీయ మ్యాప్‌లో ప్రామాణీకరించినట్టు తెలిపింది.

ఇలా చేయడం వలన పాలనాపరమైన స్పష్టత వస్తుందని, అందుకే ఈ చర్య చేపట్టినట్టు ప్రకటించింది. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్‌లలో ఈ ప్రదేశాలను అధికారికంగా గుర్తించడం వలన దేశవ్యాప్తంగా ప్రజల్లో, రక్షణ వర్గాల్లో, పర్యాటకుల్లో సరైన అవగాహన కలుగుతుందని హోంశాఖ తెలిపింది. గతంలో వివిధ పేర్లతో పిలువబడుతూ స్థానికంగా నెలకొన్న గందరగోళానికి తెరదించినట్టు అవుతుందని కేంద్రం భావించింది.

ప్రతి ప్రాంతానికి కచ్చితమైన ప్రామాణిక గుర్తింపును అందించేందుకు ఈ నిర్ణయం ఎంతో దోహదపడుతుందని లడక్ ప్రాంత అధికారులు తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో సమర్థవంతమైన పాలన, విపత్తు నిర్వహణ ప్రణాళికలు, భౌగోళిక సమగ్రతను పరిరక్షించడంలో సర్వే ఆఫ్ ఇండియా రూపొందించిన ఈ నూతన మ్యాపింగ్ ప్రక్రియ అత్యంత కీలక మైలురాయిగా నిలవనుందని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఇదిలాఉండగా, ఈ మధ్యకాలంలో అరుణాచల్ ప్రదేశ్ తమ దేశంలోని భూభాగంగా చైనా పలుమార్లు పేర్కొంటూ వచ్చింది. లడక్‌లోని కొన్ని ప్రాంతాల్లో వేగంగా సైనిక చర్యలు చేపడుతున్న చైనాకు .. కేంద్రం తీసుకున్న తాజాగా నిర్ణయం ఇది తమ భూభాగం అని గట్టిగా వాదన వినిపించినట్టు అవుతుందని హోంశాఖ వర్గాలు వెల్లడించాయి.

#ladakh#union territory#central home ministry#maps and names#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి