ప్రభుత్వ టీచర్లు, ఉద్యోగులు మరోసారి భారీ స్థాయిలో ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. గత ప్రభుత్వ హయాంలో తెచ్చిన జీవో 317ను రద్దు చేయాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ఈ జీవోను అధికారిలోకి వస్తే రద్దు చేస్తామని, టీచర్ల అభిప్రాయాలు తీసుకుని బదిలీలు చేపడతామని నాటి పీసీసీ చీఫ్ రేవంత్ .. ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చి మూడేండ్లు అయినా తమ సమస్యకు పరిష్కారం దొరకలేదని జీవో 317 బాధిత ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం అయిన గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు.. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జీవో 317 స్థానంలో GO 190ను అమలు చేయాలని కోరుతున్నారు. బాధితుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని బదిలీలు చేపట్టాలని..వారి ఇష్టానుసారం స్వగ్రామ జిల్లా లేదా జోన్‌కు బదిలీ చేయాలని టీచర్ల డిమాండ్ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.
గాంధీభవన్ ముట్టడిలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసులు భారీగా మోహరించారు.శాంతియుతంగా ఆందోళన చేయనున్నట్టు ఉపాధ్యాయ, ఉద్యోగులు ప్రకటించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారి సమస్యలు పరిష్కరిస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇదిలాఉండగా, జీవో 317ను డిసెంబర్ 6, 2021న అప్పటి కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చింది.తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగి 33 జిల్లాలు ఏర్పడిన తర్వాత, కొత్తగా అమల్లోకి వచ్చిన ‘కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులు-2018’ ఆధారంగా ఉద్యోగులను కొత్త స్థానిక క్యాడర్లకు కేటాయించేందుకు తెచ్చారు.
ఈ జోవో ప్రకారం ఉద్యోగుల సీనియారిటీ ఆధారంగా బదిలీలు చేపట్టారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలు (క్యాన్సర్, కిడ్నీ ఆపరేషన్లు మొదలైనవి), వితంతువులకు, 70% పైగా వైకల్యం ఉన్నవారికి మాత్రమే మినహాయింపులు ఇచ్చారు. కాగా, ఈ జీవో అమల్లోకి వచ్చిన నాటి నుండి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు దీనిని రద్దు చేయాలని లేదా సవరించాలని పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నాయి. కేవలం సీనియారిటీని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవడం వల్ల ఒక జిల్లాలో పుట్టి, పెరిగి, ఉద్యోగం సాధించిన జూనియర్ ఉద్యోగులను వారి ఆప్షన్లతో సంబంధం లేకుండా వేరే సుదూర జిల్లాలకు కేటాయించారు.
దీనివల్ల వారు తమ సొంత జిల్లాలోనే 'నాన్-లోకల్' (స్థానికేతరులు) అయిపోయారు. ఒకే చోట లేదా పక్కపక్క జిల్లాల్లో పనిచేయాల్సిన భార్యాభర్తలను ఈ జీవో వందల కిలోమీటర్ల దూరంలోని వేర్వేరు జిల్లాలకు బదిలీ చేసింది సీనియర్లకు వారు కోరుకున్న పట్టణ ప్రాంతాల్లో పోస్టింగులు దక్కగా, జూనియర్ ఉద్యోగులు/ఉపాధ్యాయులు మారుమూల లేదా ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వచ్చింది. 2017 TRT బ్యాచ్ ఉపాధ్యాయులు దీనివల్ల తీవ్రంగా నష్టపోయారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.












