గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. అన్ని పార్టీల కంటే ముందే అధికార కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చింది. కానీ, ఇప్పుడు ఓ అభ్యర్థి హస్తం పార్టీకి షాక్ ఇచ్చారు. తనకు ఎమ్మెల్సీ వద్దు అని.. ఎమ్మెల్యే సీటు కావాలని పట్టుబట్టి కూర్చున్నట్టు సమాచారం. దీంతో ఏం చేయాలో తెలియక హైమాండ్ తలపట్టుకున్నట్టు సమాచారం.
‘నల్గొండ–ఖమ్మం–వరంగల్’ కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి తాను ఎమ్మెల్సీగా పోటీ చేయలేనంటూ చేతులు ఎత్తేసినట్టు ప్రచారం జరుగుతోంది. గ్రాడ్యుయేట్ టికెట్ కావాలంటూ ఎవరిని అడగలేదని, పోటీ చేయమంటూ పార్టీ పెద్దలు కూడా తనను సంప్రదించలేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. తనను ఒక్కమాట కూడా అడుగకుండా అభ్యర్థిగా ప్రకటించడం ఏంటని ఆయన పార్టీలోని కీలక నేతలను కలిసి ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి టికెట్ ఇవ్వాలని పార్టీ పెద్దల వద్ద తన మనసులోని మాటను బయటపెట్టినట్టు తెలిసింది.వాస్తవానికి అధికార పార్టీ టికెట్ కోసం ఆశావహులు పెద్ద సంఖ్యలో పోటీ పడుతుంటారు. జోరుగా లాబీయింగ్ చేస్తుంటారు. కానీ, అందుకు విరుద్ధంగా సర్వోత్తమ్ రెడ్డి వ్యవహారం ఉంది. రెండు రోజుల కింద ‘మహబూబ్ నగర్–రంగారెడ్డి–హైదరాబాద్’ ఎమ్మెల్సీ స్థానం అభ్యర్థిగా సామ రామ్మోహన్ రెడ్డి, ‘నల్గొండ–ఖమ్మం–వరంగల్’ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని ఖరారు చేస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.
అయితే, లిస్టులో తన పేరు ఉండటంతో సర్వోత్తం రెడ్డి షాక్ అయినట్టు సమాచారం. తనకు ఎమ్మెల్సీ టికెట్ కావాలని ఎవరినీ అడుగలేదని, లిస్టులో తన పేరు ఎలా ప్రకటించారని ఆయోమయానికి గురైనట్టు తెలిసింది. పార్టీకి చెందిన కీలక నేతలను కలిసి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో తాను పోటీ చేయాలేనంటూ చేతులు ఎత్తేసినట్టు టాక్ వినిపిస్తోంది.కాగా, దీనిపై హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుంది? సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ సైతం ఏం చేస్తారో తెలియాల్సి ఉంది.












