హోటల్‌కు వెళ్లగానే కళ్లు ఆకర్షించే రంగు.. టేబుల్‌పైకి రాగానే నోరూరించే వాసన.. మళ్లీ మళ్లీ తినాలనిపించేలా చేసే రుచి. ప్రస్తుతం హోటళ్లకు వెళ్ళిన వారికి కలిగే అనుభవాలు ఇవి.. కానీ ఆ ఆహారం తయారీలో ఏం కలిపారు? ఎంతసేపు నిల్వ ఉంచారు? ఎన్నిసార్లు ఉపయోగించిన నూనెలో వండారు? అనే విషయాలు మాత్రం వినియోగదారుడికి పట్టవు..
తాజాగా హనుమకొండలో ఆహార భద్రతా అధికారుల తనిఖీల్లో రసాయనాలు కలిపిన చికెన్‌తో పాటు పలు ఆహార పదార్థాల్లో నాణ్యతా లోపాలు బయటపడటం ఈ వ్యవహారాన్ని మరోసారి చర్చనీయాంశంగా మార్చింది. హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, మిఠాయి దుకాణాలు, పండ్ల వ్యాపారాల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి.
మాంసం, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలను సరైన ఉష్ణోగ్రతల్లో నిల్వ చేయకపోవడం.. పచ్చి మాంసం, ఇతర ఆహారాలను ఒకే విధంగా ఫ్రిజ్‌లలో ఉంచడం.. మిఠాయిలు, బేకరీ ఉత్పత్తుల్లో కృత్రిమ రంగులను అధికంగా ఉపయోగించడం.. పండ్లను త్వరగా పండించేందుకు రసాయనాల వినియోగం.. ఒకసారి ఉపయోగించిన వంట నూనెను పదేపదే వాడటం వంటి అంశాలు ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఇది ఒక్క హనుమకొండకే పరిమితమైన సమస్య కాదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆహార భద్రతా అధికారుల తనిఖీల్లో పలుచోట్ల హోటళ్ల వంటశాలల్లో అపరిశుభ్రత, మాంసం నిల్వలో నిబంధనల ఉల్లంఘనలు బయటపడ్డాయి. హనుమకొండ జిల్లాలో ఈ ఏడాది 36 కేసులు నమోదు కాగా.. వాటిలో 22 క్రిమినల్ కేసులు ఉన్నాయి. మరో 12 కేసుల్లో యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసి రూ.1.83 లక్షల జరిమానా విధించారు.
మరోవైపు వరంగల్ జిల్లాలో ఇలాంటి 12 కేసులు నమోదవగా.. అందులో నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నాయి. రూ.2.15 లక్షల జరిమానా విధించడంతో పాటు మరో 14 హోటళ్లకు నోటీసులు జారీ చేశారు. ఇక మహబూబాబాద్‌లో 16 కేసులు నమోదయ్యాయి. ములుగు జిల్లాలో ఇన్‌ఛార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారి పరిధిలో ఎనిమిది కేసులు నమోదయ్యాయి. అలాగే జనగామలో 11 కేసులతో పాటు రూ.2 లక్షల జరిమానా విధించారు.
భూపాలపల్లి జిల్లాలో రెండు క్రిమినల్ కేసులు నమోదు చేసి 12 మంది వ్యాపారులకు జరిమానాలు విధించారు. ఇవి అధికారులు గుర్తించిన ఘటనలు మాత్రమే. తనిఖీలకు చిక్కకుండా కొనసాగుతున్న నిబంధనల ఉల్లంఘనలు ఎన్ని అన్నది మాత్రం స్పష్టంగా తెలియదు. ఇక ఆహార భద్రత విషయంలో ప్రధాన ఆందోళన కలిగించే అంశాల్లో పదేపదే ఉపయోగించే వంట నూనె కూడా ఒకటి.
ఒకసారి వేయించిన నూనెను మళ్లీ మళ్లీ ఉపయోగించడం వల్ల అందులో టోటల్ పోలార్ కాంపౌండ్స్ అనే పదార్థాలు పెరుగుతాయని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చెబుతోంది. ఇలా ఉపయోగించిన నూనెలో టీపీసీ 25 శాతానికి మించితే దాన్ని ఆహార తయారీలో ఉపయోగించకూడదని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనలు చెబుతున్నాయి. అందుకే ఆహారాన్ని నిల్వ చేసే విషయంలో జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం.
ఫుడ్ సేఫ్టీ సంస్థ (FSSAI) మార్గదర్శకాల ప్రకారం... చల్లగా ఉండాల్సిన ఆహార పదార్థాలను తక్కువ ఉష్ణోగ్రతలోనే ఉంచాలి. అలాగే ఫ్రోజెన్ పదార్థాలను కూడా సరిపడా కూలింగ్‌లో నిల్వ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా... మాంసం, చికెన్ లాంటి పదార్థాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు అవసరం. వీటిని సరైన ఉష్ణోగ్రత వద్ద ఉంచకపోతే, అందులో హానికరమైన సూక్ష్మజీవులు వేగంగా పెరిగే ప్రమాదం ఉంది..
మరోవైపు ఆహారంలో అధికంగా కృత్రిమ రంగులు కలపడం కూడా ఆందోళన కలిగించే అంశమే. ఆహారం సహజంగా ఉండాల్సిన రంగు కంటే అసాధారణంగా కనిపిస్తే వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. హైదరాబాద్‌లో గతంలో జరిగిన ఆహార భద్రతా తనిఖీల్లో కూడా సింథటిక్ ఫుడ్ కలర్స్, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, అపరిశుభ్రమైన వంటశాలలు వంటి ఉల్లంఘనలు గుర్తించినట్లు అధికారుల తనిఖీ వివరాలు వెల్లడించాయి.
ఇలాంటి ఘటనలు వరుసగా బయటపడుతున్న సమయంలో మరో అంశాన్ని కూడా విస్మరించలేం. మారుతున్న జీవనశైలి, అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారం, ఎక్కువ నూనె, ఉప్పు, చక్కెరతో కూడిన ఆహారపు అలవాట్లతో ఇప్పటికే అధిక బరువు, మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు వంటి జీవనశైలి వ్యాధులు పెరుగుతున్నాయి. అలాంటి సమయంలో ఆహార నాణ్యతపై నిర్లక్ష్యం మరింత ఆందోళన కలిగిస్తోంది. కలుషితమైన లేదా నాణ్యత లేని ఆహారం దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతుంది.
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో వ్యాపారుల బాధ్యత ఎంత ముఖ్యమో.. అధికారుల నిరంతర పర్యవేక్షణ కూడా అంతే కీలకం. ఆహార భద్రతా విభాగం తనిఖీలు కేవలం ఫిర్యాదు వచ్చినప్పుడు లేదా ఘటన వెలుగులోకి వచ్చినప్పుడు మాత్రమే కాకుండా నిరంతరంగా కొనసాగాలి. నమూనాలు సేకరించి ప్రయోగశాలలకు పంపడం, నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై చర్యలు తీసుకోవడం, మళ్లీ అదే తప్పు జరగకుండా పర్యవేక్షించడం వంటి చర్యలు కట్టుదిట్టంగా ఉండాల్సిన అవసరం ఉంది.
ఇక వినియోగదారులూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే. అసాధారణంగా ఎక్కువ రంగుతో కనిపించే మిఠాయిలు, ఆహార పదార్థాలను కొనుగోలు చేయకుండా ఉండటం, అనుమానం కలిగించే మాంసాన్ని తీసుకోకపోవడం, పదేపదే వేయించిన నూనెలో తయారైన ఆహారాన్ని తగ్గించడం, ప్యాకేజ్డ్ ఆహారంపై లేబుల్, తయారీ తేదీ, గడువు తేదీ వంటి వివరాలను పరిశీలించడం అవసరం. ఆహార భద్రతపై అనుమానం ఉంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం కూడా వినియోగదారుడి హక్కు, బాధ్యత.
అలాగే నోరూరించే రంగు.. రుచిని పెంచే ప్రయత్నంలో.. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం కోసం.. ఆహారం తయారీలో నాణ్యతను పక్కన పెడితే చివరికి నష్టపోయేది వినియోగదారుడే. కాబట్టి హోటల్ అయినా, బేకరీ అయినా, మిఠాయి దుకాణం అయినా, పండ్ల వ్యాపారం అయినా.. ఆహారం విషయంలో నిబంధనలను పాటించడం వ్యాపార ధర్మమే కాదు, ప్రజారోగ్యానికి సంబంధించిన బాధ్యత కూడా. ఈ విషయంలో ప్రతి వినియోగదారుడు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇదని అధికారులు సూచిస్తున్నారు.












