యూఏఈ నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానం (FZ1073)లో కో-పైలట్ జరిపిన భయానక ఉగ్ర కుట్రకు సంబంధించిన కీలక దృశ్యాలు కొత్తగా వెలుగులోకి వచ్చాయి. ఒమన్‌కు చెందిన కో-పైలట్ విమానాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నుతూ, దానిని అడ్డుకోబోయిన భారతీయ సంతతికి చెందిన కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై కత్తితో దారుణంగా దాడి చేశాడు.
తీవ్ర రక్తస్రావమవుతున్నా కెప్టెన్ స్మిత్ సాహసంతో కాక్‌పిట్ డోర్ తెరిచి ప్రయాణికులకు విషయం చెప్పడంతో, ప్రయాణికులు, సిబ్బంది కలిసి ఉగ్ర కుట్రను భగ్నం చేసి 174మంది ప్రాణాలను కాపాడారు. విమానంలో ప్రయాణికుడు చిత్రీకరించిన వీడియోలో ప్రయాణికులు తీవ్ర భయాందోళన నడుమ ఇంగ్లీష్, హీబ్రూ భాషల్లో అరుస్తున్న దృశ్యాలు నమోదయ్యాయి.
‘అతడు విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించాడు’ అని ప్రయాణికులు అరవడం, తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో ఉన్న కెప్టెన్ స్మిత్‌కు విమానంలో ఉన్న ఇజ్రాయెల్ దంత వైద్యుడు డాక్టర్ షోటా ముసయెవ్ అత్యవసర వైద్యం అందించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. తీవ్రంగా గాయపడినప్పటికీ కెప్టెన్ స్మిత్ చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించారు.
ల్యాండింగ్ అనంతరం నిందితుడైన కో-పైలట్ చేతులు కట్టేసి, నేలపై మోకాళ్లపై కూర్చోబెట్టిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ‘ఇతను టెర్రరిస్ట్, పోలీసులు వచ్చే వరకు విమానం నుంచి దించవద్దు’ అని ప్రయాణికులు గట్టిగా పట్టుబట్టారు. ప్రస్తుతం నిందితుడిని సౌదీ అరేబియా నుంచి యూఏఈకి తరలించగా, ఈ ఘటన వెనుక అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల హస్తం ఉందా? అనే కోణంలో అబుదాబి నిఘా వర్గాలు తీవ్రంగా విచారిస్తున్నాయి.


