Health

Health: అధిక బరువు వల్ల ఆరోగ్యానికి కలిగే నష్టాలు ఏమిటి?..

రచన: Venu••4 నిమిషాల పఠనం

అధిక బరువు ఉన్నవారిలో రక్తపోటు, కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

అధిక బరువు పెరగడం వల్ల శరీరంపై క్రమంగా ఒత్తిడి పెరుగుతుంది. బరువు ఎక్కువగా ఉన్నవారిలో రోజువారీ పనులు చేయడంలో ఇబ్బంది, త్వరగా అలసిపోవడం వంటి సమస్యలు మొదలై.. క్రమంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా అధిక బరువు ఉన్నవారిలో రక్తపోటు, కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. బరువు ఎక్కువగా ఉంటే గుండె ఎక్కువగా పనిచేయాల్సి రావడంతో గుండె జబ్బులు, గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా పెరుగుతుందని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు.

మరోవైపు పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువగా పేరుకుపోతే కాలేయంలో కూడా కొవ్వు పేరుకునే అవకాశాలున్నాయని, దీనినే ఫ్యాటీ లివర్ అంటారని చెబుతున్నారు... ఈ సమస్య ఎక్కువైతే కాలేయం పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇక అధిక బరువు వల్ల మోకాళ్లు, నడుము, తుంటి భాగాలపై సైతం ఒత్తిడి పెరుగుతుంది. దీంతో కీళ్ల నొప్పులు, నడవడంలో ఇబ్బంది, మెట్లు ఎక్కడం కష్టంగా అనిపించడం వంటి సమస్యలు కనిపించవచ్చు.

అలాగే బరువు ఎక్కువగా ఉన్న కొందరిలో రాత్రి నిద్రపోతున్నప్పుడు శ్వాస సరిగా అందకపోవడం, తరచూ గురక రావడం వంటి సమస్యలు కూడా కనిపిస్తాయి. దీనిని స్లీప్ అప్నియా అంటారు. మహిళల్లో అధిక బరువు వల్ల నెలసరి సక్రమంగా రాకపోవడం, హార్మోన్లలో మార్పులు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. కొన్ని రకాల క్యాన్సర్లు సైతం వచ్చే అవకాశం ఉన్నట్లు వైద్య పరిశోధనలు చెబుతున్నాయి.

అందుకే బరువు పెరుగుతున్న విషయాన్ని నిర్లక్ష్యం చేయకుండా.. ఆహారంలో అవసరం లేని కొవ్వులు, చక్కెరను తగ్గించడం, కూరగాయలు, పండ్లు, పప్పులు వంటి పోషకాహారాన్ని తీసుకోవడం, రోజూ శారీరకంగా చురుకుగా ఉండటం ముఖ్యం. బరువు ఎక్కువగా ఉన్నవారు ఒక్కసారిగా కఠినమైన డైట్‌లు చేయకుండా వైద్యులు లేదా పోషకాహార నిపుణుల సలహాతో క్రమంగా బరువు తగ్గడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!..

#Health#Blood pressure#cholesterol#blood sugar levels#Type 2 diabetes
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి