జీవితంలో ఒకరికి అయాచితంగా అదృష్టం వరిస్తే, మరొకరికి ఎంత కష్టపడినా నిరాశే ఎదురవుతుంటుంది. ఇలాంటి సమయంలో నాకే ఎందుకిలా జరుగుతోంది? అని చాలామంది అనుకునే ప్రశ్నకు సమాధానమే ఆధ్యాత్మిక శాస్త్రం చెప్పే కర్మ సిద్ధాంతం. వేదాంతం ప్రకారం మానవుడు పొందే ప్రతీ సుఖదుఃఖం, అనుభవం వెనుక ఒక కారణం ఉంటుంది. మనం గతంలో చేసిన ఆలోచనలు, మాటలు, పనుల ఫలితాలే మన ప్రస్తుత జీవితం అని చెబుతారు. ఇక ఈ కర్మలను శాస్త్రాలు ప్రధానంగా మూడు రకాలుగా వర్గీకరించాయి.
1. సంచిత కర్మ: గతం నుంచి వచ్చిన 'పాపం-పుణ్యాల' ఖాతా
గత అనేక జన్మల నుంచి మనం చేసిన మంచి, చెడు పనుల మొత్తం నిల్వనే సంచిత కర్మ అంటారు. ఇవి మన సూక్ష్మ శరీరంలో విత్తనాల రూపంలో దాగి ఉంటాయి. ఇవి ఇంకా అనుభవంలోకి రాలేదు, కానీ మన ఖాతాలో భద్రంగా ఉంటాయి. ఉదాహరణ.. ఒక పెద్ద ధాన్యపు గిడ్డంగి లో దాచిన నిల్వ లాంటిది సంచిత కర్మ.
2. ప్రారబ్ధ కర్మ: అనుభవించక తప్పని వర్తమాన ఫలితం
సంచిత కర్మల నిల్వ నుంచి ఈ ప్రస్తుత జన్మ అనుభవం కోసం వేరు చేయబడిన భాగమే ప్రారబ్ధ కర్మ. మన పుట్టుక, శరీరం, తల్లిదండ్రులు, ఆయుష్షు మరియు జీవితంలో ఎదుర్కొనే ప్రధానమైన మలుపులన్నీ ఈ ప్రారబ్ధం పైనే ఆధారపడి ఉంటాయి. ఉదాహరణ.. వింటి నుంచి ఇప్పటికే వదిలిన బాణం లాంటిది. ఒకసారి విల్లు దాటిన బాణాన్ని ఎలా వెనక్కి తీసుకోలేమో.. అలాగే ప్రారబ్ధాన్ని అనుభవించి మాత్రమే ముగించగలము.
3. ఆగామి కర్మ: భవిష్యత్తును నిర్దేశించే వర్తమాన చర్యలు
ప్రస్తుత జన్మలో మన స్వేచ్ఛా సంకల్పంతో కొత్తగా చేసే పనులను ఆగామి కర్మ అంటారు. ప్రారబ్ధం వల్ల కష్టాలు లేదా సుఖాలు ఎదురైనప్పుడు మనం స్పందించే తీరు, చేసే నూతన ఆలోచనలే ఆగామిగా మారతాయి. ఉదాహరణ.. ఈ రోజు పొలంలో చల్లుతున్న విత్తనాలు లాంటివి. ఈ రోజు మనం చేసే సత్కార్యాలే రేపటి మన భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి.
అందుకే ప్రారబ్ధం అనుభవించక తప్పదు, కానీ దానిని ధైర్యంగా స్వీకరించే మనస్తత్వాన్ని పెంచుకోవచ్చు.. అలాగే ఆగామి కర్మ ద్వారా రాబోయే కాలంలో నీ జీవితం ఎలా ఉండాలో నువ్వే నిర్మించుకోవచ్చు.. ఇక ధర్మబద్ధమైన జీవితం, సత్కార్యాలు, ఆధ్యాత్మిక సాధన ద్వారా ఆగామి కర్మను మంచి మార్గంలో పెడితే సంచిత కర్మల తీవ్రత తగ్గుతుందని వేదాంతం స్పష్టం చేస్తోంది.
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.


