ఓవైపు ఇండి కూటమి
మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ
నేటి నుంచే దేశవ్యాప్త పోరుబాట..
రోడ్డెక్కనున్న విపక్షాలు
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. ఇప్పటివరకు పార్లమెంట్, ప్రెస్‌మీట్లు, లేఖలు, న్యాయస్థానాల వేదికగా సాగిన పోరు.. ఇక నేరుగా ప్రజాక్షేత్రంలోకి రానుంది. గాంధీ జయంతి రోజైన నేటి నుంచే దేశవ్యాప్తంగా ఆందోళనలకు విపక్షాలు సిద్ధమయ్యాయి.
నేటి నుంచే ‘సేవ్ డెమోక్రసీ’ పోరాటం
అక్టోబర్ 2 నుంచి 8 వరకు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని INDIA కూటమి నిర్ణయించింది. జిల్లాల స్థాయిలో ఆందోళనలు నిర్వహించడం నుంచి భారీ ర్యాలీల వరకు.. దశలవారీగా ఉద్యమాన్ని విస్తరించేలా కార్యాచరణ రూపొందించింది.
ప్రధానంగా సీఈసీ రాజీనామా, ఓటర్ల జాబితా, ఎస్‌ఐఆర్ ప్రక్రియ, ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని విపక్షాలు భావిస్తున్నాయి.
ఢిల్లీలో నేతలు చేసే ఆరోపణలకే ఈ పోరాటాన్ని పరిమితం చేయకుండా.. రాష్ట్రాలు, జిల్లాలు, స్థానిక స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా కనిపిస్తోంది.
జిల్లా నుంచి ఢిల్లీ వరకు.. దశలవారీ ఉద్యమం
నేటి నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమాల్లో స్థానిక స్థాయిలో నిరసనలు, మార్చ్‌లు నిర్వహించనున్నారు. కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేపట్టేలా పార్టీ శ్రేణులను సమీకరించనున్నారు. ఇక యువత, సామాజిక సంస్థలు, ప్రజాస్వామ్య హక్కుల అంశాలపై పనిచేసే వర్గాలను కూడా ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి.
దీంతో ఈ వ్యవహారం కేవలం రాజకీయ పార్టీల మధ్య వివాదంగా కాకుండా ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో చర్చ జరిగే అంశంగా మార్చేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి.
అక్టోబర్ 6న కీలక ఘట్టం
ఈ ఉద్యమంలో మరో కీలకమైన రోజు అక్టోబర్ 6. ఆ రోజు విపక్ష ఎంపీలు ఢిల్లీలో ఎన్నికల సంఘం కార్యాలయం వైపు మార్చ్ చేపట్టేలా కార్యాచరణ రూపొందించారు. లోక్‌సభ, రాజ్యసభకు చెందిన ప్రతిపక్ష ఎంపీలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. దీంతో పార్లమెంట్‌లో సాగిన రాజకీయ పోరు.. నేరుగా ఎన్నికల సంఘం కార్యాలయం ముందు నిరసన రూపంలో కనిపించే అవకాశం ఉంది. అదే సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి తమ అభ్యంతరాలను వివరించేందుకు కూడా విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి.
ఐదు నగరాల్లో భారీ ర్యాలీలు
జిల్లా స్థాయి ఆందోళనలతో పాటు దేశంలోని ఐదు ప్రధాన నగరాల్లో భారీ ర్యాలీలు నిర్వహించాలన్నది కూడా విపక్షాల ప్లాన్‌లో ఉంది.
అంటే ఉద్యమాన్ని ఒకే రోజు నిర్వహించి ముగించే ఆలోచన కాకుండా.. వారం రోజుల పాటు వివిధ దశల్లో కార్యక్రమాలు నిర్వహించి రాజకీయ ఒత్తిడి పెంచే వ్యూహం కనిపిస్తోంది.
సీఈసీ రాజీనామా డిమాండ్‌తో మొదలైన ఈ ఉద్యమాన్ని.. ఓటర్ల జాబితా, ఎస్‌ఐఆర్, ఎన్నికల సంస్కరణల అంశాలతో అనుసంధానం చేసి విస్తృత రాజకీయ అంశంగా మార్చేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి.
CJP కూడా రోడ్డుపైనే...
ఇదే సమయంలో CJP కూడా సీఈసీకి వ్యతిరేకంగా నిరసనలకు పిలుపునిచ్చింది. అక్టోబర్ 2న ముంబైలోని శివాజీ పార్క్‌లో జైల్‌భరో కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కూడా నిరసనలకు పిలుపునిచ్చింది సీజేపీ. దీంతో నేటి నుంచే దేశ రాజధాని నుంచి ముంబై వరకు వేర్వేరు వేదికలపై ఆందోళనలు కనిపించే పరిస్థితి ఏర్పడింది.
అయితే నిరసన కార్యక్రమాలకు అనుమతులు, పోలీసుల ఆంక్షలు వంటి అంశాలు కూడా రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి.
బీజేపీ కౌంటర్ ఏంటి?
మరోవైపు విపక్షాల ఆరోపణలను బీజేపీ తిప్పికొడుతోంది. ఎన్నికల సంఘం పనితీరుపై రాజకీయంగా ఒత్తిడి తెచ్చేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఒకవైపు విపక్షాల నిరసనలు.. మరోవైపు బీజేపీ కౌంటర్.. ఇలా ఈ వ్యవహారం మరింత రాజకీయ రంగు పులుముకుంటోంది.
రోడ్డెక్కనున్న రాజకీయ పోరు!
ఇప్పటివరకు సభలు, సమావేశాలు, ప్రెస్‌మీట్లు, న్యాయస్థానాలకే పరిమితమైన సీఈసీ వివాదం.. నేటి నుంచి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెడుతోంది. అక్టోబర్ 2 నుంచి 8 వరకు వరుస నిరసనలు.. అక్టోబర్ 6న విపక్ష ఎంపీల ఈసీ మార్చ్.. ఐదు ప్రధాన నగరాల్లో భారీ ర్యాలీలు.. రాష్ట్రపతిని కలిసే ప్రయత్నాలు.. ఇలా ఉద్యమాన్ని దశలవారీగా ముందుకు తీసుకెళ్లేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి.
మరి ఈ పోరుబాట ఎంతవరకు విస్తరిస్తుంది? సీఈసీ రాజీనామా డిమాండ్ దగ్గరే ఆగుతుందా? లేక ఎన్నికల సంస్కరణల అంశంగా మారుతుందా? నేటి నుంచి దేశవ్యాప్తంగా మొదలయ్యే ఆందోళనలతో.. ఈ రాజకీయ సమరం ఏ మలుపు తిరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.












