Jupally Krishna Rao: మంత్రి జూపల్లి కృష్ణారావుని కళాకారులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. హైదరాబాద్ రవీంద్రభారతిలోని మంత్రి జూపల్లి ఆఫీస్ ముందు కళాకారులు ఆందోళనకు దిగారు. అర్హులైన కళాకారులకు ఉపాధి కల్పించాలని, తెలంగాణ సాంస్కృతిక సారధిలో వెయ్యి ఉద్యోగాలు భర్తీ చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో మంత్రి జూపల్లి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆందోళనకారులకు మంత్రి జూపల్లి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా కళాకారులు వినిపించుకోలేదు. దీంతో మంత్రి జూపల్లి వారిపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. మీకు నా మద్దతు కావాలంటే వెంటనే ఆందోళన విరమించి అక్కడి నుంచి వెళ్లిపోవాలని మంత్రి చెప్పారు. లేదంటే మీ ఇష్టం అని చెప్పారు.
కాగా, కొందరు మహిళా కళాకారిణులు కన్నీళ్లతో మంత్రి కాళ్ల మీద పడి వేడుకున్నారు. అయినా వారిని పట్టించుకోకుండా మంత్రి జూపల్లి అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. దీంతో మంత్రి వాహనాన్ని కళాకారులు అడ్డుకుని అక్కడే బైఠాయించారు. వు వాంట్ జస్టిస్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. కళాకారుల ఆందోళన, నినాదాలతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనకారులను అక్కడి నుంచి పక్కకు తరలించారు. పోలీసు భద్రత నడుమ మంత్రి జూపల్లి అక్కడి నుంచి తన వాహనంలో వెళ్లిపోయారు.
ఆ సమయంలో మంత్రి జూపల్లితో పాటు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అక్కడే ఉన్నారు. ఆందోళనకారులకు ఆయన సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఆందోళన విరమించి పక్కకు తప్పుకోవాలని కోరారు. కానీ, ప్రయోజనం లేకపోయింది. కళాకారులు ఆయన విజ్ఞప్తిని పట్టించుకోలేదు. రెండు రోజులుగా కళాకారులు మంత్రి ఆఫీసు ముందు ఆందోళనలు చేస్తున్నారు.
ఇవాళ మంత్రి జూపల్లి ఆఫీసు నుంచి బయటకు వెళ్లకుండా నిర్బంధించే ప్రయత్నం చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. ఎన్నికల సమయంలో తమకు ఉద్యోగాలు, పెన్షన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని కళాకారులు గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా తమకు ఇచ్చిన ఒక్క హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చలేదని కళాకారులు ఆరోపించారు. ఉపాధి కల్పనకు సంబంధించి మంత్రికి అనేకసార్లు వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేకుండా పోయిందని వారు వాపోయారు.


