Tollywood: ఆదర్శ కుటుంబం, బ్లాస్ట్ సినిమాల కథ ఒకటేనా? అవును..ప్రస్తుతం ఈ టాక్ సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది. ఇటీవలే యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా నటించిన బ్లాస్ట్ సినిమా వచ్చి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా టైటిల్ సరిగ్గా అర్థం కాక ఆడియన్స్‌కి అంతగా ఆసక్తి పెరగలేదు గానీ, సినిమా రిలీజ్ కి ముందు గనక కథలో ఉన్న కంటెంట్ ఏంటో తెలిస్తే భారీ హిట్ సాధించి ఉండేది.
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా నటించిన ‘బ్లాస్ట్’ మూవీలో ఆయనకి జతగా కేవలం ఒక యాక్షన్ హీరోయిన్ కాదు.. ఏకంగా ఒక కరాటే ఫ్యామిలీ ఉంది. తండ్రి, తల్లి, కూతురు.. ముగ్గురూ మార్షల్ ఆర్ట్స్‌లో నైపుణ్యం ఉన్నవారే. ఈ కుటుంబం అనుకోకుండా ఓ ప్రమాదకరమైన క్రిమినల్ గ్యాంగ్‌కు ఎదురుగా నిలబడటంతో కథలో అసలు యాక్షన్ మొదలవుతుంది.
సుభాష్ కె. రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్, థ్రిల్లర్, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను కలిపి తెరకెక్కింది. అర్జున్ సర్జాతో పాటు అభిరామి, ప్రీతి ముకుందన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2026 మే 28న థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సమస్య వస్తే..ఫ్యామిలీ అందరికీ వచ్చిన కరాటే స్టంట్స్‌తో ఎలా ఎదుర్కుంది..అన్న అంశాలను అద్భుతంగా చూపించారు.
అయితే, ఈ నెల అక్టోబర్ 9న రిలీజ్ కాబోతున్న వెంకటేష్ ఆదర్శ కుటుంబం సినిమాలో కథ కూడా కాస్త అటు ఇటుగా ఈ తరహాలోనే సాగుతుందని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, టీజర్‌లో వెంకీ ఫ్యామిలీ కూడా కరాటే చేస్తున్నట్టుగా హింట్ ఇచ్చారు. అప్పులు చేసే భార్య..చిన్న ఉద్యోగం చేస్తూ ఇబ్బందులు పడే భర్త..అనుకోకుండా వీరికి లక్కీ డ్రాలో కోట్లు వస్తే..దానికి, థ్రిల్లర్ అంశాలను జోడిస్తే వచ్చే ఎంటర్‌టైన్మెంట్ ఎలిమెంట్స్‌తో ఆదర్శ కుటుంబం తెరకెక్కినట్టుగా అర్థమవుతోంది. మరి, త్రివిక్రమ్ ఈ కథను ఎలా తయారు చేశాడు..ఆదర్శం ఏంటీ అనేది ఆదర్శ కుటుంబం వచ్చాక గానీ తెలీదు.


