తెలంగాణ

TG: కేంద్రం 25 శాతమే కొంటే మిగతా రైతులు ఏమైపోవాలి.. మంత్రి తుమ్మల సూటి ప్రశ్న!

రచన: Mahesh••4 నిమిషాల పఠనం

TG: రైతులు పండించిన పంటలకు నామమాత్రంగా మద్దతు ధరలు ప్రకటించి కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంటే సరిపోదని, ప్రకటించిన ప్రతి పైసా అన్నదాత చేతికి చేరేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర సర్కార్‌పై ధ్వజమెత్తారు.

TG: రైతులు పండించిన పంటలకు నామమాత్రంగా మద్దతు ధరలు ప్రకటించి కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంటే సరిపోదని, ప్రకటించిన ప్రతి పైసా అన్నదాత చేతికి చేరేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర సర్కార్‌పై ధ్వజమెత్తారు. ప్రకటనలతో సరిపెట్టడం కాకుండా, మద్దతు ధర ఖరారు చేసిన ప్రతి పంటనూ నూటికి నూరు శాతం కేంద్రమే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావంతో రైతాంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ఢిల్లీ పాలకుల చిత్తశుద్ధి రైతులకు రక్షణగా నిలవాలని ఆయన స్పష్టం చేశారు.

కేవలం 25 శాతమే కొంటే మిగతా రైతులు ఏమైపోవాలి?

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైస్ సపోర్ట్ స్కీమ్ (పీఎస్ఎస్) విధానంపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రాల్లో ఉత్పత్తయ్యే పప్పుధాన్యాలు, నూనెగింజల్లో నాఫెడ్ ద్వారా కేవలం 25 శాతం మాత్రమే సేకరించి చేతులు ఎత్తేయడం ఏంటని ఆయన నిలదీశారు. దీనివల్ల మెజారిటీ రైతులు మార్కెట్లో దళారుల చేతిలో మోసపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రబీ సీజన్‌కు సంబంధించి కుసుమ, ఆవాలు, మసూర్, బార్లీ, శనగ, గోధుమ పంటలకు పెంచిన మద్దతు ధర ప్రతి ఒక్క రైతుకూ దక్కాలంటే.. మొత్తం దిగుబడులను 100 శాతం కేంద్రమే కొనుగోలు చేయాలని తేల్చిచెప్పారు.

మండలం యూనిట్‌గా కరువు లెక్కలు..

రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై వ్యవసాయ, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి తుమ్మల అత్యున్నత సమీక్ష నిర్వహించారు. వర్షాలు లేక అల్లాడుతున్న ప్రాంతాలను గుర్తించి, మండలం యూనిట్‌గా కరువు మండలాల ప్రతిపాదనలను యుద్ధప్రాతిపదికన సిద్ధం చేయాలని ఆదేశించారు. కేవలం వర్షపాత లోటునే కాకుండా.. నేలలో తేమ, రిజర్వాయర్లలో నీటిమట్టాలు, భూగర్భజలాలు, విత్తిన విస్తీర్ణం, శాటిలైట్ సూచికలు, తాగునీరు, పశుగ్రాసం కొరత, వలసల వంటి సమగ్ర అంశాలను పరిగణనలోకి తీసుకుని నివేదికలు అందించాలని స్పష్టం చేశారు.

సాధారణంతో పోలిస్తే 20 నుంచి 59 శాతం వర్షపాత లోటు ఉంటే సాధారణ కరువుగా, 60 నుంచి 99 శాతం లోటు ఉంటే భారీ లోటుగా పరిగణిస్తారని, సాగు విస్తీర్ణం 75 శాతానికి పడిపోతే తీవ్ర కరువుగా నిర్ధారించి రైతులకు అండగా నిలవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, మార్కెటింగ్ ఎండీ రాహుల్ రాజ్, హార్టికల్చర్ ఎండీ యాస్మిన్ బాషా తదితరులు పాల్గొన్నారు.

#Telangana#Thummala Nageswara Rao#Agriculture Minister#MSP#Minimum Support Price#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి