Tollywood: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. రీసెంట్‌గా వచ్చిన ‘ఇరుముడి’ మూవీతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన.. ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో ‘సరిపోదా శనివారం’ ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రవితేజ నటించబోయే సినిమాపై ఆసక్తికరమైన వార్తలు వైరల్ అవుతున్నాయి.
వైరల్ అవుతున్న ‘తులాభారం’ టైటిల్!
రవితేజ–వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాకు ‘తులాభారం’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తాజాగా, ఈ టైటిల్ దాదాపుగా ఖరారైనట్టుగా పలు మీడియా మాధ్యమాలలో కథనాలు వచ్చాయి. అయితే, ఇప్పటివరకు చిత్రబృందం నుంచి మాత్రం అధికారికంగా టైటిల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. అందుకే, ప్రస్తుతానికి ‘తులాభారం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగానే భావించాలి.
హారర్ కామెడీ థ్రిల్లర్‌గా?
వివేక్ ఆత్రేయ తన సినిమాలను విభిన్నమైన కథనం, ప్రత్యేకమైన క్యారెక్టర్లు, కామెడీతో నడిపించడంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈసారి రవితేజ కోసం ఆయన కొత్త జానర్‌ను ఎంచుకున్నారని తెలుస్తోంది. ఈ సినిమా హారర్ కామెడీ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతుందని సమాచారం.
రవితేజ ఇప్పటివరకు మాస్ యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ, ఎంటర్‌టైనర్ వంటి పలు జానర్లలో నటించినప్పటికీ.. పూర్తి స్థాయి హారర్ కామెడీ నేపథ్యంలో ఆయన సినిమా చేయడం ఇదే మొదటిసారి కావడంతో ఈ సినిమాపై ఆసక్తి అంతకంతా పెరుగుతోంది. పైగా, ఇలాంటి జానర్ సినిమాలకి ఆడియన్స్ కూడా సపరేట్‌గా ఉంటారు. మరి, ఈ ప్రాజెక్ట్‌కి సంబందించిన హీరోయిన్ సహా మరిన్ని అఫీషియల్ కన్‌ఫర్మేషన్స్ ఎప్పుడు వస్తాయో చూడాలి.












